
సాక్షి, అమరావతి: గృహ, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు పరిశ్రమలకు పవర్ హాలిడే అమలుకు అనుమతించాలని విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు చేసిన విజ్ఞప్తికి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అంగీకారం తెలిపింది. రేపటి (ఈ నెల 5వ తేదీ) నుంచి 15వ తేదీ వరకు షరతులతో కూడిన పవర్ హాలిడేకి అనుమతిస్తూ ఆదివారం ఆదేశాలు జారీచేసింది. ఏపీఈఆర్సీ ఆదేశాల మేరకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు ఐ.పృథీ్వతేజ్, జె.పద్మాజనార్ధనరెడ్డి, కె.సంతోషరావు తెలిపారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం..
గృహ, పారిశ్రామిక రంగాలతోపాటు వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్తు పంపిణీ సంస్థలు, ప్రభుత్వం కృషి చేస్తున్నప్పటికీ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఏర్పడిన విద్యుత్ కొరత కొంత ఇబ్బందికరంగా ఉంటోంది. రాష్ట్రంలో రోజువారీ అవసరాలకు ప్రస్తుతం 230 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం ఉంది. థర్మల్, హైడల్, గ్యాస్, పవన, సోలార్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా 190 మిలియన్ యూనిట్ల విద్యుత్తు మాత్రమే ఉత్పత్తి అవుతోంది.
ఇంకా 40 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత వల్ల సమస్యలు ఎదురవుతున్నాయి. తక్కువ వర్షపాతం కారణంగా వ్యవసాయానికి బోర్లపై ఆధారపడిన వారికి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు ఏపీఈఆర్సీకి ప్రతిపాదనలను సమర్పించాయి. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా, డిమాండ్ స్థితి, ఎక్సే్ఛంజీల నుంచి విద్యుత్ కొనుగోళ్ల పరిమాణం, వాటి ప్రస్తుత ధరలను పరిశీలించిన కమిషన్.. రాష్ట్రంలోని పరిశ్రమల విద్యుత్ వినియోగంపై కొన్ని నియంత్రణ చర్యలను చేపట్టేందుకు అనుమతించింది.
ఇందులో భాగంగా డిస్కంల పరిధిలోని పరిశ్రమలకు వారానికి ఒకరోజు పవర్ హాలిడే అమలు చేయనున్నారు. విధిలేని పరిస్థితుల్లో మాత్రమే పవర్ హాలిడే అమలు చేస్తున్నామని, విద్యుత్ లభ్యత మెరుగైతే పవర్ హాలిడే ఎత్తివేస్తామని సీఎండీలు పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలపై వినియోగదారులు టోల్ ఫ్రీ నంబరు 1912కు ఫోన్చేసి తెలియజేయవచ్చని వారు సూచించారు.
ఇవీ నిబంధనలు
♦ పరిశ్రమలు ప్రస్తుతం అమలు చేస్తున్న వారానికోరోజు వారాంతపు సెలవులకు అదనంగా ఒకరోజు పవర్ హాలిడే అమలు చేయాలి.
♦ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలలోపు ఒక షిఫ్ట్ మాత్రమే పనిచేయాలి.
♦ సాయంత్రం 6 గంటల తరువాత విద్యుత్ వినియోగానికి అనుమతించేది లేదు.
♦ పరిశ్రమలు రోజువారీ విద్యుత్ వినియోగంలో 70 శాతం వినియోగించుకునే విధంగా ఆయా పరిశ్రమలు అవసరమైన చర్యలు చేపట్టాలి.
♦ ఈ పవర్ హాలిడేని జిల్లాల వారీగా రెగ్యులేట్ చేస్తారు.
♦ ఈ నెల 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రెండు వారాలు పవర్ హాలిడే అమల్లో ఉంటుంది.
♦ నియంత్రణ చర్యలు పాటించని పరిశ్రమలపై కమిషన్ నిర్దేశించిన జరిమానా చార్జీలు విధిస్తారు.
♦ ఈ నియంత్రణ చర్యల నుంచి బల్క్‌డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్, వైద్య ఆక్సిజన్ ప్లాంట్లు, రైస్ మిల్లింగ్ యూనిట్లకు సంబంధించిన పరిశ్రమలకు మినహాయింపు ఉంది.
♦ రోజూ విద్యుత్ సరఫరా తీరును సమీక్షించి వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా కోసం అధికారులు తగిన నిర్ణయం తీసుకుంటారు.