
సాక్షి, హైదరాబాద్: నియామక నిబంధనలతో సంబంధం లేకుండా ఏకంగా 550 మంది కళాకారులకు ఉద్యోగాలు కట్టబెట్టారనే ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ వ్యాజ్యం దాఖలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహాన్ని వెలిబుచ్చింది. పలుసార్లు ఆదేశించినా కౌంటర్ ఎందుకు వేయడం లేదని ప్రశ్నించింది. దీనిపై వివరాలిచ్చేందుకు తెలంగాణ సాంస్కృతిక సమితి సభ్య కార్యదర్శి స్వయంగా కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
ఈ మేరకు ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలతో సంబంధం లేకుండా 550 మంది కళాకారులను ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం టంగుటూరు గ్రామస్తుడు జూకంటి రమేశ్, మరో ఇద్దరు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిని బుధవారం ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. 2017 డిసెంబర్‌లో ఈ పిల్ విచారణకు వచ్చినప్పుడు కౌంటర్ దాఖలు చేయాలని సాంస్కృతిక సమితి సభ్య కార్యదర్శిని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ వేసవి సెలవుల తర్వాత చేపడతామని ఉత్తర్వులు జారీ చేసింది.