9 నెలలకే పండిపోతున్న వైనం
తగ్గిన కాయ పరిమాణం పడిపోయిన ధర
ఎకరాకు రూ.1.5 లక్షల నష్టం
కానరాని ఉద్యానశాఖాధికారులు
తాడేపల్లి రూరల్: గతేడాది అరటి పంటను సాగు చేసిన రైతులు ఒకింత ఆధాయాన్ని పొందారు. అయితే ఈ ఏడాది గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఏటా ఈ సీజన్‌లో పెళ్ళిళ్లు, శుభముహుర్తాలు, పండుగలు ఉండటంతో అరటికి మంచి డిమాండ్ ఉంటుంది. ఈ ఏడాది అందుకు విరుద్దుంగా అరటి రైతులు నష్టాలు చవిచూసే పరిస్థితి తల్తెతింది. జిల్లాలోని అరటితోటల పెంపకానికి కృష్ణాతీరం పేరొందిన ప్రాంతం. తుళ్లూరు, తాడేపల్లి, దుగ్గిరాల, కొల్లిపర తదితర మండలాల్లో వేలాది ఎకరాలలో అరటి పంటను రైతులు సాగుచేస్తున్నారు. ఎకరానికి కౌలుతో కలిపి రూ. 90 వేలు పెట్టుబడి అవుతోంది. వర్షాలు సకాలంలో కురువకపోవడంతో బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం చేయడం వల్ల అరటి రైతులకు ఈ సంవత్సరం కలిసి రాలేదని రైతులు చెబుతున్నారు. పంట వేసిన దగ్గర నుండి 11 నెలలకు పంట చేతికి వస్తుంది. ఈ ఏడాది మాత్రం 8-9 నెలలోనే అరటి గెలలు పండి ధర సగానికి సగం పడిపోయింది. ఈ సంవత్సరం వర్షాలు లేక, ఎండా కాలాన్ని తలపిస్తుండడంతో గెలలు ముందుగానే పక్వానికి వస్తున్నాయి కానీ కాయ పరిమాణం మాత్రం చాలా తక్కువగా ఉంటోంది. అదే 11 నెలలకు గనుక పక్వానికి వస్తే ఇప్పుడున్న సైజుకు రెండింతలు ఉంటుంది. దాంతో మార్కెట్‌లో కూడా అనుకున్న రేటు వస్తుందని రైతులు అంటున్నారు.
ఆగిపోయిన ఎగుమతులు..
మన ప్రాంతంలో పండిన అరటి గెలలు రాజస్తాన్, మహారాష్ట్ర, ఒరిస్సా, బెంగాల్ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. గెల 9 నెలలకే పండడంతో ఇతర రాష్ట్రాల ఎగుమతి ఆగిపోయింది. రూ. 250లకు అమ్ముడుపోయిన గెల రూ. 100-130 లకే అమ్మాల్సి వస్తోంది. ఎకరానికి రూ.1.5 లక్షలు నష్టం వస్తోందని రైతులు వాపోతున్నారు. అరటి తోటల్లో లోపాలను గుర్తించి, సలహాలు సూచనలు ఇచ్చే చర్యలు ఉద్యానవన శాఖాధికారులు చేపట్టలేదని రైతులు వాపోతున్నారు.
అరటి రైతు గిలగిల
Published Thu, Oct 29 2015 2:08 AM | Last Updated on Sun, Sep 3 2017 11:38 AM
Advertisement