ఇంటింటికీ స్మార్ట్‌ మీటర్లు | Peddireddy Ramachandra Reddy On Smart Meters | Sakshi
Sakshi News home page

ఇంటింటికీ స్మార్ట్‌ మీటర్లు

Published Mon, Oct 17 2022 5:50 AM | Last Updated on Mon, Oct 17 2022 6:00 AM

Peddireddy Ramachandra Reddy On Smart Meters - Sakshi

సాక్షి, అమరావతి: సంప్రదాయ విద్యుత్‌ మీటర్ల స్థానంలో దేశవ్యాప్తంగా దాదాపు 25 కోట్ల స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్‌ను ఏపీలో అమలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)ల సీఎండీలతో మంత్రి పెద్దిరెడ్డి ఆదివారం టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు.

స్మార్ట్‌ మీటర్ల వల్ల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్, కచ్చితమైన విద్యుత్‌ బిల్లులు, ఉత్తమ సేవలు అందుతాయని మంత్రి వెల్లడించారు. విద్యుత్‌ సంస్థల్లో జవాబుదారీతనం, పారదర్శకత  పెరగడంతో పాటు  సాంకేతిక, వాణిజ్య నష్టాలు తగ్గేందుకు ఇవి దోహదపడతాయని ఆయన అన్నారు. 

బ్రిటన్, కేంద్ర అధికారుల భేటీ
ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ మాట్లాడుతూ.. బ్రిటిష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ గేరేత్‌ విన్‌ ఓవెన్, బ్రిటిష్‌ హై కమిషన్‌ ఇంధన సలహాదారు సుష్మిత రామోజీ, కేంద్ర ప్రభుత్వ అధికారులు రాష్ట్ర  ఇంధన శాఖ అధికారులను రెండు రోజుల క్రితం కలిసి ఏపీలో చేపట్టనున్న స్మార్ట్‌ మీటర్ల ప్రాజెక్టుపై చర్చించారని మంత్రికి వివరించారు.

ఈ మీటర్లు ఇంటర్నెట్‌కు అనుసంధానించడం వల్ల విద్యుత్‌ వినియోగ వివరాలు డిస్కంలకే గాక వినియోగదారులకు కూడా ఏరోజుకారోజు అందుబాటులో ఉంటాయన్నారు. విద్యుత్‌ చౌర్యం వంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, వోల్టేజీ హెచ్చుతగ్గులను స్మార్ట్‌ మీటర్‌ రికార్డు చేస్తుందని వివరించారు. కాగా, ఏపీ ఈపీడీసీఎల్‌ పరిధిలోని 5 సర్కిళ్లలో స్మార్ట్‌ మీటర్‌ ప్రాజెక్టు అమలుకు రూ.947.15 కోట్ల అంచనాతో ప్రతిపాదనలను రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి సమర్పించినట్టు డిస్కం సీఎండీ కె.సంతోషరావు తెలిపారు. ఏపీ సీపీడీసీఎల్‌ సీఎండీ జె.పద్మజనార్ధనరెడ్డి, ఏపీ ఎస్‌ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement