స్మార్ట్‌ మీటర్లతో నాణ్యమైన విద్యుత్‌ | PeddiReddy Rama Chandra Reddy Quality electricity with smart meters | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ మీటర్లతో నాణ్యమైన విద్యుత్‌

Published Fri, Sep 30 2022 5:38 AM | Last Updated on Fri, Sep 30 2022 5:38 AM

PeddiReddy Rama Chandra Reddy Quality electricity with smart meters - Sakshi

సాక్షి, అమరావతి: వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను ఎలాంటి అంతరాయాలు లేకుండా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. స్మార్ట్‌ మీటర్లతో రైతులకు ఎలాంటి నష్టం కలగదన్నారు. ఇంధన శాఖ అధికారులతో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడేళ్లలో 41 వేల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లను మంజూరు చేశామన్నారు.

త్వరలో మరో 77 వేల కొత్త కనెక్షన్లను ఇవ్వనున్నట్లు తెలిపారు. రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్‌కు సంబంధించిన భారాన్ని స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు తర్వాత కూడా ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేసి.. పరిశీలించినట్లు తెలిపారు.

ఈ జిల్లాలో సాధారణంగా ఉచిత విద్యుత్‌ వినియోగానికి ప్రభుత్వం చెల్లిస్తున్న మొత్తం కన్నా.. 30 శాతం తక్కువగానే రైతులు వినియోగిస్తున్నట్లు తేలిందన్నారు. 2023 మార్చి నాటికి రాష్ట్రంలోని 18 లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేయాలనే లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులను ఆదేశించారు.

రైతులు డీబీటీ ఖాతాలు తెరిచేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని చెప్పారు. ఇప్పటికే 70 శాతానికి పైగా రైతులు బ్యాంకు ఖాతాలను తెరిచారని.. అక్టోబర్‌ 15 నాటికి నూరు శాతం పూర్తవుతుందన్నారు. పోస్టాఫీస్‌లలో కూడా రైతులు ఖాతాలు తెరవచ్చన్నారు.  

రైతుల్లో అపోహలు సృష్టిస్తున్నారు.. 
స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుపై విపక్షాలు రైతుల్లో అపోహలు సృష్టిస్తున్నాయని మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, ఆయన తోక పార్టీలైన జనసేన, వామపక్షాలు రాజకీయ స్వార్థంతో అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.

విచక్షణ కోల్పోయి చేతులు, వేళ్లు నరకాలని పిలుపునిస్తున్న విపక్ష నేతలు.. తమ చేతులనే నరుక్కుంటున్నారన్నారు. స్మార్ట్‌ మీటర్ల వల్ల నష్టం జరుగుతుందంటున్న విపక్ష నేతలు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించి.. అక్కడి రైతులతో మాట్లాడాలని హితవు పలికారు. స్మార్ట్‌మీటర్ల వల్ల జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. రైతులు తమ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసే సబ్సిడీ మొత్తాన్ని వారే స్వయంగా డిస్కంలకు  చెల్లించడం ద్వారా నాణ్యమైన విద్యుత్‌పై ప్రశ్నించే హక్కును పొందుతారన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement