4 నెలల్లో భర్తీ చేయాలి | Jobs should be replaced within 4 months | Sakshi
Sakshi News home page

4 నెలల్లో భర్తీ చేయాలి

Published Sun, Nov 12 2017 2:55 AM | Last Updated on Fri, Aug 31 2018 8:34 PM

Jobs should be replaced within 4 months - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ పంపిణీ సంస్థల్లో సబ్‌ జూనియర్లు, జూనియర్‌ అసిస్టెంట్లు, లైన్‌మన్‌లు, జూనియర్‌ లైన్‌మన్‌ పోస్టుల భర్తీ కోసం తిరిగి పరీక్షలు నిర్వహించాలని 2014 జూన్‌లో ఇచ్చిన ఉత్తర్వులను ఉమ్మడి హైకోర్టు కొట్టివేసింది. ఆ పోస్టుల భర్తీకి నాలుగు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని విద్యుత్‌ పంపిణీ సంస్థలను తాజాగా ఆదేశించింది. 2011, 2012లో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం పోస్టుల్ని భర్తీ చేయాలని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా కోదండరామ్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు చెప్పింది. వెయిటేజీ మార్కుల్ని 40 నుంచి 20కి తగ్గించడం, ఆరు నెలల్లో తిరిగి పరీక్ష నిర్వహించాలన్న ఉత్తర్వుల్ని విద్యుత్‌ సంస్థలు తిరిగి సమీక్షించాలని కోరుతూ కాంట్రాక్టు ఉద్యోగాలు చేసే పలువురు అభ్యర్థులు పిటిషన్‌ దాఖలు చేశారు. విచారించిన హైకోర్టు ఈ మేరకు తీర్పు చెప్పింది.

డిస్కం, ట్రాన్స్‌కోల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు 45 మార్కుల వెయిటేజీ ఇవ్వడాన్ని సవాల్‌ చేసిన కేసులో సింగిల్‌ జడ్జి.. 45 మార్కుల్ని 20కి తగ్గించి, ఏడాది సర్వీసుకు రెండు మార్కులు చొప్పున కేటాయించాలని తొలుత తీర్పు చెప్పారు. ఈ తీర్పును కాంట్రాక్టు ఉద్యోగులు సవాల్‌ చేయడంతో ధర్మాసనం విచారించి.. 20 మార్కుల వెయిటేజీ సరైనదేనని, ఆరు నెలలకు ఒక మార్కు చొప్పున కేటాయించాలని, ఆరు వారాల్లోగా పోస్టుల్ని భర్తీ చేయాలని విద్యుత్‌ సంస్థలను ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. దీనిపై సంతృప్తి చెందని విద్యుత్‌ సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, తిరిగి హైకోర్టునే ఆశ్రయించాలని తేల్చి చెప్పింది.

దాంతో విద్యుత్‌ సంస్థలు హైకోర్టు ఉత్తర్వుల్ని తిరిగి సమీక్షించాలని పిటిషన్లు దాఖలు చేశాయి. ఇప్పటికే జరిపిన పరీక్షలను 80 మార్కులుగా పరిగణిస్తామన్న అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. తిరిగి పరీక్ష నిర్వహించాలన్న ఆదేశాల్ని పునఃసమీక్ష చేయాలని కాంట్రాక్టు ఉద్యోగులు మరోసారి హైకోర్టును ఆశ్రయించడంతో అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని విద్యుత్‌ సంస్థలను ఆదేశించింది.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement