వేషాలకు మోసపోతారా ?
- మంత్రిగా, ఎంపీగా శివప్రసాద్ చేసిందేమిటో !
- ఆయనది విభజనవాదమా ? సమైక్యవాదమా ?
- ఉద్యమం అంటే డ్రామా కాదంటున్న జనం
- కనీస వసతులు కల్పించలేదని ఆవేదన
సాక్షి ప్రతినిధి, తిరుపతి : ఆయన చెప్పేదొకటి, చేస్తున్నదొకటి... ఆయన పేరు ఎన్ శివప్రసాద్. ఐదేళ్లు చిత్తూరు ఎంపీగా ఉన్నారు. ప్రస్తుతం అదే పార్లమెంటు స్థానానికి టీడీపీ అభ్యర్థి. శివప్రసాద్ పదవీకాలంలో పార్లమెంటు పరిధిలోని శాసనసభ స్థానాల్లో ఆయన మార్క్ ఎక్కడా కనిపించలేదు. అక్కడక్కడా ఆయన వేసిన వేషాల గురించి మాత్రం జనం చర్చించుకుంటారు. ఓ కళాకారుడిగా ఆయనకు మంచి పేరు ఉంది. అయితే ప్రజాప్రతినిధిగా మాత్రం ఫెయిల్ అయ్యారు.
తెలుగుదేశం పార్టీ హయాంలో సత్యవేడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన శివప్రసాద్ సమాచార శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఎమ్మెల్యేగా... మంత్రిగా జిల్లాకుగానీ, సత్యవేడు నియోజవకర్గానికిగానీ తాను చేసింది ఇదీ.. అని చెప్పుకునేందుకు ఏమీ లేదు. సత్యవేడు నియోజకవర్గానికి ఆయన హయాంలో రెసిడెన్సియల్ పాఠశాల ఒకటి మంజూరయింది.
అది కూడా ఆయన గొప్పగా చెప్పేందుకు వీలు లేదు. ప్రతి సంవత్సరం విద్యార్థుల సంఖ్యను, పేదరికంలో ఉన్న వారి సంఖ్యను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం సాధారణంగా పాఠశాలలు మంజూరు చేస్తుంది. ఆ కోవలో ఆ పాఠశాల మంజూరయిందే తప్ప ఆయన ప్రత్యేకించి తీసుకొచ్చింది కాదని స్థానికులు చెబుతున్నారు.
చిత్తూరు స్థానం నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించిన ఆయన ఐదేళ్ల పదవీకాలంలో చిత్తూరు నగర తాగునీటి సమస్యను కూడా పరిష్కరించలేదు. లక్షల రూపాయల ఎంపీ నిధులు వస్తారుు. ఈ నిధులు ఆయన అనుచరులు, టీడీపీ కార్యకర్తలకు ఉపయోగపడ్డాయి తప్ప నియోజవకర్గ అభివృద్ధికి కాదనే విమర్శ ఉంది. నియోజకవర్గంలో అనేక మంది విద్యా, ఉద్యోగాలు లేక నానా అవస్థలు పడుతున్నారు. ప్రతి సంవత్సరం అత్యధిక మెజారిటీ ఇస్తున్న కుప్పం నియోజకవర్గం నుంచి అనేక మంది యువకులు వలసలు వెళ్లి కుటుంబాలను పోషిస్తున్నారు.
ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. అయితే ఆయన కూడా పట్టించుకోలేదు. ఎవరైతే చిత్తూరు ఎంపీగా గెలిచేందుకు కారకులయ్యారో వారి గురించి కనీసపు ఆలోచన కూడా చేయలేదంటే జనం మనిషి ఎలా అవుతారనేది ప్రశ్న. విద్య, వైద్య ఆరోగ్యం, తాగునీరు వంటి అంశాలను కూడా పట్టించుకోలేదనేది ప్రజల ఆవేదన.
తెలుగుదేశం పార్టీ ఆందోళనలకు పిలుపునిస్తే శివప్రసాద్ రాష్ట్రంలో ఏ వేషం వేస్తారా ? అంటూ జనమంతా చర్చించుకంటుంటారు. ఒక రోజు గాడిదమీద, మరో రోజు గుర్రంమీద, ఇంకో రోజు దున్నపోతు మీద ఊరేగుతూ దర్శనమిస్తారు. ఇది ఉద్యమం అవుతుందా ? అనేది పలువురి ప్రశ్న. రాష్ట్ర విభజన విషయంలో ఒకవైపు చంద్రబాబు నాయుడు నాది రెండు కళ్లు సిద్ధాంతమని చెబుతుంటే ఢిల్లీలో శివప్రసాద్ సమైక్యంపేరుతో గుడ్డలు విప్పదీసి నిరసన తెలిపారు.
తమ నాయకుని పంథా ఓ రకంగా ఉంటే ఈయన తన డ్రామాతో సమైక్యవాదినంటూ మోసంచేసే ప్రయత్నానికి ఒడిగట్టారు. ఈయనకు పార్లమెంటులో ప్రశ్నించే అధికారం ఉంది. భారతదేశ అత్యున్నత చట్టసభలో ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తోటి ఎంపీలు పలువురు చర్చలో పాల్గొన్నారు.
ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. చట్టసభను ఉపయోగించుకుని రాజ్యాంగం కల్పించిన అవకాశం మేరకు ప్రజలకు ఉపయోగపడే చర్చలో పార్లమెంటులో ఒక్కరోజు కూడా పాల్గొనలేదంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. టీడీపీ పార్లమెంటు సభ్యులంతా రాష్ట్ర విభజనకు సంతకాలు చేసిన వారే. వారిలో శివప్రసాద్ కూడా ఒకరు. జనం సమైక్య రాష్ట్రం ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి ప్లేట్ మార్చి వేషాలు వేయడం ద్వారా నిరసన తెలిపారేగానీ నిజానికి ఈయన కూడ విభజనవాదే !