డిస్కంలను ప్రైవేటీకరించే ఆలోచన లేదు  | KTR On Privatisation Of Discoms | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 8 2019 1:39 AM | Last Updated on Tue, Jan 8 2019 1:39 AM

KTR On Privatisation Of Discoms - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేస్తూ, తెలంగాణ ప్రభుత్వానికి దేశంలోనే మంచి గుర్తింపును తీసుకొచ్చిన డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్‌పరం చేయబోమని, అలాంటి ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు స్పష్టం చేశారు. సోమవారం రాత్రి ఇక్కడి మింట్‌ కాంపౌండ్‌లో జరిగిన తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ నూతన సంవత్సర డైరీ–2019 ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భవిష్యత్‌లో తెలంగాణ విద్యుత్‌రంగం భారీ సవాళ్లను ఎదుర్కోబోతుందని, వాటిని ముందే పసిగట్టి, సమస్యను అధిగమించే స్థాయికి చేరుకోవాలని సూచించారు. ప్రైవేట్‌ సంస్థలతో పోటీపడే సత్తా సంపాదించుకొని ప్రకృతి వైపరీత్యాలను సైతం తట్టుకొని నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేసే స్థాయికి డిస్కంలు చేరుకున్నప్పుడే వినియోగదారుల్లో నమ్మకం పెరుగుతుందన్నారు. తద్వారా ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుందన్నారు.

చౌక విద్యుత్‌ ఇస్తేనే పెట్టుబడులు వస్తాయి... 
పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించే విషయంలో కేవలం రాష్ట్రాల మధ్యే కాకుండా దేశాల మధ్య కూడా పోటీ నెలకొందని కేటీఆర్‌ అన్నారు. నిరంతరాయ విద్యుత్‌ సరఫరాతోపాటు దానిని తక్కువ ధరకు అందించే రాష్ట్రాలకే పెట్టుబడులొస్తాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయంటే అది ఇంజనీర్ల కృషి వల్లేనని పేర్కొన్నారు. ఉద్యోగుల సమర్థత, ప్రభుత్వ కార్యదక్షత వల్ల విద్యుత్‌ సరఫరాలో దేశంలోనే తెలంగాణ ముందుందన్నారు. యూరప్‌లో ఇప్పటికే స్మార్ట్‌మీటర్‌ సిస్టం అమల్లో ఉందని, తెలంగాణ కూడా ఆ దిశగా ముందుకు సాగాల్సిన అవసరముందని సూచించారు. యూజీ కేబుల్‌ విషయంలో దేశంలోనే తమిళనాడు ముందుందని, ఇది ఖర్చుతో కూడుకున్నదని, దీనికి అవసరమైన నిధులు కావాలంటే కేంద్రంలో మనపాత్ర కీలకంగా ఉండాలన్నారు. ఒకప్పుడు కరెంట్‌ కోతలపై విద్యుత్‌ సిబ్బందిని ఆఫీసుల్లో నిర్బంధించిన సందర్భాలున్నాయని, ఇంట్లో ఎవరైనా మరణిస్తే స్నానం చేసేందుకు కరెంట్‌ ఇవ్వాల్సిందిగా అధికారులను వేడుకోవాల్సి వచ్చేదని గుర్తుచేశారు. తెలంగాణలో ఇప్పుడా దుస్థితి లేదన్నారు. విద్యుత్‌సంస్థలు, ఉద్యోగుల బాగోగులను సీఎం స్వయంగా చూసుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ రంగంపై ఆయనకు ప్రత్యేక అభిమానం ఉందని చెప్పారు. ఇంజనీర్లు కోరిన ఇండ్లస్థలాలు, పెన్షన్‌ మంజూరు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, సీపీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి, ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ గోపాల్‌రావు, ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శివాజీ, కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement