‘స్మార్ట్ మీటర్లపై టీడీపీ, కమ్యూనిస్టులు తప్పుడు ప్రచారం’ | Minister Peddireddy Ramachandra Reddy Clarity On Smart Meters | Sakshi
Sakshi News home page

‘స్మార్ట్ మీటర్లపై టీడీపీ, కమ్యూనిస్టులు తప్పుడు ప్రచారం’

Published Sun, Mar 19 2023 3:54 PM | Last Updated on Sun, Mar 19 2023 4:07 PM

Minister Peddireddy Ramachandra Reddy Clarity On Smart Meters - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని వ్యవసాయ పంపుసెట్లకు గానూ 18.57 లక్షల స్మార్ట్ మీటర్లు అమర్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, శాస్త్ర-సాంకేతిక, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ...

1)స్మార్ట్ మీటర్లు కొనుగోలు, ఇన్స్టలేషన్, నిర్వహణ  కోసం మొత్తం రూ. 3,406.14 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. అలాగే మీటర్లు, ట్రాన్స్ ఫార్మర్లు, రక్షణ అనుబంధ పరికరాల కోసం 2286.22 కోట్లు అవసరం అవుతుందని అంచనా వేయడం జరిగింది. 5692.36 కోట్లు ఆయా సంవత్సరాల బడ్జెట్ లలో కేటాయించడం ద్వారా దీనిని ప్రభుత్వం భరిస్తోంది. 

2)  కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌ఆర్బీఎం లిమిట్ పెంచడానికి పెట్టిన కండీషన్ కోసం రైతులకు ఇచ్చే విద్యుత్ కు మీటర్లు పెట్టామని తెలుగుదేశం సభ్యులు ఆరోపించడం భావ్యం కాదు. రైతులందరికి మేలు చేసేలా వారు వినియోగించిన విద్యుత్ బిల్లులను డిబిటి ద్వారా డబ్బులు వారి ఖాతాలకు జమచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం స్మార్ట్ మీటర్లు భిగించడం ద్వారా ఏ రైతు ఎంతమేర విద్యుత్ ను వినియోగిస్తున్నాడనే లెక్కలు తేల్చడం కోసమే పైలెట్ ప్రాజెక్ట్ గా శ్రీకాకుళం జిల్లాలో దీనిని ప్రారంభించాము. అక్కడ డిఆర్బిఎ మీటర్లు పెట్టాం. 1.9.2020, జిఓ నెం. 22 ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో 18వేల ఉచిత వ్యవసాయ కనెక్షన్లు ఉండటం వల్ల అందుబాటులో ఉన్న ఐఆర్డిఎ మీటర్లు, అనుబంధ సామగ్రితో  ఈ జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ గా అమలు చేశాం.

3)  శ్రీకాకుళం జిల్లాల్లో 2021 ఆర్థిక సంవత్సరంలో ఉచిత విద్యుత్ కోసం వినియోగించిన విద్యుత్ 101.5 మిలియన్ యూనిట్లు ఉంటే మీటర్లు ఏర్పాటు వల్ల 67.76 మిలియన్ యూనిట్ల వినియోగం జరిగినట్లు తేలింది. అంటే ఏడాదికి 33.75 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ వినియోగం తక్కువగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది. అలాగే పైలెట్ ప్రాజెక్ట్ తర్వాత శ్రీకాకుళం జిల్లాలో 2022 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ వినియోగదారుల సంఖ్య పెరిగిప్పటికీ విద్యుత్ వినియోగం మాత్రం 33% తగ్గింది. 

 4)   ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఉచిత వ్యవసాయ కనెక్షన్ లకు స్మార్ట్ మీటర్లు పెట్టలేదు. డొమెస్టిక్ మాటర్లు మాత్రమే పెట్టారు. ప్రతిచోటా మనకంటే రెట్టింపు ఉన్నాయి. స్మార్ట్ మీటర్ల కోసం 2021లో 6480.12 కోట్ల అంచనాలతో టెండర్లు పిలవడం జరిగింది. అప్పటి రేట్ల ప్రకారం అధిక వ్యయం అవుతుండటంతో సదరు టెండర్లను రద్దు చేయడం జరిగింది. కరోనా పాండమిక్ తరువాత రేట్లు కొంత మేర తగ్గడంతో తిరిగి 2022లో అప్పటి రేట్ల ప్రకారం రూ.5692.35 కోట్లతో సవరించిన అంచనాలతో టెండర్లు పిలిచాం.టెండర్ ఫైనాన్షియల్ బిడ్ ప్రాసెస్ లో ఉంది. దీనిని ఎవరికో ఇచ్చేశామని, మాకు కావాల్సిన వారికి కట్టబెట్టామనే విధంగా మాట్లాడటం కూడా సరికాదు. 

5)   తెలుగుదేశం సభ్యులు మాట్లాడుతూ ఇంధనశాఖ స్పెషల్ సీఎస్ విజయానంద్ ప్రభుత్వంకు రాసిన లేఖలో స్మార్ట్ మీటర్లు అవసరం లేదని పేర్కొన్నట్లుగా సభలో మాట్లాడారు. అది వాస్తవం కాదు. మీటర్ల ఏర్పాటుపై అన్ని రకాల మీటర్లను పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆయన లేఖలో రాశారు. దీనిని వక్రీకరించి మాట్లాడటం దురదృష్టకరం. 

6)  చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ పై ఎం మాట్లాడారో అందరికీ తెలుసు. ఉచిత విద్యుత్ ఇచ్చే తీగెలపై దుస్తులు ఆరేసుకోవాలని ఆయన మాట్లాడలేదా? వ్యవసాయం దండగ అని అనలేదా? ఈ ప్రభుత్వం రైతులకు పగటిపూటే తొమ్మిది గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను వ్యవసాయం కోసం ఉచితంగా అందిస్తోంది. తెలుగుదేశం హయాంలో అర్థరాత్రి ఇచ్చే ఉచిత విద్యుత్ వల్ల ఎంత మంది రైతులు చీకట్లో పాము కాటుకు గురయ్యారు,

ఎంత మంది విద్యుత్ షాక్ తో మృతి చెందారో తెలుగుదేశం సభ్యులు లెక్కలు చెప్పాలి. ఇప్పుడు వ్యవసాయ కనెక్షన్ లకు స్మార్ట్ మీటర్లు భిగించాలనే నిర్ణయం కోసం వాస్తవంగా ఉచిత వ్యవసాయ కనెక్షన్ల ద్వారా ఎంత వినియోగం అవుతుందో తెలుసుకునేందుకే. రైతులకు మరింత నాణ్యమైన విద్యుత్ ను అందించేందుకే. ఇది కూడా కేంద్రప్రభుత్వం, సెంట్రల్ రెగ్యులేటరీ అథారిటీ మార్గదర్శకాల ప్రకారమే స్మార్ట్ మీటర్లను అమరుస్తున్నాం. దీనిపై టీడీపీ, కమ్యూనిస్ట్ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు డిబిటి కోసం స్వచ్ఛందంగా బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం 10,025 మంది రైతులు మినహా మిగిలిన రైతులంతా ఖాతాలను తెరిచారు అని మంత్రి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement