
సాక్షి, న్యూఢిల్లీ: రాయలసీమ కరువు నివారణ పథకం, వైఎస్సార్ పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించాలని కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్.కె.సింగ్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి విన్నవించారు. బుధవారం ఈ మేరకు ఆయన కేంద్రమంత్రితో సమావేశమయ్యారు. రాయలసీమ కరువు నివారణ పథకానికి ఎలక్ట్రో–మెకానికల్ కాంపోనెంట్ కింద రూ.12,012 కోట్లు, వైఎస్సార్ పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టుకు ఎలక్ట్రో–మెకానికల్ కాంపోనెంట్ కింద రూ. 3,008 కోట్ల మేర ఆర్థిక సాయం చేయాలని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఆర్‌ఈసీ లిమిటెడ్‌ను కోరామని ఎంపీ తెలిపారు. ఈ రెండు ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తూ, మార్కెట్ ధరకే రుణం ఇచ్చి రాష్ట్రంపై ఆర్థికంగా అదనపు భారం లేకుండా చూడాలని, ఆ మేర ఆయా సంస్థలకు ఆదేశాలు ఇవ్వాలని మంత్రిని విజయసాయిరెడ్డి కోరారు.