సాక్షి, అమరావతి : ఆగస్టు నెలలో గత వందేళ్లలో కనీవినీ ఎరుగని ప్రతికూల పరిస్థితులు ఉత్పన్నమై కొనాలన్నా విద్యుత్ దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు చాలా అరుదుగా తలెత్తుతుంటాయని భారత వాతావరణ శాఖ స్వయంగా ప్రకటించింది. అయినా, రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్‌ఎల్‌డీసీ), విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు ప్రణాళికాబద్ధంగా, ముందుచూపుతో వ్యవహరించడం ద్వారా పీక్‌లోడ్ సమయంలో సైతం విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కనీస స్థాయికి తగ్గించగలిగాయి.
వాస్తవం ఇది కాగా.. నిరంతరం కోతలు విధించినట్లుగా ప్రజలను తప్పుదోవ పట్టించేలా ‘వైకాపా విద్యుత్ కోతల పథకం’ శీర్షికతో శుక్రవారం ఈనాడు తప్పుడు కథనాన్ని అచ్చేసింది. దేశవ్యాప్తంగా నెలకొన్న విద్యుత్ కొరత పరిస్థితులు, ఇందుకు కారణాలను వివరిస్తూ ప్రజలను చైతన్యపర్చాల్సిందిపోయి బాధ్యతారాహిత్యంగా.. వరుసగా అసత్య కథనాలను ఈనాడు అడ్డగోలుగా వండి వారుస్తోంది. అదనపు ఛార్జీల భారాన్ని తగ్గించుకోవడానికే కోతల పథకం ప్రవేశపెట్టిందంటూ ప్రభుత్వంపై బురదజల్లుతోంది.
విద్యుత్ పంపిణీ సంస్థలు నెలవారీ సాధారణ ప్రణాళిక ప్రకారం వివిధ విద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ కొనుగోలుకు అంచనాలు తయారుచేసుకుంటాయి. విద్యుత్ కేంద్రాలు డిస్పాచ్ ప్రణాళికను సాధారణంగా ఒక నెల ముందుగానే సిద్ధంచేసుకుంటాయి. ఈ అంచనాలతోనే జల, పవన, థర్మల్, సౌర విద్యుత్ కేంద్రాలు విద్యుత్ లభ్యతను పొందుపరుస్తాయి. ఇవేవీ పట్టించుకోకుండా కేవలం చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే రామోజీ దిగజారుతున్నారని ఈనాడు కథనం స్పష్టంచేస్తోంది.
దారుణంగా పడిపోయిన జల, పవన విద్యుదుత్పత్తి..
ప్రతికూల వాతావరణంతో జల, పవన విద్యుత్ ఉత్పత్తి దారుణంగా పడిపోయింది. శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం నుంచి ఈ ఏడాది ఆగస్టులో ఒక్క యూనిట్ విద్యుత్ కూడా ఉత్పత్తి కాకపోవడం ఇందుకు నిదర్శనం. గత ఏడాది ఆగస్టులో జలవిద్యుత్ ఉత్పత్తి 680 మిలియన్ యూనిట్లు కాగా.. ఈ ఏడాది ఇదే నెలలో 208 మిలియన్ యూనిట్లకు ఉత్పత్తి పడిపోయింది. పవన విద్యుదుత్పత్తి ఒక్కోసారి 2,500 మెగావాట్ల నుంచి 150–200 మెగావాట్లకు దారుణంగా తగ్గిపోయింది.
మరోవైపు.. మండు వేసవిని మరిపించేలా రాష్ట్రంలో తీవ్రమైన ఎండ, ఉక్కపోత పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనివల్ల గృహావసరాల రంగంతోపాటు అన్ని రంగాల్లో విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరిగిపోయింది. వర్షపాత లేమివల్ల కాలువలు చెరువులు నిండక రైతులు కూడా సాగునీటి కోసం ఈ నెలలో విద్యుత్ పంపుసెట్లపై ఎక్కువగా ఆధారపడ్డారు. ఆగస్టులో కనీస స్థాయికి చేరాల్సిన వ్యవసాయ విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. దానివల్ల గ్రిడ్ మీద తీవ్ర ఒత్తిడి పడింది.
ఒక్కసారిగా విద్యుదుత్పత్తి పెరుగుతుందా?
ఇలా అనూహ్య వాతావరణ పరిస్థితులతో విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగినట్లు ఉత్పత్తి పెంచడం వీలుకాదు. అందువల్ల కొనాలన్నా విద్యుత్ దొరకని పరిస్థితి కొంత అనివార్యమవుతుంది. వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడానికి ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేయడానికి విద్యుత్ పంపిణీ సంస్థలకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో అన్ని అనుమతులిచ్చింది. అయితే, దేశవ్యాప్తంగా ఏర్పడిన ప్రతికూల పరిస్థితులవల్ల బహిరంగ మార్కెట్‌లోనూ, విద్యుత్ ఎక్సే్ఛంజీల్లోను స్వల్పకాలిక, అత్యవసర విద్యుత్ సమయాల్లో కొనుగోలుకు తగినంత విద్యుత్ అందుబాటులో లేదు.
పైగా దేశవ్యాప్తంగా బొగ్గు కొరత వేధిస్తోంది. బిడ్డింగ్ పరిమాణంలో కేవలం 5–10 శాతం మాత్రమే విద్యుత్ లభిస్తోంది. టైం బ్లాక్‌కు 2 వేల మెగావాట్లకు ఆన్‌లైన్‌లో బిడ్ వేస్తుంటే కేవలం 100 నుండి 200 మెగావాట్ల విద్యుత్ మాత్రమే దొరుకుతోంది. ఇది కూడా సీలింగ్ ధర యూనిట్‌కు రూ.10 వద్ద లభిస్తోంది. సెంట్రల్ గ్రిడ్ నుంచి ఓవర్ డ్రా చేయాలన్నా మనకు 250 మెగావాట్లకు మించి చేసేందుకు అనుమతిలేదు. ఒక్కోసారి ఆ గరిష్ట పరిమాణం దాటి కూడా ఓవర్ డ్రా చేస్తున్నాం. ఇందుకోసం అధిక ధర, జరిమానా కూడా చెల్లించాల్సి వస్తోంది.
అయినా.. ఒక్కోసారి ఓవర్ డ్రాలు నియమాలకు మించి పెరిగిపోతుంటే గ్రిడ్ భద్రత రీత్యా ఆటోమాటిక్ లోడ్ రిలీఫ్ వ్యవస్థ ఆక్టివేట్ కావడంతో అక్కడక్కడా విద్యుత్ సరఫరాలో స్వల్పంగా అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఈ ఆటోమాటిక్ వ్యవస్థ ఆక్టివేట్ కాగానే వెంటనే పరిస్థితులు చక్కదిద్ది రాష్ట్రమంతా లోడ్‌ను అందుబాటులో ఉన్న ఉత్పత్తితో సమన్వయం చేసి గ్రిడ్ వైఫల్యం చెందకుండా అత్యవసర చర్యలు తీసుకుంటున్నారు. గ్రిడ్‌లో సర్దుబాటు కోసం అప్పుడప్పుడూ ఇస్తున్న అత్యవసర లోడ్ రిలీఫ్‌లు రోజువారీగా సరఫరా చేస్తున్న మొత్తం విద్యుత్ పరిమాణంలో 2.5 శాతం కూడా లేదు.
అక్కడలా.. ఇక్కడిలా ఏంటి రామోజీ!?
విద్యుత్ కోతలపై రామోజీ రాతలు కేవలం డ్రామాలని, తాను భుజానికెత్తుకుని మోస్తున్న వారి రాజకీయ ప్రయోజనాల కోసమేనని నిరూపించుకున్నారు. ‘వైకాపా విద్యుత్ కోతల పథకం’ అంటూ శుక్రవారం ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిషన్‌లో రాస్తే, ఇదే విద్యుత్ కోతలపై రెండ్రోజుల క్రితం అంటే ఆగస్టు 30న ‘వర్షాలు లేక.. కరెంటు కాక’ శీర్షికతో తెలంగాణ ఎడిషన్‌లో కథనాన్ని ప్రచురించింది.
జల విద్యుత్ ఉత్పత్తి లేక కోట్లలో నష్టం అని.. ఇంధన ఎక్స్చేంజీల్లో కొందామన్నా కరెంటు దొరకడంలేదని విద్యుత్ కోతలకు కారణాలను తెలంగాణలో రాసుకొచ్చింది. దేశవ్యాప్తంగా భారీగా విద్యుత్ డిమాండ్ పెరిగిందని ఆ కథనంలో చెప్పిన ఈనాడు.. ఏపీకి వచ్చేసరికి ప్లేటు మార్చింది. వాస్తవాలను దాచిపెట్టి, రాష్ట్ర ప్రభుత్వమే ఈ పరిస్థితులకు కారణమన్నట్లు అసత్య కథనాన్ని ముద్రించింది. దేశ వ్యాప్తంగా ఉన్న పరిస్థితులే తెలంగాణ, ఏపీలోనూ ఉంటాయనే విషయాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరించడం గమనార్హం.
దక్షిణ భారతదేశమంతా ఇదే పరిస్థితి..
నిజానికి.. ఆగస్టులో దక్షిణ భారతదేశమంతా విద్యుత్ సరఫరా పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆగస్టులో విద్యుత్ పంపిణీ సంస్థలు దాదాపు రూ.1,000 కోట్లు ఖర్చుచేసి సరాసరి 1,360 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను అత్యవసరంగా స్వల్పకాలిక ఎక్సే్ఛంజీల నుంచి కొరతను అధిగమించడానికి కొనుగోలు చేశాయి.
మిగిలిన స్వల్ప పరిమాణం 3–5 మిలియన్ యూనిట్లు కూడా కొనడానికి సిద్ధపడినా మనకు అవసరం వచ్చినపుడు మార్కెట్‌లో తగినంత విద్యుత్ అందుబాటులో లేకపోవడంవల్ల కొరత ఏర్పడింది. అత్యవసర లోడ్ రిలీఫ్ పరిస్థితి ఈ ఏడాదంతా లేదు. అత్యవసర విద్యుత్ కొనుగోలు కోసం ఎంత ఖర్చయినా వెనుకాడవద్దని, ప్రజలకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరాకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే విద్యుత్ సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.
Comments
Please login to add a commentAdd a comment