సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 59.19 లక్షల స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ, ఇంధన శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఆయన మంగళవారం సచివాలయంలో విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీలతోను, అటవీ, పోలీసు అధికారులతోను వేర్వేరుగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. డిస్కంల సీఎండీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో ఈ ఏడాది డిసెంబర్ నాటికి 46.41 లక్షల స్మార్ట్ మీటర్లు, 2025 మార్చి నాటికి మరో 12.77 లక్షల స్మార్ట్ మీటర్లు బిగించాల్సి ఉందని చెప్పారు. విద్యుత్ సరఫరాలో సాంకేతిక నష్టాలు, విద్యుత్ చౌర్యాలు, ఓవర్ లోడ్, లో ఓల్టేజీ వంటి సమస్యల నియంత్రణకు పటిష్టచర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తున్న ట్రాన్స్‌ఫార్మర్లు ఫెయిలయితే వారం రోజుల్లో మార్చాలని ఆదేశించారు. ఈ విషయంలో రోజుల తరబడి జాప్యం చేస్తున్నారనే విమర్శలున్నాయన్నారు. సీఎండీలు దీనిపై దృష్టిసారించి క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. ట్రాన్స్‌ఫార్మర్ల నాణ్యత విషయంలో రాజీపడకూడదన్నారు. ఇందుకోసం మొత్తం రూ.4,113 కోట్లు వ్యయం అవుతుందని తెలిపారు.
జగనన్న కాలనీలు సీఎం మానస పుత్రికలు
జగనన్న కాలనీలు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మానస పుత్రికలని, వీటికి విద్యుత్ సదుపాయాన్ని కల్పించడాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదలకు ఇళ్లస్థలాలు, పక్కాగృహాలను మంజూరు చేశారని, వాటికి అన్ని వసతులను కల్పించాలనే సీఎం లక్ష్యానికి అనుగుణంగా విద్యుత్ దీపాలు, గృహ విద్యుత్ కనెక్షన్లు, మంచినీటి సరఫరాకు విద్యుత్ సదుపాయం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. సమావేశంలో ఇంధనశాఖ కార్యదర్శి బి.శ్రీధర్, ట్రాన్స్‌కో విజిలెన్స్ జేఎండీ మల్లారెడ్డి, డిస్కంల సీఎండీలు కె.సంతోషరావు, జె.పద్మాజనార్దన్‌రెడ్డి, హెచ్.హరనాథ్‌రావు, ఇంధనశాఖ డిప్యూటీ సెక్రటరీ కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
సరిహద్దు రాష్ట్రాల అధికారులతో సమన్వయ సమావేశాలు
ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు సరిహద్దు రాష్ట్రాల అటవీ, పోలీస్ అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. అటవీ, పోలీసు అధికారులతో ఎర్రచందనంపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి స్మగ్లర్లు అక్రమ రవాణాకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో వెంటనే ఆ రాష్ట్రాల అటవీ, పోలీసు అధికారులతో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. సీఎం వైఎస్ జగన్‌తో చర్చించి అవసరమైతే పొరుగు రాష్ట్రాల మంత్రుల స్థాయి సమావేశం కూడా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
వైఎస్సార్, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 5.30 లక్షల హెక్టార్లలో ఉన్న ఎర్రచందనాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని చెక్‌పోస్టుల్లో నిఘాను మరింత పటిష్టం చేయాలని, స్మగ్లింగ్‌కు పూర్తిస్థాయిలో చెక్ పెట్టాలని కోరారు. ఎర్రచందనంపై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ను బలోపేతం చేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,376.043 మెట్రిక్ టన్నుల సీజ్‌చేసిన ఎర్రచందనం నిల్వలున్నాయని, వీటి విక్రయానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్, అటవీదళాల అధిపతి ప్రతీప్‌కుమార్, అదనపు పీసీసీఎఫ్ (విజిలెన్స్) గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో 59.19 లక్షల స్మార్ట్ మీటర్లు
Published Wed, Apr 27 2022 4:36 AM | Last Updated on Wed, Apr 27 2022 7:32 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment