గ్రీన్ హౌస్‌కు 100 శాతం సబ్సిడీ
ఎస్సీ, ఎస్టీ రైతులకు ఇవ్వాలని వ్యవసాయ శాఖ నిర్ణయం
ఎకరాకే వర్తింపు... సీఎం వద్దకు ఫైలు
సాక్షి, హైదరాబాద్: గ్రీన్ హౌస్ (పాలీ హౌస్) నిర్మాణానికి అయ్యే ఖర్చులో ఎస్సీ, ఎస్టీ రైతులకు నూటికి నూరు శాతం సబ్సిడీ ఇవ్వాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఇటీవలే 95 శాతం సబ్సిడీ ప్రకటించిన ప్రభుత్వం... మరో ఐదు శాతం కూడా వారు భరించడం కష్టమని భావించింది. ఆ ఐదు శాతాన్ని ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల నుంచి సంబంధిత కార్పొరేషన్ల ద్వారా, మిగిలిన 95 శాతం ఉద్యాన శాఖ బడ్జెట్ నిధుల నుంచి కేటాయించాలని నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి.
ఇందుకు సీఎం అంగీకరించినందున తక్షణమే అమలులోకి వచ్చేలా ప్రతిపాదన ఫైలును సిద్ధం చేస్తోంది. ఒకట్రెండు రోజుల్లో ముఖ్యమంత్రి వద్దకు ఫైలు వెళ్లనుంది. ఇదిలావుంటే ప్రస్తుతం 3 ఎకరాల వరకు ఏ రైతైనా 75 శాతం సబ్సిడీ పొందే వీలుంది. కానీ ఎస్సీ, ఎస్టీ రైతులు మాత్రం నూటికి నూరు శాతం సబ్సిడీని ఒక ఎకరానికి మాత్రమే పొందేలా పరిమితి విధించారు. వారు ఒక ఎకరానికి మించి గ్రీన్ హౌస్ సాగు చేసినా ఆర్థికంగా ఇబ్బంది పడతారని... కనుక ఎకరాకే పరిమితం చేశామని అధికారులు వెల్లడించారు. ఒకవేళ అంతకు మించి రెండు మూడు ఎకరాల వరకు సాగు చేస్తే 75 శాతం సబ్సిడీ వర్తింపచేస్తారు.
ఎకరానికి రూ.40 లక్షలు...
ఎకరా విస్తీర్ణంలో గ్రీన్ హౌస్ నిర్మాణానికి రూ.33.76 లక్షలు, దీనికి అదనంగా పూలు, కూరగాయల నారు మొక్కలకు రూ.5.6 లక్షల నుంచి రూ.25.3 లక్షలు ఖర్చవుతుంది. మొక్కలు, దుక్కులు తదితరాల కోసం మొత్తం కలిపి 40 లక్షల రూపాయలకు పైన వ్యయమవుతుందని అంచనా. వివిధ మొక్కలను బట్టి అది మారుతుంటుంది. నూరు శాతం సబ్సిడీ అమల్లోకి వస్తే ఎస్సీ, ఎస్టీ రైతులకు ఈ మొత్తం అందుతుంది.