సాక్షి, అమరావతి: ప్రస్తుతం దేశంలోనూ, రాష్ట్రంలోనూ నెలకొన్న విద్యుత్ కొరత నేపథ్యంలో ఏసీలను నిర్దిష్ట ఉష్ణోగ్రతలో వినియోగించడం ద్వారా విద్యుత్‌ను భారీగా ఆదా చేయవచ్చని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) తన తాజా అధ్యయనంలో వెల్లడించింది. బీఈఈ చెప్పిన అంశాల ప్రకారం.. దేశంలో ప్రస్తుతం 80 మిలియన్ టన్నుల రిఫ్రిజిరేషన్ (టీఆర్) వ్యవస్థాపించిన మొత్తం ఎయిర్ కండీషనర్ సామర్థ్యం ఉంది.
ఇది 10 సంవత్సరాలలోపు దాదాపు 250 మిలియన్ టీఆర్‌కు చేరుకునే ప్రమాదం ఉంది. 2030 నాటికి ఎయిర్ కండిషనింగ్‌తో దేశంలో విద్యుత్ లోడ్ సుమారు 200 గిగావాట్స్‌కు పెరుగుతుందని అంచనా. రాష్ట్రంలో ఏసీలకు ఏటా డిమాండ్ దాదాపు 3 వేల మిలియన్ యూనిట్లు. ఇది రాష్ట్రం మొత్తం విద్యుత్ వినియోగంలో 5 శాతంగా నమోదవుతోంది. ఈ క్రమంలోనే వినియోగదారులు తమ ఏసీల్లో డిఫాల్ట్ ఏసీ ఉష్ణోగ్రతను 24 డిగ్రీల సెల్సియస్‌కు సెట్ చేస్తే దేశంలో ఏటా రూ.10 వేల కోట్ల విలువైన దాదాపు 20 బిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేయవచ్చని బీఈఈ నివేదికలో పేర్కొంది.
పెంచితేనే మంచిది..
ఒక మనిషి 1.5 టన్నుల ఏసీని ఉపయోగిస్తే, అది గంటకు సుమారుగా ఒక యూనిట్ విద్యుత్‌ను వినియోగించి, దాదాపు 0.98 కిలోల కర్బన ఉద్గారాలను విడుదల చేస్తుంది. గది ఉష్ణోగ్రతలో 1 డిగ్రీ సెల్సియస్ పెరుగుదల వల్ల విద్యుత్తులో 6శాతం ఆదా చేయవచ్చని అధ్యయనంలో తేలింది. సాధారణ మానవ శరీర ఉష్ణోగ్రత సుమారు 36–37 డిగ్రీల సెల్సియస్. కానీ 18–21 డిగ్రీల సెల్సియస్‌కు ఏసీ ఉష్ణోగ్రతను తగ్గిస్తుంటారు. దీనివల్ల శ్వాసకోశ సమస్యలు, ఎముకల సమస్య, తలనొప్పి, కళ్లు, చర్మం పొడిబారడం, అల్పోష్ణస్థితి, అధిక రక్తపోటు (బీపీ) వంటి రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని వినియోగదారులు ఏసీ ఉష్ణోగ్రతను 24 డిగ్రీల సెల్సియస్‌కు సర్దుబాటు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్‌ఈసీఏం) విజ్ఞప్తి చేస్తోంది.
ఏపీఎస్‌ఈసీఎం సూచనలు
► వేడిగాలి ఇంట్లోకి రాకుండా ఉండేలా కిటికీలు, కర్టెన్లను మూసివేయాలి.
► ఎయిర్ ఫిల్టర్లను శుభ్రంగా ఉంచాలి. ప్రతి 30 నుంచి 90 రోజులకు వాటిని శుభ్రపరచడం లేదా కొత్తవాటిని మార్చడం ద్వారా ఏసీ యూనిట్‌లో గాలి సజావుగా కదులుతుంది.
► వేడిని ఉత్పత్తి చేసే పరికరాలు, ఉపకరణాలను థర్మోస్టాట్‌కు దూరంగా ఉంచాలి.
► సాధ్యమైనంత వరకూ సీలింగ్ ఫ్యాన్లను ఉపయోగించాలి.
► గది నుంచి బయటకు వెళ్లేటప్పుడు లైట్లు, ఫ్యాన్లు, టీవీలు, మొబైల్ చార్జర్లు, ఏసీల స్విచ్‌లను ఆఫ్ చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment