సాక్షి, అమరావతి: కోవిడ్ కష్టకాలంలో మామిడి రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ధరలు పడిపోకుండా క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్న ప్రభుత్వం ఎగుమతులకు ఆటంకం లేకుండా పటిష్ట చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో 3,76,495 హెక్టార్లలో మామిడి సాగవుతుండగా.. ఈ ఏడాది 56.47 లక్షల టన్నుల మామిడి పండ్ల దిగుబడులు వస్తాయని అంచనా. గతేడాది లాక్‌డౌన్ కారణంగా మామిడి రవాణా విషయంలో విదేశాలతో పాటు దేశీయంగానూ రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఏడాది కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు రైతుకు ఊరటనిస్తున్నాయి. దశల వారీగా పంట మార్కెట్‌కు వచ్చేలా చేయడం.. రైతులు, ఎగుమతిదారులతో సమావేశాలు నిర్వహించడం ద్వారా పరిస్థితిని సమీక్షించడం, లాక్‌డౌన్ అమలులో రాష్ట్రాలతో పాటు ఆంక్షలు విధించిన రాష్ట్రాలతో చర్చలు జరుపుతూ రవాణాకు ఇబ్బంది లేకుండా చూడటం వంటి చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. గత నెలలో విజయవాడ, తిరుపతిలో నిర్వహించిన బయ్యర్స్, సెల్లర్స్ మీట్‌ల ద్వారా సుమారు 5 వేల టన్నుల ఎగుమతులకు ఒప్పందాలు జరిగాయి. బంగినపల్లి, సువర్ణ రేఖ, తోతాపురి (కలెక్టర్), చిన్న రసాలకు దేశీయంగానే కాకుండా విదేశాల నుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి.
తొలిసారి దక్షిణ కొరియాకు..
సువర్ణ రేఖ మామిడిని దక్షిణ కొరియాకు తొలిసారి ఎగుమతి చేశారు. విజయవాడ నుంచి విమాన మార్గం ద్వారా సౌదీకి పంపించి.. అక్కడి నుంచి వాయు మార్గంలోనే దక్షిణ కొరియాకు పంపించారు. న్యూజిలాండ్, సింగపూర్, ఒమన్ దేశాలకు సైతం 70 టన్నులకు పైగా మామిడి పండ్లు ఎగుమతి అయ్యాయి. అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, యూరప్ దేశాల నుంచి కనీసం 500 టన్నుల ఆర్డర్స్ వచ్చాయని చెబుతున్నారు. కోవిడ్ ఉధృతి నేపథ్యంలో భారత్ నుంచి ఆయా దేశాలకు విమాన రాకపోకలు నిలిచిపోవడంతో ఎగుమతులపై ప్రభావం చూపింది. నెలాఖరులోగా పరిస్థితి చక్కబడి విమాన రాకపోకలు పునరుద్ధరిస్తే ఎగుమతులకు డోకా ఉండదని భావిస్తున్నారు.
ఏడు కిసాన్ రైళ్లలో రవాణా
ఈ ఏడాది ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యల కారణంగా దేశంలోని వివిధ రాష్ట్రాలకు మామిడి రవాణా అవుతోంది. ఇప్పటికే విజయవాడ, విజయనగరం నుంచి ఢిల్లీకి కిసాన్ రైళ్లు వెళ్లాయి. వీటి ద్వారా సుమారు 3,500 టన్నుల మామిడితో ఢిల్లీలోని అజాద్‌పూర్ మార్కెట్‌కు పంపించారు. ఈ నెలాఖరులోగా రాయలసీమ, ఉత్తరాంధ్ర నుంచి మరిన్ని కిసాన్ రైళ్ల ద్వారా పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి లారీల ద్వారా పొరుగు రాష్ట్రాలకు రోజుకు వంద టన్నులకు పైగా మామిడి రవాణా అవుతోంది.
వినియోగదారులకు నేరుగా మామిడి
ఈ ఏడాది కూడా రాష్ట్రంతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోని గేటెడ్ కమ్యూనిటీ ఇళ్లు, అపార్టుమెంట్లలో నివసించే వారికి రాయలసీమ ప్రాంత రైతులు నేరుగా మామిడిని రవాణా చేస్తున్నారు. గతేడాది కరోనా దెబ్బకు టన్ను రూ.30 వేలకు మించి పలుకని మామిడి ఈ ఏడాది గరిష్టంగా రూ.లక్ష వరకు పలికింది. కాగా ప్రస్తుతం రూ.35వేల నుంచి రూ.45 వేల మధ్య నిలకడగా ఉంది.
దేశీయంగా ఇబ్బందుల్లేవు
మామిడి రైతులు నష్టపోకుండా ఎప్పటికప్పుడు మార్కెట్‌ను పరిశీలిస్తున్నాం. లాక్‌డౌన్ ఉన్న రాష్ట్రాలతో చర్చిస్తున్నాం. రవాణాకు ఇబ్బందుల్లేకుండా చూస్తున్నాం. సౌత్ కొరియాకు తొలి కన్‌సైన్‌మెంట్ వెళ్లింది. మిగిలిన దేశాలకూ పంపేందుకు సిద్ధంగా ఉన్నాం.
– ఎం.వెంకటేశ్వరరావు, ఏడీ, ఉద్యాన శాఖ
దక్షిణ కొరియాకు ఆంధ్రా మామిడి
Published Sat, May 8 2021 2:58 AM | Last Updated on Sat, May 8 2021 2:58 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment