
పుంగనూరు (చిత్తూరు జిల్లా): ‘విద్యుత్ వినియోగంపై ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ మీటర్లపై అసత్య కథనాలు వల్లించి, విష ప్రచారం చేసి, టెండర్లకు ఎవరినీ రానీయకుండా చేయడమే ఈనాడు యాజమాన్యం లక్ష్యమా? ఆరోపణలు చేసే వారు టెండర్లు దాఖలు చేయండి.. ప్రభుత్వం ఎంత పారదర్శకంగా పనిచేస్తుందో మీకే అర్థమవుతుంది’ అంటూ రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, గనుల శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈనాడు కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పుంగనూరు మండలం కురప్పల్లెలో గురువారం తొలిరోజు పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల విషయంలో ఆర్‌టీఎస్‌ఎస్ కింద కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు టెండర్లను ఆహ్వానించినట్టు తెలిపారు. ఈనాడులో రాసిన మేరకు షిరిడీసాయి ఎలక్ట్రికల్ వర్క్స్‌వారికి పనులు అప్పగించామని, సాధారణ మీటర్ల ధరతో పోల్చితే అధికంగా ఉందనడం బాధాకరమన్నారు.
ఈనాడు పత్రిక తనకు నచ్చిన వారితో టెండర్లు వేసుకోవాలన్నారు. టెండర్లు జరగకుండా పనులు కేటాయించే ప్రసక్తే లేదని చెప్పారు. తెలిసీతెలియకుండా రాయడం మంచిదికాదని, ఇలాంటి విషయాల్లో తగిన సమాచారం సేకరించి వార్తలు రాస్తే బాగుంటుందని హితవుపలికారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్ కొండవీటి నాగభూషణం, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి పాల్గొన్నారు.