నిరుద్యోగులకు రూ.కోటి టోకరా! | Froud to the for the unemployees | Sakshi
Sakshi News home page

నిరుద్యోగులకు రూ.కోటి టోకరా!

Published Sat, Nov 21 2015 12:19 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

నిరుద్యోగులకు రూ.కోటి టోకరా! - Sakshi

నిరుద్యోగులకు రూ.కోటి టోకరా!

సాక్షి, హైదరాబాద్:  ఓ కుటుంబంలోని తండ్రి, తల్లి, కుమారులిద్దరూ కలసి నిరుద్యోగులకు దాదాపు కోటి రూపాయలవరకు టోకరా వేసిన వైనంపై హైకోర్టు విస్మయం వ్యక్తంచేసింది. అంతేకాక ఓ మోడల్ స్కూల్‌లో ప్రిన్సిపల్ ఉద్యోగానికి ఓ వ్యక్తి ఏకంగా రూ.6 లక్షలు ఈ కుటుంబానికి చెల్లించినట్లు తెలుసుకున్న హైకోర్టు ఆశ్చర్యపోయింది. ఈ ఏడాది జనవరిలో వీరి మోసాలపై ఫిర్యాదు అందితే  ఇప్పటి వరకు ఆ కుటుంబంలోని నలుగురిని అరెస్ట్ చేయని పంజాగుట్ట పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకునే ఇటువంటి వ్యక్తులను ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడం ఏమిటంటూ ప్రశ్నించింది. వీరి అరెస్ట్‌కు తగిన చర్యలు తీసుకునేలా సంబంధిత పోలీసులకు ఆదేశాలివ్వాలని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి.రామిరెడ్డికి హైకోర్టు సూచించింది. ముందస్తు బెయిల్ కోసం ఆ కుటుంబంలోని తల్లి, ఇద్దరు కుమారులు దాఖలు చేసుకున్న పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

 56 మందికి టోకరా
 హైదరాబాద్‌లోని సోమాజిగూడకు చెందిన పిట్టా అనిల్‌కుమార్, అతని భార్య సుజాత, కుమారులు నితీశ్ కుమార్, హితీశ్ కుమార్‌లు కలసి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ, గ్రూప్ 2 పోస్టులకు రూ.1 లక్ష, ఆర్టీసీలో ఉద్యోగానికి రూ.1.50 లక్షలు, బీసీ సంక్షేమ అధికారి పోస్టుకు రూ.1.50 లక్షలు, విద్యుత్ బోర్డులో రూ.3.5 లక్షలు, వీఆర్‌వోకు రూ. లక్ష నుంచి రెండు లక్షలు, కోపరేటివ్ బ్యాంకులో ఉద్యోగానికి రూ.1 లక్ష, కెనడా పంపేందుకు రూ.3 లక్షలు, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ పోస్టుకు రూ. 6 లక్షల చొప్పున 56 మంది నిరుద్యోగుల నుంచి మొత్తం రూ.95.50 లక్షలను వసూలు చేశారు. 2011 నుంచి వారు ఇలా డబ్బు వసూలు చేయడం మొదలుపెట్టారు.

అయితే తమకు ఉద్యోగాలు రాకపోవడంతో మోసపోయామని గ్రహించిన నిరుద్యోగులు కొందరు ఈ ఏడాది జనవరిలో పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేయలేదు. ఈ క్రమంలో తల్లి సుజాత, ఇద్దరు కుమారులు హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం ఈ వ్యాజ్యం విచారణ సందర్భంగా అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి.రామిరెడ్డి వాదనలు వినిపిస్తూ, కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ఇప్పటికే కొందరు సాక్షుల విచారణ కూడా పూర్తయిందని తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే ఈ నలుగురు కుటుంబ సభ్యులకు నిరుద్యోగులకు టోకరా వేశారని, దీని వెనుక అనేక మంది ఇతర వ్యక్తులు కూడా ఉన్నారని, అందువల్ల వీరికి ముందస్తు బెయిల్ ఇవ్వరాదని కోరారు.

విచారణలో వాస్తవాలు తెలియాలంటే ఈ బెయిల్ పిటిషన్‌ను కొట్టేయాలన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ నలుగురు ఒక్కో ఉద్యోగానికి నిర్ణయించిన రేటును చదివి వినిపించారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ.. ‘ఈ రేట్లేమిటి..? కూరగాయలకు ధర నిర్ణయించినట్లు ఉద్యోగాలకూ ధర నిర్ణయించారా..! అదీ కుటుంబం మొత్తం కలిసి. ప్రైవేటు ఉద్యోగానికి ఆరు లక్షలా..! జనవరిలో ఫిర్యాదు అందితే ఇప్పటి వరకు ఎందుకు నిందితులను అరెస్ట్ చేయలేదు.?’ అని పోలీసులను నిలదీశారు. రామిరెడ్డి వాదనలతో ఏకీభవిస్తూ సుజాత, ఇద్దరు కుమారుల ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement