సాక్షి, హైదరాబాద్: విద్యుత్ మీటర్ రీడర్లు ఆదివారం నుంచి సమ్మెకు దిగారు. దీంతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ బిల్లుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. ఉత్తర, దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలో 1.45 కోట్లకుపైగా విద్యుత్ కనెక్షన్లుండగా, అందులో ఓ ఐదు లక్షల కనెక్షన్లకు సంబంధించిన బిల్లులను సంస్థ రెగ్యులర్ ఉద్యోగులైన లైన్‌మన్లు, సహాయ లైన్‌మన్లు జారీ చేస్తున్నారు. మిగిలిన 1.4 కోట్ల కనెక్షన్లకు సంబంధించిన విద్యుత్ బిల్లుల జారీ బాధ్యతను డిస్కంలు ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించాయి. ఈ కాంట్రాక్టర్ల వద్ద దాదాపు 1,450 మంది మీటర్ రీడర్లు ‘పీస్ రేటు’ విధానంలో పనిచేస్తున్నారు. అంటే, ఒక్కో బిల్లుకు ఇంత రేటు అని కాంట్రాక్టర్లు వీరికి జీతాలు చెల్లిస్తున్నారు.
ఒక్కో బిల్లు జారీ చేసేందుకు డిస్కంలు కాంట్రాక్టర్లకు రూ.3 చెల్లిస్తుండగా, కాంట్రాక్టర్లు మీటర్ రీడర్లకు 90 పైసల నుంచి రూ.1.50 వరకు చెల్లిస్తున్నారు. సుదూర గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి బిల్లులు జారీ చేయాల్సివస్తే రూ.2 వరకు చెల్లిస్తున్నారు. అవసరాన్ని బట్టి మీటర్ రీడర్ల సేవలను నెలలో 12, 15, 19 రోజులు మాత్రమే వినియోగించుకుంటున్నారు. మిగిలిన రోజుల్లో వీరికి పని ఉండదు. నెలకు రూ.4 వేల నుంచి రూ.7 వేలు మాత్రమే సంపాదన లభిస్తోందని మీటర్ రీడర్ల అసోసియేషన్ అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వర్లు ‘సాక్షి’కి తెలిపారు.
అందుకే పీసు రేటు విధానం రద్దు చేసి తమకు నెలకు 30 రోజుల పనిదినాలు కల్పించాలని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నెలకు రూ.18 వేల కనీస వేతనం వర్తింపజేయాలని, ఈపీఎఫ్, ఈఎస్‌ఐ సదుపాయాలతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని సమ్మెకు దిగినట్లు తెలిపారు. ఒక్కో బిల్లుకు రూ.3 చొప్పున, 1.4 కోట్ల కనెక్షన్లకు బిల్లుల జారీ కోసం డిస్కంలు కాంట్రాక్టర్లకు ప్రతి నెలా రూ.4.2 కోట్లకు పైగా చెల్లిస్తున్నాయన్నారు. ఒక్కో మీటర్ రీడర్‌కు డిస్కంలు నేరుగా రూ.18 వేలు జీతం చెల్లిస్తే, 1,450 మందికి కేవలం రూ. 2.61 కోట్ల జీతాలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు.
దీంతో డిస్కంలతోపాటు కార్మికులు సైతం లాభపడతారన్నారు. కాంట్రాక్టర్ల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు డిస్కంలు నేరుగా జీతాలు చెల్లించాలని ఆయన కోరారు. నెలలోని 12/15/19 రోజులు బిల్లుల జారీకి పనిచేస్తామని, మిగిలిన రోజుల్లో తమ సేవలను ఇతర పనులకు వాడుకోవాలన్నారు. నెలలో సగానికి పైగా కాలాన్ని మీటర్ రీడింగ్‌కు వెచ్చిస్తుండడంతో మిగిలిన రోజుల్లో తమకు వేరే పనులు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కొత్త వారిని నియమించండి
మీటర్ రీడర్లు సమ్మెబాట పట్టిన నేపథ్యంలో వారి స్థానంలో కొత్తవారిని నియమించి బిల్లుల జారీ ప్రక్రియకు ఇబ్బంది లేకుండా చూడాలని ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్పీడీసీఎల్) సీఎండీ ఎ.గోపాల్‌రావు ఆదేశించారు. సమ్మెకు దిగిన వారి స్థానంలో కొత్తవారిని నియమించేలా కాంట్రాక్టర్లను కోరాలని సంస్థ పరిధిలోని జిల్లాల సూపరింటెండింగ్ ఇంజనీర్లను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment