nursary
-
మొక్కలు, కల్తీ నారు అమ్మితే జైలుకే
సాక్షి, కరీంనగర్: ఎదుగుదల లేని మొక్కలు విక్రయించినా, కల్తీ నారు అంటగట్టినా ఇకపై కటకటాలు లెక్కించాల్సిందే. ఇబ్బడిముబ్బడిగా పూలు, పండ్ల మొక్కల విక్రయాలు, బంతి, మిర్చి నారు విక్రయాలు జోరందుకున్నాయి. ఒకప్పుడు అంకెల్లో ఉన్న నర్సరీలు నేడు వందలకు చేరాయి. హైబ్రిడ్ మొక్కలని అంటగట్టి ఉడాయిస్తున్నారు. ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకు ప్రయివేటు నర్సరీలను కూడా చట్ట పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కోరలు లేని గత చట్టానికి సవరణలు చేసి ఉద్యాన శాఖకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. నర్సరీల రిజిస్ట్రేషన్ సదరు శాఖ కనుసన్నల్లో సాగనుంది. ఇకపై జిల్లాలో ఉన్న నర్సరీలన్నీ ఉద్యాన శాఖ పరిధిలో చేరాల్సిందే. రైతులు, ప్రకృతి ప్రేమికులకు నాణ్యమైన మొక్కలు, నారు విక్రయాలతోపాటు నర్సరీలు బాధ్యతగా వ్యవహరించనున్నాయి. నష్టపరిహారం కూడా ఇచ్చే నిబంధన ఉండటంతో పారదర్శకంగా ఉండనున్నారు. పక్కాగా రిజిస్ట్రేషన్.. లేకుంటే కఠిన చర్యలే రైతులను మోసగించే నర్సరీదారులను ఏకంగా జైలుకు పంపించే నూతన నియమావళిని జారీ చేసింది ప్రభుత్వం. 27 పేజీల జీవోలో విత్తన దశ నుంచి నారు విక్రయం వరకు అన్ని దశల్లో రైతును కాపాడేలా కఠిన నిబంధనలను విధించింది. రైతులను మోసగించే ఏ చర్యనూ సహించబోమని మార్గదర్శకాల్లో పేర్కొంది. గతంలో ఖమ్మం జిల్లాలో నాసిరకం మిర్చి విత్తనాలు సరఫరా చేసిన వారిపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేసిన ప్రభుత్వం రైతు రక్షణకు ఈ చట్టాన్ని రూపొందించింది. ఏటా నకిలీ మకిలీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతోంది. ఈ క్రమంలో నర్సరీదారుల నూతన లైసెన్సు పొందే అంశం నుంచి నారు ఏ దశలో విక్రయించాలి, అక్రమాలు జరిగితే విధించే శిక్షలు తదితర విషయాలన్ని అందులో వివరంగా పేర్కొంటూ జీవో విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ఉద్యాన నర్సరీల రిజిస్ట్రేషన్(నియంత్రణ) నియమావళి–2012కు పలు సవరణలు చేస్తూ తెలంగాణ రిజిస్ట్రేషన్ ఆఫ్ నర్సరీ రూల్స్–2017 పేరిట ఉద్యాన శాఖ దీనిని రూపొందించింది. 4 లక్షల లోపు మొక్కలుండే నర్సరీకి రూ.500 రిజిస్ట్రేషన్ రుసుము, 4 లక్షలకు పైగా మొక్కలుండే నర్సరీలకు రూ.వెయ్యి రుసుము నిర్ణయించారు. ఏ సర్వే నంబర్ భూమిలో నర్సరీ నిర్వహిస్తున్నారు, భూసార పరీక్ష ఫలితాలున్నాయా, ఏ నేల, నేల స్వభావం, ఏయే మొక్కలు వృద్ధి చేస్తున్నారు, భూమికి సంబంధించిన పాసుపుస్తకాలు ఇలా అన్ని వివరాలను అందజేయాలి. వివిధ రకాల పండ్లు, కూరగాయలు, పూలు, ఔషధ, సుగంధ ద్రవ్యాల నాణ్యమైన మొక్కల తయారీకి ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. పండ్ల మొక్కల ఉత్పత్తికి రూ.5 వేలు, కూరగాయలు, పూలు, ఔషధ, సుగంధ ద్రవ్యాల మొక్కలు 4 లక్షలలోపు పెంపకానికి రూ.వెయ్యి, 4 లక్షలకు మించిన మొక్కల పెంపకానికి రూ.2,500 ఫీజు చెల్లించాలి. పండ్ల మొక్కల నర్సరీలను ఏడాదికోసారి, కూరగాయ నర్సరీలను 4 నెలలకోసారి అధికారులు తనిఖీ చేస్తారు. నిబంధనలు తప్పనిసరి అనుమతి పొందిన నర్సరీలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి. నర్సరీదారులు విత్తనం ఎక్కడ నుంచి సేకరించారు. బిల్లు వివరాలు, లాట్ నంబర్, బ్యాచ్ నంబర్, విత్తన పరీక్ష వివరాల పత్రాలు, విత్తనం తయారుచేసిన తేదీ, గడువు తేదీ, విత్తిన తేదీ, నారు మొక్కలు అమ్మిన తేదీ తదితర వివరాలు విధిగా నమోదు చేయాలి. నర్సరీ ప్రధాన ద్వారం వద్ద ఒక బోర్డు ఏర్పాటు చేసి అక్కడ లభించే నారు మొక్కల సంఖ్య, ధరల పట్టిక తెలుగులో రాసి ఉంచాలి. నాణ్యమైన నారు మొక్కల పెంపకానికి సరైన భూమి ఎన్నుకోవడంతోపాటు చుట్టూ ఫెన్సింగ్ వేయాలి. పిల్ల, తల్లి మొక్కల బ్లాక్‌లను వేరుగా ఉంచాలి. నీటితోపాటు కార్యాలయం, స్టోర్ వసతులు ఉండాలి. మొలకలు, నర్సరీ బెడ్ల తయారీ, షేడ్‌నెట్ హౌస్, నెట్‌హౌస్, పాలీటన్నెల్, చాంబర్ తదితరరాలు సమకూర్చుకోవడంతోపాటు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలి. నారు వయస్సు, నాణ్యత ప్రమాణాలపై ప్రత్యేక నిబంధనలు రూపొందించారు. నిబంధనలు అతిక్రమిస్తే శిక్షే నిబంధనలు పాటించని నర్సరీదారులపై చట్ట ప్రకారం రూ.50 వేల జరిమానా లేదా ఏడాది జైలు శిక్ష లేదా రెండూ విధించవచ్చు. రైతులు కూడా రిజిస్టర్ నర్సరీ నుంచే నారు కొనుగోలు చేయాలి. బిల్లు తీసుకుని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. రిజిస్ట్రేషన్ కోసం గడువేమీ లేదని, వీలైనంత త్వరగా ఉద్యాన శాఖలో సంప్రదించి నమోదు చేసుకోవాలని ఉద్యాన అధికారులు వివరించారు. -
ప్రతి గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేయండి
సాక్షి, హైదరాబాద్: హరితహారంలో భాగంగా ప్రతి గ్రామం, మున్సిపాలిటీల్లో నర్సరీలను ఏర్పాటు చేయాలని సీఎస్ ఎస్.కె.జోషి పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో హరితహారం కార్యక్రమంపై సీఎస్ సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 142 పట్టణ స్థానిక సంస్థలు, 12751 గ్రామపంచాయతీలలో భూమి గుర్తింపు, అవసరమైన మౌలిక సదుపాయాలు, మొక్కలు తదితర వివరాలను వారంలోగా పంపాలన్నారు. అర్బన్ పార్కుల్లో నర్సరీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణ నర్సరీల పర్యవేక్షణకు అర్బన్ ఫారెస్ట్రీ, ఎంఏయూడీ ఓఎస్డీ కృష్ణను నోడల్ అధికారిగా నియమించినట్లు సీఎస్ తెలిపారు. కార్యక్రమంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
మేమొస్తున్నామని డ్రామా చేశారా?
చందంపేట(దేవరకొండ): ‘నర్సరీలపై ఇంత నిర్లక్ష్యమా? మేము వస్తున్నామని ఎక్కడి నుంచో మొక్కలను తీసుకొచ్చి ఇక్కడ ఉంచుతారా? డ్రామా చేస్తున్నారా? బుర్ర పనిచేయడం లేదా? పది రోజుల్లో మళ్లీ వస్తా.. నర్సరీల్లోని మొక్కలన్నీ బతకాలి..’ అంటూ తెలంగాణకు హరితహారం కార్యక్రమ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నల్లగొండ జిల్లా చందంపేట మండలం గాగిళ్లాపురం, కోరుట్ల గ్రామాల్లోని అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వన నర్సరీలను నల్లగొండ కలెక్టర్ గౌరవ్ ఉప్పల్‌తో కలిసి ఆమె పరిశీలించారు. వన నర్సరీల పెంపకంలో అధికారులు పూర్తిస్థాయిలో నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. తాము వస్తున్నట్లు సమాచారం మేరకు తాత్కాలికంగా కొన్ని మొక్కలు ఏర్పాటు చేయడం సరికాదన్నారు. ఎటువంటి ప్రమాణాలు పాటించకుండా, మట్టి నమూనాలు లేకుండా మొక్కలు ఎలా పెంచుతారని ప్రశ్నించారు. మొక్కల సంరక్షణకు పంపిణీ చేసిన నెట్లను కూడా ఏర్పాటు చేయకపోవడం ఏమిటని ప్రశ్నల వర్షం కురిపించారు. మండలంలో ఉన్న నర్సరీల్లో గ్లీనరీ కనిపించాలని, లేని పక్షంలో ఉపేక్షించేది లేదని సంబంధిత అధికారులను హెచ్చరించారు. ప్రతి మొక్క బతకాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో 24 శాతం ఉన్న అడవుల శాతాన్ని 30 శాతం పెంచేందుకు ప్రభుత్వం లక్ష్యంతో ఉందన్నారు. ఐదేళ్లలో 230 కోట్ల మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. అటవీ ప్రాంతాల్లో వంద కోట్లు, సామాజిక అడవుల కింద 120 కోట్లు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో 10 కోట్ల మొక్కలు పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. రూ.80 కోట్ల నిధులు ఉన్నాయి : కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ నల్లగొండ జిల్లాలో అభివృద్ధి పనులకు సంబంధించి రూ. 80 కోట్ల నిధులున్నాయని నల్లగొండ కలెక్టర్ ఉప్పల్ తెలిపారు. నర్సరీలో పనిచేస్తున్న సిబ్బందికి 5 నెలలుగా వేతనాలు అందకపోవడంతో నర్సరీలో పనులకు రావడం లేదని కూలీలు కలెక్టర్‌కు తెలిపారు. వేతనాలు రేపటిలోగా అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వారం రోజుల్లో వర్క్‌షాప్ ఏర్పాటు చేసి మొక్కల పెంపకంపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ శాంతారాం, ఆర్డీఓ లింగ్యానాయక్, ఎఫ్డీ లోవు సుదర్శన్‌రెడ్డి, జి.రవి, ఎఫ్ఆర్వో సర్వేశ్వర్, ఇన్చార్జ్ ఎంఈఓ శంకర్, ఎంపీడీఓ రామకృష్ణ, ఏపీఓ శ్రీనివాస్, శేఖర్ ఉన్నారు. -
నర్సరీ పరిశీలన
రాయికోడ్: మండలంలోని రాయిపల్లి గ్రామ ఈజీఎస్ నర్సరీని ఉపాధి హామీ పథకం ఇంజినీరింగ్ కన్సల్టెంట్ విష్ణువర్ధన్ సోమవారం పరిశీలించారు. నర్సరీల్లో పాడైన మొక్కల స్థానంలో నిమ్మ, కరివేపాకు విత్తనాలను నాటి మొక్కలుగా పెంచాలన్నారు. మెరుగైన పోషణ పద్ధతులు పాటిస్తే నిమ్మ, కరివేపాకు మొక్కలు 25 రోజుల్లో నాటేందుకు ఎదుగుతాయన్నారు. ప్రతి రోజూ నర్సరీల్లోని మొక్కలను పరిశీలిస్తూ బాధ్యతగా పెంచాలని నిర్వాహకులకు సూచించారు. మొక్కల పెంపకంపై కూలీలకు పలు సూచనలు చేశారు. రాయిపల్లి నర్సరీలో మొత్తం లక్ష మొక్కలను పెంచాల్సి ఉండగా ఇప్పటి వరకు 70 వేల మొక్కలను పెంచి పంపిణీ చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం టేకు, చింత తదితర మొక్కలు పెరుగుతున్నాయన్నారు. మరికొన్ని మొక్కలను పెంచడానికి కవర్లలో మట్టిని నింపి సిద్ధం చేశారన్నారు. అనంతరం కర్చల్-ఇందూర్ ప్రధాన రహదారికి ఇరుపక్కల నాటిన మొక్కలను పరిశీలించారు. మొక్కలకు నీళ్లు పోస్తున్న కూలీలకు సూచనలు చేశారు. కార్యక్రమంలో టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్లు సాయన్న, ధనుంజయ్, కూలీలు పాల్గొన్నారు. మొక్కల సంరక్షణకు చర్యలు గత రెండు వారాలుగా మండలంలో వర్షాలు ముఖం చాటేయడంతో నాటిన మొక్కల సంరక్షణకు చర్యలు చేపట్టారు. సోమవారం జంమ్గి గ్రామంలో పలువురు రైతులు తమ పొలం గట్లపై నాటిన టేకు మొక్కలకు నీళ్లు పట్టారు. నాటిన టేకు మొక్కల సంరక్షణ కోసం ఒక్కో మొక్కకు నెలకు రూ.5 చొప్పున ఈజీఎస్ ద్వారా అందిస్తామని అధికారులు తెలిపారు. రెండు సంవత్సరాల వరకు మొక్కల పోషణ ఖర్చులు ఇవ్వనున్నట్లు చెప్పారు. రైతులు మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. -
నర్సరీ ఏర్పాటుకు సన్నాహాలు
–మున్సిపాలిటీ ఆధ్వర్యంలో యత్నం –ప్రతిపాదనలను పరిశీలిస్తున్న కమిషనర్ –తక్కువ ధరకు మొక్కలను అందించాలనే లక్ష్యం కోదాడఅర్బన్: హరితహారం కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలో నాటిన మొక్కలను ఇప్పటివరకు అధికారులు వివిధ నర్సరీల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఇందుకోసం మున్సిపల్ ఫండ్ నుంచి బడ్జెట్‌ను కేటాయించారు. ఇటీవల వివిధ వార్డులలో ప్రజలకు పండ్లు, పూల మొక్కలను పంపిణీ చేసే సమయంలో తమ ఇళ్లల్లో మొక్కలు నాటేందుకు ప్రజల నుంచి∙వచ్చిన స్పందనను కమిషనర్ అమరేందర్‌రెడ్డి పరిశీలించారు. దీంతో కోదాడ పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో నర్సరీ ఏర్పాటు చేయాలని ఆయన యోచిస్తున్నారని సమాచారం. దీనిపై ప్రాథమికంగా స్థల పరిశీలన చేసి ఆయన త్వరలో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను పాలకవర్గం ముందు ఉంచనున్నారు. పయోజనకారిగా ఉండేలా చర్యలు.... హరితహారం కార్యక్రమంలో భాగంగా పట్టణ ప్రజలను ఎక్కువగా భాగస్వాములుగా చేసేందుకు మున్సిపాలిటీ అధికారులు నిర్ణయించారు. నీడనిచ్చే మొక్కలను వీధులలో పెంచేందుకు ఆసక్తి చూపిన ప్రజలు తమ ఇళ్లల్లో మాత్రం వాటిని పెంచేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. దీనిని దష్టి ఉంచుకుని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నర్సరీని ఏర్పాటు చేసి ప్రజలకు ప్రయోజనకారిగా ఉండేలా నిర్వహించాలని కమిషనర్ యోచిస్తున్నారు. పట్టణ వాసులు తమకు కావాల్సిన పండ్లు, పూల రకాల మొక్కలను ప్రైవేట్‌గా నిర్వహించే నర్సరీల నుంచి అధిక మొత్తాన్ని వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. పట్టణ ప్రజలకు ఆంధ్రా ప్రాంతంలోని నర్సరీలలో దొరికే మంచి మొక్కలను తమ నర్సరీలోనే లభించేలా, మున్సిపాలిటీకి ఆదాయపరంగా, ప్రజలకు ప్రయోజకరంగా ఉండేలా దీనిని ఏర్పాటు చేయాలని కమిషనర్ ప్రయత్నిస్తున్నారు. ఈ నర్సరీ ఏర్పాటుపై ఆయన ఇప్పటికే బైపాస్ సమీపంలోని ఉత్తమ్ పద్మావతి నగర్‌లోని పార్క్ నిర్మాణ ప్రదేశంతో పాటు అక్కడే మున్సిపల్ లేఅవుట్ స్థలాన్ని పరిశీలించారు. పార్క్‌లో నిర్మాణ పనులు జరుగుతున్నందున రెండుఎకరాలకు పైగా ఉన్న లేఅవుట్ స్థలంలో దీనిని ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నారు. అయితే నర్సీరీ ఏర్పాటు, తదనంతరం నిర్వహణా ఖర్చులకు సంబంధించిన ప్రాజెక్టు రిపోర్టును తయారుచేసేందుకు ఆయన నిర్ణయించారు. ప్రస్తుతం నర్సరీ ఏర్పాటు, దానిలో ఏయే మొక్కలు పెంచాలి, వాటి నిర్వహణకు అవసరమైన సిబ్బంది, వారి జీతభత్యాలు, ఇతర నిర్వహణ వ్యయాలపై సమగ్రంగా అధ్యయనం చేసి దీనిపై రిపోర్టు తయారుచేసి దానిని పాలకవర్గ ముందు ఉంచనున్నారు. ఈ ప్రక్రియ త్వరగా పూర్తయితే పట్టణ వాసులకు నాణ్యమైన మొక్కలు తక్కువ ధరలకే అందుబాటులో రానున్నాయి. ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం: కె.అమరేందర్‌రెడ్డి, కమిషనర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలో నర్సరీని ఏర్పాటు చేసి ప్రజలకు మేలు జాతుల పండ్లు, పూల మొక్కలను అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. హరితహారం కార్యక్రమంలో భాగంగా వచ్చే సంవత్సరం నిర్వహించనున్న కార్యక్రమానికి మున్సిపాలిటీ నర్సరీ నుంచి మొక్కలు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. మొక్కల పెంపకం విషయంలో ప్రజలను చైతన్యపరిచి, హరితహారం కార్యక్రమంలో ఎక్కువ భాగస్వామ్యం కల్పించేందుకు ఈ నర్సరీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. -
మెుక్క.. లెక్క తప్పింది..!
అప్పుడు ఉన్నాయన్నారు.. ఇప్పుడు కొంటామంటున్నారు.. సోషల్ ఫారెస్టులో మళ్లీ మొక్కల›కొనుగోళ్ల జాతర ఏకంగా 1.30 కోట్ల మొక్కలు కొనాలని నిర్ణయం అత్యవసరం పేరుతో షార్ట్‌టెండర్ గతేడాది కొనుగోళ్లలో రూ.కోట్లలో అక్రమాలు.. సస్పెన్షన్లు.. సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ‘హరితహారం అమలుకు సిద్ధంగా ఉన్నాం.. నాటేందుకు నాలుగు కోట్ల మొక్కలు అందుబాటులో ఉంచాం. ఈసారి అటవీ శాఖ నర్సరీల్లో 1.45 కోట్ల మొక్కలు పెంచాం. సోషల్ ఫారెస్టు నర్సరీల్లో 1.10 కోట్ల మొక్కలు, డ్వామా నర్సరీల్లో కోటి మొక్కలు, ఐటీడీఏ నర్సరీల్లో 30 లక్షలు, సింగరేణి నర్సరీల్లో 15 లక్షల మొక్కలు పెంచాం. మొత్తం నాలుగు కోట్ల మొక్కలున్నాయి.. ఉద్యమంలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం..’ హరితహారం కార్యక్రమం ప్రారంభానికి (ఈనెల 8కి) ముందు ప్రజాప్రతినిధుల ప్రకటనలు, ఉన్నతాధికారుల నివేదికల సారాంశం ఇది. ‘నర్సరీల్లో టేకు మొక్కలు ఇంకా పెరగలేదు. ఇంకా పండ్ల మొక్కలు కావాలని ప్రజలు అడుగుతున్నారు. ప్రస్తుతం ఈ మొక్కలు అందుబాటులో లేవు. అందుకే అత్యవసరంగా మొక్కలు కొనుగోలు చేయాలని నిర్ణయించాం.’ సోషల్ ఫారెస్టు విభాగం తాజా నిర్ణయమిది. హరితహారం మొక్కల కొనుగోళ్ల జాతరకు మళ్లీ తెరలేచింది. ఇన్నాళ్లు నాలుగు కోట్ల మొక్కలు సిద్ధంగా ఉన్నాయని ప్రకటించిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పుడు నర్సరీల్లో మొక్కలు ఇంకా పెరగలేవని, సుమారు 30 లక్షల పండ్ల మొక్కలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా జామ, మామిడి, సపోట, దానిమ్మ వంటి పండ్ల మొక్కలను కొనేందుకు సిద్ధమయ్యారు. ఈ 30 లక్షల్లో పది లక్షల అంట్ల మొక్కలు (గ్రాఫ్ట్ వెరైటీ) కొనాలని భావిస్తున్నారు. అత్యవసరం పేరుతో షార్ట్‌టెండర్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. గతేడాది మొక్కల కొనుగోళ్లలో భారీగా అక్రమాలు జరిగిన విషయం విధితమే. అసలు కొనుగోలు చేయకుండానే కొన్నట్లు.. వాటిని రహదారులకు ఇరువైపులా నాటినట్లు రికార్డులు సృష్టించారు. ప్రజాప్రతినిధులు, అటవీ శాఖలోని అధికారులు కాంట్రాక్టర్లుగా అవతారమెత్తి రూ.లక్షల్లో జేబులు నింపుకున్నారు. ఆ శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు చేపట్టిన విచారణలో ఈ వ్యవహారం బట్టబయలు కావడంతో ఏకంగా డీఎఫ్‌వోతోపాటు, పలువురు రేంజ్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ నేపథ్యంలో ఈసారి 30 లక్షల మొక్కలు కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. ఈ సారైనా కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగుతుందా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో కోటి టేకు వేర్లు కొనుగోళ్లు.. పండ్ల మొక్కలే కాదు, టేకు వేర్లను కూడా కొనుగోలు చేయాలని అటవీ శాఖ నిర్ణయించింది. ఇప్పటివరకు టేకు మొక్కలను సరఫరా చేసిన అటవీ శాఖ ఇప్పుడు రైతులకు టేకు వేర్లనే సరఫరా చేయాలని భావిస్తోంది. దీంతో ఇకపై రైతులు టేకు మొక్కలకు బదులు టేకు వేర్లను నాటుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు కోటి టేకు వేర్లను కొనుగోలు చేసేందుకు షార్ట్టెండర్లు పిలవాలని నిర్ణయించారు. అయితే సమయం లేదనే కారణంగా ఇతర పక్క జిల్లాల్లో సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లకే సరఫరా కాంట్రాక్టు అప్పగించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. 1.63 కోట్లు నాటి రాష్ట్రంలోనే ప్ర«థమస్థానం.. హరితహారం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గానికి 40 లక్షల చొప్పున జిల్లా వ్యాప్తంగా నాలుగు కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఈ నెల 8న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో సోమవారం వరకు 1.63 కోట్ల మొక్కలు నాటినట్లు అటవీ శాఖ రికార్డుల్లో పేర్కొంటోంది. ఈ లెక్కన నాలుగు కోట్ల మొక్కల్లో నాటిన 1.63 కోట్ల మొక్కలు పోగా, ఇంకా సుమారు 2.37 కోట్ల మొక్కలుండాలి. కానీ.. అటవీ శాఖ తాజాగా 1.30 కోట్ల మొక్కలను కొనుగోలు చేయాలనే నిర్ణయానికి రావడం గమనార్హం. దీంతో మొక్కల లెక్కల్లో గందరగోళం నెలకొంది.] ప్రజలు అడుగుతున్నారనే కొంటున్నాం.. పండ్ల మొక్కలు కావాలని ప్రజలు కోరుతున్నారు.. టేకు మొక్కలు కావాలని రైతులు అడుగుతున్నారు. పెంచిన మొక్కలన్నీంటిని సరఫరా చేశాం. ఇంకా కావాలని డిమాండ్ ఉంది. 30 లక్షల పండ్ల మొక్కలు కావాలని మండలాల నుంచి ఇండెంట్లు అందాయి. అందుకే కొనుగోలు చేయాలని నిర్ణయించాం. ఈ మేరకు కొనుగోళ్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టాం. – శ్రీనివాస్‌రావు, సోషల్ ఫారెస్టు డీఎఫ్‌వో