
సాక్షి, విశాఖపట్నం: దేశంలో పారిశ్రామికరంగంలో ఇంధన సామర్థ్య పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామంగా ఉందని, ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం బాగుందని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (డీడీజీ) అశోక్‌కుమార్ చెప్పారు. కేంద్ర విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలోని బీఈఈ సహకారంతో ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఎస్‌ఈసీఎం) విశాఖలో బుధవారం పెట్టుబడుల బజార్ పేరిట సదస్సు నిర్వహించింది.
పరిశ్రమలు, బ్యాంకులు, ఆర్థికసంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ సదస్సుని అశోక్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన సామర్థ్య ప్రాజెక్టుల ఏర్పాటుపై ఆసక్తి కనబరిచిన పెట్టుబడిదారులకు పూర్తి సహాయ సహకారాలు అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడం గొప్ప విషయమన్నారు.
ఇంధన సామర్థ్య రంగంలో జాతీయస్థాయిలో 13 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశం ఉందని తెలిపారు. ఈ విషయంలో ఏపీ ఇంధన పరిరక్షణ మిషన్ మొదటి అడుగు వేసిందని, వరుసగా ఇన్వెస్ట్‌మెంట్ బజార్స్ నిర్వహించడమే ఇందుకు నిదర్శనమని ప్రశంసించారు. పరిశ్రమలు, బ్యాంకులు, ఆర్థికసంస్థల నుంచి పెట్టుబడుల సదస్సులకు విశేష స్పందన లభించటం బీఈఈకి ఎంతో ప్రోత్సాహం అందిస్తోందన్నారు. ఏపీ ఆదర్శంగా ఇతర రాష్ట్రాల్లోనూ ఇన్వెస్ట్‌మెంట్ బజార్లు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.
ఇంధన సామర్థ్య పెట్టుబడులను ముందుకు తీసుకెళ్లేందుకు ఏపీఎస్‌ఈíసీఎం ఆధ్వర్యంలో ఆర్థికసంస్థల కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంధన సామర్థ్య సాంకేతికత అమలు చేసే పరిశ్రమలకు 5 శాతం వడ్డీ రాయితీ పథకాన్ని అమలు చేయాలని ఏపీఎస్‌ఈసీఎం చేసిన ప్రతిపాదన కేంద్ర ఆర్థికశాఖ పరిశీలనలో ఉందని చెప్పారు.
ఈ పథకం అమల్లోకి వస్తే రాబోయే ఐదేళ్లలో దాదాపు రూ.15 వేలకోట్ల విలువైన ఇంధన సామర్థ్య ప్రాజెక్టులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉందని తెలిపారు. వివిధ రంగాల్లో ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు విధానపరమైన ప్రమాణాలు రూపొందించడంలో ఏపీఎస్‌ఈíసీఎం ముఖ్య భూమిక పోషిస్తోందని ఆయన చెప్పారు.
నిరంతర సరఫరాకు విద్యుత్ వ్యవస్థ బలోపేతం
రాష్ట్ర ఇంధనశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ తరఫున ఏపీఎస్‌ఈసీఎం సీఈవో చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇది ఒక అద్భుత అవకాశమని చెప్పారు. ఇంధన సామర్థ్యంలో పెట్టుబడులకు ముందుకొచ్చే సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల పూర్తిస్థాయి సహాయ, సహకారాలందిస్తుందన్నారు.
ఇంధన సామర్థ్యం అభివృద్ధితో ఇంధన భద్రత లభిస్తుందని, ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు. ఈ రంగంలో ప్రభుత్వం వ్యయం తగ్గడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు దోహదకారిగా మారుతుందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరా వ్యవస్థని మరింత బలోపేతం చేసేందుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి శ్రమిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ సదస్సులో ఏపీఈపీడీíసీఎల్ డైరెక్టర్లు డి.చంద్రం, సూర్యప్రతాప్, పీఎఫ్‌సీ జనరల్ మేనేజర్ మదన్‌మోహన్, బ్యాంకర్లు, వివిధ ప్రభుత్వరంగ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.