సాక్షి, అమరావతి: ఇంధన శాఖలో కేంద్రం ప్రవేశపెట్టిన ‘పునరుద్ధరించిన పంపిణీ రంగ పథకం’ సాయంతో విద్యుత్ పంపిణీ వ్యవస్థలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. విద్యుత్ పంపిణీ సంస్థలకు చేయూతనందించి వాటిని బలోపేతం చేయడం ద్వారా వినియోగదారులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం కాగా దానికయ్యే వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 3:2 నిష్పత్తిలో భరిస్తాయి.
నష్టాలను తగ్గించి..
పథకంలో భాగంగా డిస్కంలు 2024–2025 నాటికి అగ్రిగేట్ ట్రాన్స్‌మిషన్, కమర్షియల్(ఏటీసీ) నష్టాలను 12–15 శాతానికి తగ్గించాలి. విద్యుత్ సరఫరా సగటు వ్యయం (ఏసీఎస్) అగ్రిగేట్ రెవిన్యూ రిపోర్ట్ (ఏఆర్‌ఆర్) మధ్య అంతరాన్ని కూడా తగ్గించాల్సి ఉంటుంది. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయడం, ట్రాన్స్‌మిషన్, పంపిణీ నష్టాలను తగ్గించడం, నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడం, సౌర విద్యుత్ సరఫరాకు అనువుగా వ్యవసాయ విద్యుత్ ఫీడర్‌లను వేరు చేయడం వంటి కార్యక్రమాలను డిస్కంలు చేపట్టాలి.
వినియోగదారులకు ప్రయోజనం
పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడం, ఫీడర్లు వేరు చేయడం వల్ల వ్యవసాయానికి ఉచిత విద్యుత్ నేరుగా అందడంతో పాటు మిగతా వినియోగదారులకు విద్యుత్ అంతరాయాల్లో సమస్యలు తలెత్తవు. నష్టాలు తగ్గడం వల్ల విద్యుత్ పంపిణీ సంస్థలు వినియోగదారులపై వేసే చార్జీల భారం కూడా తగ్గుతుంది. వార్షిక ఆదాయ, వ్యయ నినేదికలు సకాలంలో సమర్పించడం, టారిఫ్ పిటిషన్‌ను సకాలంలో దాఖలు చేయడం, టారిఫ్ ఆర్డర్‌ల జారీ, యూనిట్ వారీగా సబ్సిడీ అకౌంటింగ్, ఇంధన ఖాతాల ప్రచురణ, కొత్త వినూత్న సాంకేతికతలను అనుసరించడం వంటి చర్యలతో డిస్కం లలో జవాబుదారీతనం పెరుగుతుంది.
ఇప్పటికే మొదలు
విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసి రైతులకు, ఇతర వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ (సెకీ) నుంచి వ్యవసాయానికి 9 గంటలు ఉచిత సౌర విద్యుత్‌ను 25 ఏళ్లపాటు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, కేబినెట్ కూడా ఆమోదం తెలిపాయి. వ్యవసాయ ఫీడర్లను వేరుచేసే ప్రక్రియ కూడా మొదలైంది. విశాఖపట్నంలో గృహ విద్యుత్ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసి, ఫలితాలను అక్కడి డిస్కం పర్యవేక్షణలో అధ్యయనం చేయిస్తోంది. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా విద్యుత్ కొనుగోళ్లలో ఆదా చేస్తోంది. ఆ మొత్తాన్నీ ట్రూ డౌన్ కింద తిరిగి వినియోగదారులకే తిరిగి ఇస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment