మరో 2,500 మెగావాట్లు అవసరం
- రాష్ట్ర విద్యుత్ సమస్యలపై సమీక్షలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ
- కేంద్ర విద్యుత్ మంత్రి గోయల్‌తో చర్చిస్తామని వెల్లడి
- రైతులకు కనీసం 12 గంటల విద్యుత్ అందేలా చర్యలు తీసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ సమస్య లకు త్వరలో పరిష్కారం లభించేలా కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి పీయూష్ గోయల్‌తో చర్చలు జరుపుతామని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. తెలంగాణలో విద్యుత్ సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మంగళ వారం హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రా నికి మరో 2,500 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉందని, రైతులకు కనీసం 12 గంటలు విద్యుత్ అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
దేశమంతటా 24 గంటల విద్యుత్ అందించాలన్నది ప్రధాని మోదీ సంక ల్పమని తెలిపారు. హైదరాబాద్‌లో భూగర్భ విద్యుత్ కేబుల్ లైన్లు నిర్మించాలని దత్తాత్రేయ చెప్పగా.. అందుకు రూ.350 కోట్లు అవసరమ వుతాయని అధికారులు తెలిపారు. వ్యవసా యానికి, వ్యవసాయేతర అవసరాలకు విడి విడిగా విద్యుత్ సరఫరా ఉండాలని దత్తాత్రేయ చెప్పారు. రాష్ట్రంలో ప్రతిఇంటికి విద్యుత్ సౌకర్యం కల్పించే ఉద్దేశంతో 9,150 గ్రామాల్లో 5.65 లక్షల ఇళ్లలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి రూ.3 వేల చొప్పున సబ్సిడీ కల్పించడానికి కేంద్రం రూ.1,107 కోట్లు కేటాయించిందని తెలిపారు.
నాణ్యమైన విద్యుత్‌కు సహాయం
దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజ నలో భాగంగా నాణ్యమైన విద్యుత్ అందించ డానికి రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేస్తామని దత్తాత్రేయ పేర్కొన్నారు. గ్రామీణ విద్యుత్ సంస్థ ద్వారా మూడేళ్లలో రూ.30 వేల కోట్లను రాష్ట్రానికి కేటాయించామన్నారు. వ్యవసాయ, వ్యవసాయేతర అవసరాలకు ప్రత్యేక లైన్లకు రూ.2,300 కోట్లు అవసరమని, స్మార్ట్ మీటర్ల కోసం రూ.788 కోట్లు అవసరం అవుతాయని రాష్ట్ర విద్యుత్ అధికారులు వివరించారని చెప్పారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీం నగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో వ్యవసాయ పంపు సెట్ల ద్వారా శక్తిని పొదుపు చేసేందుకు టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌కు రూ.1,543 కోట్లు మం జూరు చేశామన్నారు. సూర్యాపేటలో 400/ 200 కేవీ సబ్ స్టేషన్ స్థాపన పనుల కోసం, నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో 400/200 కేవీ సబ్ స్టేషన్ స్థాపన పనులకు రూ.1,107 కోట్లు టీఎస్ ట్రాన్స్‌కోకు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.
కాంగ్రెస్ కల్లోలం సృష్టించాలని చూస్తోంది
కాంగ్రెస్ పార్టీ అశాంతితో కొట్టుమిట్టాడుతూ అభివృద్ధి ఎజెండాను కాదని.. మతకల్లోలాలు సృష్టించాలని ప్రయత్నిస్తోందని దత్తాత్రేయ ఆరోపించారు. కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఒక వర్గాన్ని రెచ్చగొట్టే ఆరోపణలు చేయడం సముచితం కాదని ఒక ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. పోలీసులను అప్రతిష్టపాలు చేయడం సరైనది కాదని, జాతికి సంబంధించిన అంశంపై సంయమనంతో మాట్లాడాలన్నారు. దిగ్విజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత లెందుకు స్పందించలేదని ప్రశ్నించారు. దిగ్విజయ్‌పై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.