సాక్షి, అమరావతి: విద్యుత్ రంగానికి చంద్రబాబు చేసిన పాపాలు శాపాల్లా వెంటాడుతున్నాయి. టీడీపీ అధికారంలో ఉండగా తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, విధానాల వల్ల కుదేలైన విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కమ్‌లు) అప్పులు తీర్చలేక ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక చేయూతతో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే బకాయిలను సకాలంలో చెల్లించలేదంటూ ‘ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజీ (ఐఈఎక్స్)’ నుంచి క్రయవిక్రయాలు జరపకుండా ఏపీతో సహా 13 రాష్ట్రాలకు చెందిన 29 డిస్కంలపై కేంద్రం నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ శాఖ పరిధిలోని పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ (పొసోకో) రాష్ట్రాలకు సమాచారం పంపింది. కరెంటు కొనుగోలు చేయడానికి, విక్రయించడానికి వీలు లేదని, గురువారం అర్ధరాత్రి నుంచే దీన్ని అమల్లోకి తెస్తున్నామని అందులో పేర్కొంది.
మొదటి వాయిదా చెల్లించినా..
ఏపీ డిస్కంలు విద్యుదుత్పత్తిదారులకు చెల్లించాల్సిన మొత్తం బకాయిలు రూ.17,265 కోట్లు కాగా కేంద్ర విద్యుత్ శాఖ తన ‘ప్రాప్తి వెబ్ పోర్టల్‌లో గడువులోగా చెల్లించలేదని ప్రకటించిన బకాయిలు రూ.412 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. మొత్తం బకాయిలను 12 వాయిదాల్లో చెల్లించేలా లేట్ పేమెంట్ సర్ చార్జ్ (ఎల్‌పీఎస్) పథకంలో ఏపీ ఇటీవలే చేరింది. మొదటి వాయిదాగా ఈ నెల 6న రూ.1,422 కోట్లను చెల్లించింది. ఈలోగానే కేంద్రం నిషేధిత రాష్ట్రాల జాబితాలో ఏపీని చేర్చింది. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ ఇక్కడి అవసరాలకు సరిపోనప్పుడు ఆ లోటును పూడ్చుకోవడానికి ఎనర్జీ ఎక్స్చేంజీ నుంచి కొనుగోలు చేస్తుంటారు.
అదే విధంగా మన దగ్గర విద్యుత్ మిగిలితే దానిని ఎనర్జీ ఎక్స్చేంజీలో విక్రయిస్తుంటారు. ఇప్పుడు కేంద్రం నిషేధం విధించడంతో ఏపీతో పాటు 13 రాష్ట్రాలు విద్యుత్ కొనుగోలు, అమ్మకాలు జరపలేవు. ప్రస్తుతం రాష్ట్రంలో 180 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతున్నందున కేంద్రం విధించిన నిషేధం ప్రభావం ఏపీపై అంతగా ఉండకపోవచ్చునని, అయినప్పటికీ తాము కేంద్రానికి లేఖ రాస్తామని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే.విజయానంద్ ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు.
ఈ పరిస్థితికి ఆ ఆప్పులే కారణం..
టీడీపీ హయాంలో 2014లో రూ.29,703 కోట్లుగా ఉన్న విద్యుత్ రంగం మొత్తం అప్పులు 2019 నాటికి రూ.68,596 కోట్లకు చేరాయి. ఇవి కాకుండా పవర్ జనరేటర్లకు డిస్కంల బకాయిలు రూ.2,893.23 కోట్ల నుంచి రూ.21,540.96 కోట్లకు పెరిగాయి. టీడీపీ హయాంలో విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని బిల్లుల్లో సర్దుబాటు చేసుకునే అవకాశాన్ని డిస్కంలకు ఇవ్వలేదు. దీంతో 2014–19 మధ్య దాదాపు రూ.20 వేల కోట్లు డిస్కంలు నష్టపోవాల్సి వచ్చింది.
టీడీపీ సర్కారు దాదాపు 8 వేల మెగావాట్ల పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు (పీపీఏ) అధిక ధర (యూనిట్ రూ. 4.84 + ఇతర ఛార్జీలు అదనం) చొప్పున కుదుర్చుకుంది. దీనివల్ల డిస్కంలు ఏటా రూ.3,500 కోట్ల చొప్పున 25 ఏళ్ల పాటు భారం మోయాల్సి వస్తోంది. గత ప్రభుత్వంలో తీసుకున్న రుణాలపై వడ్డీలు చెల్లించడం కోసం అదనంగా రూ.38,836 కోట్ల మేర రుణాలను ఆర్థిక సంస్థల నుంచి డిస్కంలు తీసుకోవాల్సి వచ్చింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు ఆదుకునేందుకు మూడేళ్లలోనే దాదాపు రూ.40 వేల కోట్లు సాయంగా అందించింది. మరోవైపు విద్యుత్ కొనుగోలు ఖర్చులు తగ్గించే చర్యలు చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment