అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జరిగిన సభకు హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతు తరఫున పంటల బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించింది. ఏ గ్రామంలో, ఏ రైతు, ఏ పంటను, ఎన్ని ఎకరాల్లో వేశారన్నది ఈ–క్రాప్ ద్వారా గుర్తించి ఇన్సూరెన్స్ పరిధిలోకి తెచ్చాం. ప్రతి ఆర్బీకే పరిధిలో బ్యాంకు రుణాలు తీసుకున్న, తీసుకోని రైతుల నోటిఫైడ్ పంటలన్నింటినీ ఉచిత బీమా పరిధిలోకి తీసుకొచ్చాం. తద్వారా ఎంత ఎక్కువ మందికి వీలైతే అంత ఎక్కువ పరిహారం ఇప్పించాలనే తాపత్రయంతో అడుగులు ముందుకు వేశాం. ఇలాంటప్పుడు బీమా కంపెనీల నుంచి రైతులకు అందాల్సిన పరిహారం అందకూడదని ప్రభుత్వం ఎందుకు అనుకుంటుంది? అయితే, చంద్రబాబు, ఆయన గజ దొంగల ముఠా.. దుష్ట చతుష్టయంలోని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5.. వీళ్లందరి దత్తపుత్రుడు దుష్ప్రచారం చేస్తూ మొసలి కన్నీరు కారుస్తున్నారు.
– సీఎం వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, అనంతపురం: దేశంలో ఎక్కడా లేని విధంగా, ఏ రాష్ట్రమూ చేయని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉందని, ఏ ఒక్క రైతుకూ కష్టం రానివ్వకుండా చూసుకుంటున్న సర్కారు ఇదేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. నాలుగేళ్లలో రైతుల కోసం రూ.1.70 లక్షల కోట్లకు పైగా వ్యయం చేశామని గర్వంగా చెప్పుకుంటున్నామన్నారు. పంటల బీమా పరిహారం మొదలు.. మద్దతు ధర వరకు వ్యవసాయ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తేవడం ద్వారా రైతుకు చేదోడు వాదోడుగా నిలిచామని చెప్పారు.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి (జూలై 8)ని పురస్కరించుకుని శనివారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో రైతు దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా 2022– ఖరీఫ్‌లో పంటలు నష్టపోయిన రాష్ట్రంలోని 10.20 లక్షల మందికి పైగా రైతులకు డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద రూ.1,117.21 కోట్ల పరిహారాన్ని కంప్యూటర్‌లో బటన్ నొక్కి వారి ఖాతాలకు జమ చేసే కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. డాక్టర్ వైఎస్సార్‌కు ఘనంగా నివాళులర్పించిన తర్వాత అశేష జనవాహినిని ఉద్దేశించి మాట్లాడారు.
మహానేత వైఎస్సార్ జయంతి రోజున అన్నదాతకు పాదాభివందనం చేస్తూ ఏటా రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నామని చెప్పారు. ‘నాన్న గారు గుర్తుకొచ్చినప్పుడల్లా రైతుల పట్ల ఆయన ఎలా స్పందించారన్నది గుర్తుకొస్తుంది. ఉచిత విద్యుత్, జలయజ్ఞం, ఫీజు రీయింబర్స్‌మెంట్, లక్షల ఇళ్లు, ఆరోగ్యశ్రీ పథకం.. 104, 108 గుర్తుకొస్తుంది. కుయ్.. కుయ్.. కుయ్.. అన్న శబ్ధం కూడా గుర్తుకొస్తుంది’ అని అన్నారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ, ఆయన చేసిన మంచి ఎప్పటికీ గుర్తుంటుందని చెప్పారు. అందుకే ఆయన్ను గౌరవిస్తూ వ్యవసాయ, ఆరోగ్య, గృహ నిర్మాణ రంగాల్లో మనం చేపట్టిన కార్యక్రమాలు, పథకాలకు డాక్టర్ వైఎస్సార్ పేరే పెట్టామని స్పష్టం చేశారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే..
ఆ ఐదేళ్లలో నోరెత్తలేదెందుకు?
► గత చంద్రబాబు ప్రభుత్వ ఐదేళ్లలో సగటున ప్రతి ఏటా 300 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించే పరిస్థితి. అంటే సగం రాష్ట్రంలో ఏటా కరువే. ఉమ్మడి అనంతపురం అంతా కరువుగానే కనిపించే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు ప్రభుత్వం పంట నష్టపోయిన రైతన్నలకు అరకొరగానే బీమా పరిహారం ఇచ్చింది. ఆ ఐదేళ్లలో కేవలం రూ.3,411 కోట్లు మాత్రమే. అది కూడా 30.85 లక్షల మంది రైతులకు మాత్రమే ఇచ్చింది.
► దేవుడి దయ వల్ల ఈ నాలుగేళ్లలో ఒక్క కరువు మండలం లేకున్నా.. అప్పుడప్పుడు అధిక వర్షాలు, ఇతర కారణాల వల్ల జరిగిన పంట నష్టాన్ని పరిగణలోకి తీసుకుని ఈ నాలుగేళ్లలో 54,48,000 మంది రైతులకు వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం ద్వారా రూ.7,802 కోట్లు పరిహారంగా చెల్లించాం.
► చంద్రబాబు ఐదేళ్ల కరువు కాలంలో రైతులకు అందాల్సిన బీమా పరిహారం అందలేదని ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 ఏనాడూ నోరు మెదపలేదు. పైగా ఈ పెద్దమనిషి చంద్రబాబు రెయిన్ గన్‌తో కరువును పారదోలానంటూ ఫొటోలకు పొజులిస్తే.. కరువు వెళ్లిపోయిందని నిస్సిగ్గుగా రాశారు. ఇలాంటి దుర్మార్గులు మనం మంచి చేస్తుంటే మొసలి కన్నీరు కారుస్తున్నారు.
వ్యవసాయం వ్యాపారం కాదని గుర్తించాలి
► ప్రణాళికా బద్ధంగా, ప్రాధాన్యతా క్రమంలో నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తి చేసేలా అడుగులు వేస్తున్నాం. కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల కోసం రూ.542 కోట్లతో బీటీపీ ప్రాజెక్టుకు సంబంధించి.. గత ప్రభుత్వంలో చంద్రబాబు ఎన్నికల కోసం టెంకాయ కొట్టి వదిలేశారు. దీని కోసం 1407 ఎకరాల భూసేకరణ చేస్తే తప్ప అడుగులు ముందుకు పడని పరిస్థితి. ఈ ప్రాజెక్టు కోసం రూ.208 కోట్లు రైతన్నల బ్యాంకు అకౌంట్లలోకి విడుదల చేస్తున్నాం.
► చంద్రబాబు హయాంలో ఆహార ధాన్యాల దిగుబడి 152 లక్షల టన్నులు ఉండేది. మన ప్రభుత్వంలో నాలుగేళ్లలో సగటున 13 లక్షల టన్నులు పెరిగి 165 లక్షల టన్నులకు చేరింది. ఈ నాలుగేళ్లలో రైతన్నలకు మంచి చేసేందుకు మీ బిడ్డ ప్రభుత్వం రూ.1,70,769 కోట్లు ఖర్చు చేసింది.
► రైతు చేస్తున్నది అన్నం పెట్టే వ్యవసాయం తప్ప వ్యాపారం కాదని పాలించే వాళ్లకు అర్థం కావాలి. రైతును మోసం చేయకూడదని, ప్రజలను మోసం చేయకూడదని పాలకుడికి ఒక నిబద్ధత ఉండాలి. అలాంటి నిబద్ధత, నైతికత ఉంటే ఆ మనిషిని, ఆ గుండెను ఒక వైఎస్సార్ అని, ఒక జగనన్న అంటారని సగర్వంగా తెలియజేస్తున్నా. అలాంటి నిబద్ధత, నైతికత లేకపోతే ఆ గుండెను, ఆ మనిషిని చంద్రబాబు నాయుడు అంటారు.
16 విప్లవాత్మక మార్పులు
1ఇన్సూరెన్స్: గ్రామ స్థాయిలో ఏ రైతన్నకు భారం పడకుండా ప్రతి పంటను ఈ–క్రాప్‌తో అనుసంధానం చేసి ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టడం ద్వారా ఉచిత బీమా పథకం కిందకు తెచ్చాం. ఇలా మన రాష్ట్రంలో తప్ప దేశంలో ఎక్కడా లేదు.
2వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్: మూడు విడతల్లో వైఎస్సార్ రైతు భరోసా సాయం రూ.13,500 క్రమం తప్పకుండా ఇస్తున్నాం. ఈ నాలుగేళ్లలో 52.38 లక్షల మంది రైతులకు రూ.61,500 చొప్పున వారి ఖాతాల్లో నేరుగా జమ చేశాం. ఈ ఒక్క పథకం ద్వారా రూ.30,985 కోట్లు ఇచ్చాం. ఈ సొమ్ము చిన్న, సన్నకారు రైతులకు సంజీవనిలా ఉపయోగపడుతోంది.
3ఆర్బీకేలు: 10,778 రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) ఏర్పాటు చేశాం. ఇది దేశంలోనే అతిపెద్ద విప్లవాత్మక మార్పు. విత్తనం మొదలు పంట అమ్మకం వరకు.. ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు.. సలహాలు సహా ప్రతి అడుగులోనూ రైతులకు అండగా, తోడుగా ఉంటూ వారిని చేయి పట్టుకొని నడిపిస్తున్న వ్యవస్థ గ్రామ స్థాయిలో కనిపిస్తోంది. దేశం మొత్తం మన రాష్ట్రానికి వచ్చి ఎలా జరుగుతోందని చూసి వెళ్తున్నారు.
4ఈ–క్రాప్: ఏ రైతు, ఏ పంట, ఎన్ని ఎకరాల్లో వేశాడన్నది గ్రామ స్ధాయిలో, ఆర్బీకే స్ధాయిలో స్పష్టంగా తెలిసిపోతుంది. దీని ఆధారంగా ఏ ఒక్క రైతు నష్టపోకుండా ప్రతి రైతుకు పారదర్శకంగా వడ్డీ లేని రుణాలు, ఇన్‌పుట్ సబ్సిడీ చివరకు పంటల కొనుగోలులో కూడా మేలు జరుగుతోంది.
5పంట నష్టపరిహారం: ఏ సీజన్‌లో పంట నష్టం ఆ సీజన్ ముగియక మునుపే రైతుల చేతుల్లో పెడుతున్న ఏకైక ప్రభుత్వం మనదే. ఈ నాలుగేళ్లలో 22.74 లక్షల మంది రైతన్నలకు రూ.1,965 కోట్లు ఇచ్చాం. తద్వారా ఎక్కడా దళారులు, మధ్యవర్తులు, లంచాలు లేవు. నేరుగా అర్హులందరికీ మేలు జరుగుతోంది.
6సున్నా వడ్డీ: ఏ రైతు అయినా రుణం సకాలంలో చెల్లిస్తే ప్రోత్సాహం ఇస్తూ సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తున్నాం. ఇందులో మన రాష్ట్రం అగ్రగామి. గత ప్రభుత్వం సున్నా వడ్డీ, రుణ మాఫీ పథకాల్ని గాలికొదిలేసింది. రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి చివరకు రూ.15 వేల కోట్లు కూడా ఇవ్వకుండా రైతులను నిలువునా ముంచేసింది. ఆ అప్పులపై వడ్డీల మీద వడ్డీలు తడిసి మోపెడై రైతులు ఇబ్బందులు పడ్డారు. అలాంటి రైతులందరికీ మేలు చేస్తూ ఈ రోజు మీ బిడ్డ ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం కింద 73.88 లక్షల మందికి రూ.1,835 కోట్లు ఇచ్చింది.
7ధాన్యం కొనుగోలు: ధరలు రాకపోతే రైతులు నష్టపోకుండా ఆదుకోవడం కోసం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. మిరప, పసుపు, ఉల్లి, చిరు ధాన్యాలు, అరటి బత్తాయి పంటలకూ కనీస మద్దతు ధర ప్రకటించాం. మార్కెట్‌లో రేటు తగ్గితే గ్రామ స్థాయిలో ఆర్బీకేల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. దళారీ, మధ్యవర్తుల వ్యవస్థను పూర్తిగా తుడిచేశాం. చివరకి మిల్లర్లను కూడా తీసివేసి ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోలుకు రూ.58,767 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇతర పంటల కొనుగోలుకు రూ.7,633 కోట్లు ఖర్చు చేశాం. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన ధాన్యం సేకరణ బకాయిలు రూ. 965 కోట్లు మనమే చెల్లించాం. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.384 కోట్ల విత్తన బకాయిలూ ఇచ్చాం. చివరకు గత ప్రభుత్వం ఎగ్గొట్టిన కరెంటు బకాయిలు రూ.8,800 కోట్లు కూడా మనమే కట్టాం.
8నాణ్యమైన ఉచిత విద్యుత్: రైతన్నలకు పగటి పూటే 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఇందుకోసం రూ.1700 కోట్లతో ఫీడర్ల కెపాసిటీని అప్‌గ్రేడ్ చేశాం. ఇందుకు ఈ నాలుగేళ్లలో రూ.40,000 కోట్లు ఖర్చు చేశాం. మరో 30 ఏళ్ల పాటు రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చే పరిస్థితి ఉండేలా రూ.2.49కే వ్యవసాయ అవసరాల మేరకు 17వేల మిలియన్ యూనిట్లను సరఫరా చేసేటట్టుగా.. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో ఒప్పందం చేసుకున్నాం. ఆక్వా రైతులకూ యూనిట్ రూ.1.50కే ఇస్తున్నాం. ఇందుకు ఈ నాలుగేళ్లలో రూ.2,968 కోట్లు సబ్సిడీగా భరించాం.
9వైఎస్‌ఆర్ యంత్ర సేవా పథకం : ఆర్బీకేల ద్వారా సన్న, చిన్నకారు రైతులకు సాగులో అవసరమయ్యే యంత్రాలను అందుబాటులో ఉంచాం. రూ.1,100 కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని ప్రారంభించాం. దీనికోసం సబ్సిడీ రూపంలో రూ.400 కోట్లు ప్రభుత్వం భరించింది.
10భూ హక్కు పత్రాలు: వంద ఏళ్లకు పైగా చుక్కల భూములుగా మిగిలిపోయిన 2.06 లక్షల ఎకరాలకు సంబంధించి 87,560 మంది రైతన్నలకు సంపూర్ణ భూహక్కు పత్రాలు ఇచ్చాం. గతంలో ఎవరూ పట్టించుకోలేదు.
11పశు సంరక్షణ: పశుసంపద ద్వారా కూడా రైతులకు అదనంగా ఆదాయం పెరగాలని అడుగులు ముందుకు వేశాం. పశువుల కోసం కూడా 340 అంబులెన్స్‌లు తీసుకొచ్చాం. నియోజకవర్గానికి 2 చొప్పున ఈరోజు మనకు కనిపిస్తున్నాయి.
12జగనన్న పాల వెల్లువ: రైతులకు వ్యవసాయంతో పాటు అదనపు ఆదాయం పెంచేందుకు సహకార రంగానికి తోడుగా ఉండేటట్టుగా.. ప్రైవేట్ డెయిరీల గుత్తాధిపత్యానికి గండి కొడుతూ అమూల్ రంగ ప్రవేశం చేసేలా అడుగులు వేశాం. అమూల్ వచ్చిన తర్వాత రెండేళ్లలో 8 సార్లు రేట్లు పెంచారు. గేదె పాలు రూ.22, ఆవు పాలు రూ.11 అదనంగా పెరిగింది.
13చిరుధాన్యాలకు ప్రోత్సాహం: బియ్యం మాత్రమే కాకుండా చిరుధాన్యాలను (మిల్లెట్స్) ప్రోత్సహిస్తున్నాం. 8 జిల్లాల్లో ఇంటింటికీ రేషన్ ద్వారా చిరు ధాన్యాలు ఇవ్వడం మొదలు పెట్టాం. స్కూళ్లలో రాగిజావ ఇస్తున్నాం. 32 చిరుధాన్యాల ప్రాసెసింగ్ ప్లాంట్లు మొదలు పెట్టాం. చిరుధాన్యాలకు కనీస మద్దతు ధర ఉండేలా అడుగులు వేస్తున్నాం. ఒకవేళ ఆ ధర లేకపోతే ప్రభుత్వమే మార్కెట్‌లో జోక్యం చేసుకుని కొనుగోలు చేస్తుంది.
14సమగ్ర భూ సర్వే: వందేళ్ల తర్వాత సమగ్ర భూ సర్వే నిర్వహిస్తున్నాం. రైతులకు గ్రామ స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా.. వాళ్ల భూములన్నింటికీ సమగ్రంగా సరిహద్దులు ఏర్పాటు చేసి, సర్వే రాళ్లను పాతించి, రైతుల రికార్డులు అప్‌డేట్ చేయించి, వివాదాలకు తావులేకుండా రైతుల చేతిలో భూహక్కు పత్రాలు పెట్టే గొప్ప కార్యక్రమం చేస్తున్నాం.
15గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు: రిజిస్ట్రేషన్ కోసం ఎక్కడికో వెళ్లాల్సిన పరిస్థితి రాకుండా 17 వేల రెవెన్యూ గ్రామాలకు గాను ఇప్పటికే 2 వేల రెవెన్యూ గ్రామాల్లోని సచివాలయాల్లో సబ్ రిజిస్ట్రేషన్ సేవలు అందుతున్నాయి.
16మరింత పటిష్టంగా ఆర్బీకేలు: రాబోయే రోజుల్లో ఆర్బీకేలను ఇంకా పటిష్టపరచబోతున్నాం. ఆర్బీకే స్థాయిలోనే సాయిల్ టెస్టింగ్ చేయించబోతున్నాం. గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ సర్టిఫికేషన్‌ను కూడా ప్రతి రైతన్నకు అందుబాటులోకి తీసుకువస్తున్నాం. వాటి ద్వారా రైతులు ఇంకా ఎక్కువ ధరకు అమ్ముకునే అవకాశం కల్పించడానికి జీఏపీ సర్టిఫికేషన్ తీసుకురాబోతున్నాం. నానో ఫెర్టిలైజర్స్‌ను తీసుకురాబోతున్నాం. తద్వారా డ్రోన్లు, ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం. ఎరువులు ఎంత అవసరమో అంతే వేసేలా చూస్తాం. ఆర్బీకేల పరిధిలో ప్రైమరీ ప్రాసెసింగ్, జిల్లా కేంద్రాల్లో సెకండరీ ప్రాసెసింగ్ తీసుకువస్తున్నాం. అందుకు తగిన విధంగా గోదాములు ప్రారంభిస్తున్నాం. ఇవన్నీ రాబోయే రోజుల్లో జరగబోయే గొప్ప మార్పులు.
Comments
Please login to add a commentAdd a comment