సాక్షి, కరీంనగర్: ఎదుగుదల లేని మొక్కలు విక్రయించినా, కల్తీ నారు అంటగట్టినా ఇకపై కటకటాలు లెక్కించాల్సిందే. ఇబ్బడిముబ్బడిగా పూలు, పండ్ల మొక్కల విక్రయాలు, బంతి, మిర్చి నారు విక్రయాలు జోరందుకున్నాయి. ఒకప్పుడు అంకెల్లో ఉన్న నర్సరీలు నేడు వందలకు చేరాయి. హైబ్రిడ్ మొక్కలని అంటగట్టి ఉడాయిస్తున్నారు. ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకు ప్రయివేటు నర్సరీలను కూడా చట్ట పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కోరలు లేని గత చట్టానికి సవరణలు చేసి ఉద్యాన శాఖకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. నర్సరీల రిజిస్ట్రేషన్ సదరు శాఖ కనుసన్నల్లో సాగనుంది. ఇకపై జిల్లాలో ఉన్న నర్సరీలన్నీ ఉద్యాన శాఖ పరిధిలో చేరాల్సిందే. రైతులు, ప్రకృతి ప్రేమికులకు నాణ్యమైన మొక్కలు, నారు విక్రయాలతోపాటు నర్సరీలు బాధ్యతగా వ్యవహరించనున్నాయి. నష్టపరిహారం కూడా ఇచ్చే నిబంధన ఉండటంతో పారదర్శకంగా ఉండనున్నారు.
పక్కాగా రిజిస్ట్రేషన్.. లేకుంటే కఠిన చర్యలే
రైతులను మోసగించే నర్సరీదారులను ఏకంగా జైలుకు పంపించే నూతన నియమావళిని జారీ చేసింది ప్రభుత్వం. 27 పేజీల జీవోలో విత్తన దశ నుంచి నారు విక్రయం వరకు అన్ని దశల్లో రైతును కాపాడేలా కఠిన నిబంధనలను విధించింది. రైతులను మోసగించే ఏ చర్యనూ సహించబోమని మార్గదర్శకాల్లో పేర్కొంది. గతంలో ఖమ్మం జిల్లాలో నాసిరకం మిర్చి విత్తనాలు సరఫరా చేసిన వారిపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేసిన ప్రభుత్వం రైతు రక్షణకు ఈ చట్టాన్ని రూపొందించింది. ఏటా నకిలీ మకిలీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతోంది. ఈ క్రమంలో నర్సరీదారుల నూతన లైసెన్సు పొందే అంశం నుంచి నారు ఏ దశలో విక్రయించాలి, అక్రమాలు జరిగితే విధించే శిక్షలు తదితర విషయాలన్ని అందులో వివరంగా పేర్కొంటూ జీవో విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ఉద్యాన నర్సరీల రిజిస్ట్రేషన్(నియంత్రణ) నియమావళి–2012కు పలు సవరణలు చేస్తూ తెలంగాణ రిజిస్ట్రేషన్ ఆఫ్ నర్సరీ రూల్స్–2017 పేరిట ఉద్యాన శాఖ దీనిని రూపొందించింది.
4 లక్షల లోపు మొక్కలుండే నర్సరీకి రూ.500 రిజిస్ట్రేషన్ రుసుము, 4 లక్షలకు పైగా మొక్కలుండే నర్సరీలకు రూ.వెయ్యి రుసుము నిర్ణయించారు. ఏ సర్వే నంబర్ భూమిలో నర్సరీ నిర్వహిస్తున్నారు, భూసార పరీక్ష ఫలితాలున్నాయా, ఏ నేల, నేల స్వభావం, ఏయే మొక్కలు వృద్ధి చేస్తున్నారు, భూమికి సంబంధించిన పాసుపుస్తకాలు ఇలా అన్ని వివరాలను అందజేయాలి. వివిధ రకాల పండ్లు, కూరగాయలు, పూలు, ఔషధ, సుగంధ ద్రవ్యాల నాణ్యమైన మొక్కల తయారీకి ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. పండ్ల మొక్కల ఉత్పత్తికి రూ.5 వేలు, కూరగాయలు, పూలు, ఔషధ, సుగంధ ద్రవ్యాల మొక్కలు 4 లక్షలలోపు పెంపకానికి రూ.వెయ్యి, 4 లక్షలకు మించిన మొక్కల పెంపకానికి రూ.2,500 ఫీజు చెల్లించాలి. పండ్ల మొక్కల నర్సరీలను ఏడాదికోసారి, కూరగాయ నర్సరీలను 4 నెలలకోసారి అధికారులు తనిఖీ చేస్తారు.
నిబంధనలు తప్పనిసరి
అనుమతి పొందిన నర్సరీలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి. నర్సరీదారులు విత్తనం ఎక్కడ నుంచి సేకరించారు. బిల్లు వివరాలు, లాట్ నంబర్, బ్యాచ్ నంబర్, విత్తన పరీక్ష వివరాల పత్రాలు, విత్తనం తయారుచేసిన తేదీ, గడువు తేదీ, విత్తిన తేదీ, నారు మొక్కలు అమ్మిన తేదీ తదితర వివరాలు విధిగా నమోదు చేయాలి. నర్సరీ ప్రధాన ద్వారం వద్ద ఒక బోర్డు ఏర్పాటు చేసి అక్కడ లభించే నారు మొక్కల సంఖ్య, ధరల పట్టిక తెలుగులో రాసి ఉంచాలి. నాణ్యమైన నారు మొక్కల పెంపకానికి సరైన భూమి ఎన్నుకోవడంతోపాటు చుట్టూ ఫెన్సింగ్ వేయాలి. పిల్ల, తల్లి మొక్కల బ్లాక్‌లను వేరుగా ఉంచాలి. నీటితోపాటు కార్యాలయం, స్టోర్ వసతులు ఉండాలి. మొలకలు, నర్సరీ బెడ్ల తయారీ, షేడ్‌నెట్ హౌస్, నెట్‌హౌస్, పాలీటన్నెల్, చాంబర్ తదితరరాలు సమకూర్చుకోవడంతోపాటు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలి. నారు వయస్సు, నాణ్యత ప్రమాణాలపై ప్రత్యేక నిబంధనలు రూపొందించారు.
నిబంధనలు అతిక్రమిస్తే శిక్షే
నిబంధనలు పాటించని నర్సరీదారులపై చట్ట ప్రకారం రూ.50 వేల జరిమానా లేదా ఏడాది జైలు శిక్ష లేదా రెండూ విధించవచ్చు. రైతులు కూడా రిజిస్టర్ నర్సరీ నుంచే నారు కొనుగోలు చేయాలి. బిల్లు తీసుకుని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. రిజిస్ట్రేషన్ కోసం గడువేమీ లేదని, వీలైనంత త్వరగా ఉద్యాన శాఖలో సంప్రదించి నమోదు చేసుకోవాలని ఉద్యాన అధికారులు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment