సాక్షి, అమరావతి: సంప్రదాయేతర ఇంధన ప్రాజెక్టుల కేటాయింపు, వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు, విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు ట్రాన్స్‌ఫార్మర్ల సరఫరా కాంట్రాక్టు నిర్ధారణతో సహా అన్ని విషయాల్లో ప్రస్తుత ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు అత్యంత పారదర్శకతో వ్యవహరించాయి. అన్ని అంశాల్లో అత్యంత పకడ్బందీగా నిబంధలను పాటించినప్పటికీ ఈనాడుతో సహా కొన్ని పచ్చ పత్రికలు ప్రభుత్వం, ఇంధన సంస్థలపై పదేపదే అసత్య ప్రచారం చేస్తూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి.
ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించినట్లు శుక్రవారం వార్తలు ప్రచురించాయి. అయితే, సోమిరెడ్డి మాటల్లో నిజంలేదని, ఈనాడు, ఇతర పచ్చపత్రికల్లో రాతలన్నీ పచ్చి అబద్ధాలని ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) సీఎండీ పద్మజనార్ధనరెడ్డి స్పష్టంచేశారు.
ఆరోపణ : ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోళ్ల పేరుతో జగన్ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడింది..
వాస్తవం : కేంద్ర ప్రభుత్వానికి చెందిన గవర్నమెంట్ ఈ–మార్కెట్ ప్లేస్ (జీఈఎం) పోర్టల్, ఏపీ ప్ర భుత్వ ఈ–ప్రొక్యూర్‌మెంట్ ద్వారా ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోలు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించారు. దేశంలో అర్హత గల ప్రతి గుత్తేదారు (కాంట్రాక్టరు) పాల్గొనే అవకాశం కల్పించారు. రివర్స్ టెండరింగ్ జరిపిన తర్వాతే ఏపీఎస్పీడీసీఎల్ పరికరాలను కొనుగోలు చేస్తోంది. అన్ని నిబంధనలు పరిశీలించిన తరువాత, ఈ ప్రక్రియలో పాల్గొన్న అందరిలో ఎల్–1గా ఉన్న గుత్తేదారుని ఎంపిక జరుగుతుంది. నామినేషన్ పద్ధతిలో ట్రాన్స్‌ఫార్మర్లను కొనుగోలు చేయడమనేది అసలు వీలుపడదు.
ఆరోపణ : ఎలాంటి అనుభవంలేని సంస్థకు ప్రభుత్వం వేల కోట్ల ప్రాజెక్టులు కట్టబెట్టింది..
వాస్తవం : షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ అనేది చిన్న సంస్థ ఏమీకాదు. ఈ సంస్థకు 25 ఏళ్లుగా విద్యుత్ ట్రా న్స్‌ఫార్మర్ల తయారీలో అనుభవం ఉంది. నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లే బొరేటరీస్ (ఎన్‌ఏబీఎల్) గుర్తింపుతో ఆసియాలోనే అతిపెద్ద ట్రాన్స్‌ఫార్మర్ల తయారీ సంస్థ. 2022 సంవత్సరానికి ప్రతిష్టాత్మక రాష్ట్రపతి అవార్డు వచ్చిన విషయం బహుశా సోమిరెడ్డికి తెలియదేమో.
ఆరోపణ : ఏపీసీపీడీసీఎల్ పరిధిలో 611.40 కోట్ల విలువైన పనులకుగానూ రూ.380 కోట్ల విలువైన పనులకు షిరిడీ సాయికే కట్టబెట్టింది..
వాస్తవం : తక్కువ ధరకు కోట్‌చేసిన సంస్థలు టెండర్లు దక్కించుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ–ప్రొక్యూర్‌మెంట్ ప్రక్రియను ప్రారంభించినప్పటి నుంచి అత్యంత పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ సాగుతోంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వివిధ కెపాసిటీల కు సంబంధించి 53,003 ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోళ్ల టెండర్లను షిరిడిసాయి సంస్థ దక్కించుకుంది.
అలాగే, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో 35,911 ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోళ్ల టెండర్లనూ పొందింది. గత ప్రభుత్వంలోనే హెచ్‌వీడీఎస్, వివిధ సబ్–స్టేషన్ల నిర్మాణ పనులకు సంబంధించి రూ.2,799.38 కోట్ల విలువైన పనులను షిరిడిసాయి సంస్థ కైవసం చేసుకుంది. నిజంగా ఇది సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి కావాల్సిన వారి సంస్థ అయితే గత ప్రభుత్వ హయాంలో ఎందుకు టెండర్లు కట్టబెట్టారు?
ఆరోపణ : రామాయపట్నం పోర్టు దగ్గర రూ.42 వేల కోట్ల ప్రాజెక్టు షిరిడీ సాయికి ఇచ్చింది..
వాస్తవం : రామాయపట్నం పోర్టు దగ్గర సోలార్ ప్యానల్ తయారీ పార్కు అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్టు. దీని కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయంలేదు. దీనిబట్టే ఈ కంపెనీ అన్ని అర్హతలున్న పెద్ద సంస్థ అని, దిగ్గజ సంస్థలను కాదని కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు దక్కించుకుందని అర్థమవుతోంది. రాష్ట్రంలో సంప్రదాయేతర విద్యుత్ ప్రాజెక్టుల కేటాయింపులన్నీ పూర్తి చట్టబద్ధంగా జరిగాయి.
ఆరోపణ : పక్కపక్క రాష్ట్రాలు కొన్న ట్రాన్స్‌ఫార్మర్ల ధరల్లో వ్యత్యాసం ఉందంటే దోపిడీ జరిగినట్లే కదా..
వాస్తవం : ట్రాన్స్‌ఫార్మర్ ధర దానిలో ఉపయోగించే వైండింగ్ వైర్ డయామీటర్, కాయిల్స్ డయామీటర్, ఇన్సులేషన్, క్లియరెన్స్, ట్యాంక్ డైమెన్షన్, ట్రాన్స్‌ఫార్మర్, ఆయిల్ క్వాంటిటీ, కోర్ సైజు వంటి నాణ్యతలను బట్టి ఉంటుంది. టెండర్లు వేసిన సమయంలో కోవిడ్, ఉక్రెయిన్ యుద్ధంవల్ల ట్రాన్స్‌ఫార్మర్లలో ఉపయోగించే పరికరాల ధరలు అధికంగా ఉండేవి. ఏపీఎస్పీడీసీఎల్ కొనుగోలు చేసిన నియంత్రికల్లో నష్టాలు ఇండియన్ స్టాండర్డ్స్ (ఐఎస్) కన్నా చాలా తక్కువ.
వివిధ కంపెనీల ట్రాన్స్‌ఫార్మర్లను బెంగుళూరులోని సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీపీఆర్‌ఎస్‌ఐ) టెస్ట్‌చేసి షిరిడిసాయి, తోషిబా నియంత్రికల్లో నష్టాలు ఐఎస్ ప్రకారం వున్నాయని ధృవీకరించడం విశేషం. ఇతర కంపెనీల ఉత్పత్తిదారుల ట్రాన్స్‌ఫార్మర్లు ఈ టెస్టులో ఫెయిలయ్యాయి. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ (బీఈఈ) నిర్ధేశించిన విధంగా మన డిస్కంలు ప్రస్తుతం ఫైవ్‌స్టార్ రేటింగ్ ట్రాన్స్‌ఫార్మర్లు కొనుగోలు చేస్తున్నాయి. దీనివల్ల ట్రాన్స్‌ఫార్మర్ల వైఫల్యాలు బాగా తగ్గాయి. రైతులకు వ్యవసాయ విద్యుత్ సరఫరా సమస్యలు తగ్గుముఖం పట్టాయి. కానీ, సోమిరెడ్డి మాత్రం టూ–స్టార్‌తో ఫైవ్‌స్టార్ ధరను సరిపోల్చారు. తెలంగాణ డిస్కంలు టూ స్టార్ రేటింగ్ ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు కొనుగోలు చేశాయి.
ఆరోపణ : కడప కంపెనీదే హవా..
వాస్తవం : ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోలు టెండరు పొందింది షిరిడిసాయి సంస్థ ఒక్కటే కాదు.. దీనితోపాటు హైపవర్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్, కన్యకాపరమేశ్వరీ ఇంజినీరింగ్ లిమిటెడ్ (మెదక్ జిల్లా), బీఎస్సార్ పవర్ కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (తెనాలి), సాయిబాబా ఫ్లేమ్ ఫ్రూఫ్ స్విచ్‌గేర్, ట్రాన్స్‌కాన్ ఇండస్ట్రీస్, తోషిబా ట్రాన్స్‌విుషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ట్రినిటీ క్లీన్‌టెక్(హైదరాబాద్), ఎస్వీఆర్ ఎలక్ట్రికల్స్, విజయ్ ట్రాన్స్‌ఫార్మర్స్ (గుంటూరు) సంస్థలు కూడా కాంట్రాక్టు పొందిన వాటిలో ఉన్నాయి.
ఆరోపణ : వ్యవసాయ మీటర్లకు ఉచితంగా స్మార్ట్ మీటర్లు అమర్చుతామని చెబుతున్న ప్రభుత్వం ఆ భారాన్ని ప్రజలపై వేస్తోంది..
వాస్తవం : దేశవ్యాప్తంగా అమలవుతున్న కేంద్ర ఇంధన శాఖ నిబంధనల మేరకే స్మార్ట్‌మీటర్ల ఏర్పాటుకు టెండరు నిబంధనావళి తయారైంది. వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌మీటర్లు ఉచితమే. ఇక ఏపీఈఆర్‌సీ నిర్ణయించిన దాని ప్రకారమే ట్రూఅప్ వంటి విద్యుత్ చార్జీలు ఉంటాయి.
Fact Check: నిబంధనలు పాటించినా ఏడుపే!?
Published Sun, Oct 29 2023 5:31 AM | Last Updated on Sun, Oct 29 2023 3:01 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment