నర్సరీ ఏర్పాటుకు సన్నాహాలు
–మున్సిపాలిటీ ఆధ్వర్యంలో యత్నం
–ప్రతిపాదనలను పరిశీలిస్తున్న కమిషనర్
–తక్కువ ధరకు మొక్కలను అందించాలనే లక్ష్యం
కోదాడఅర్బన్: హరితహారం కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలో నాటిన మొక్కలను ఇప్పటివరకు అధికారులు వివిధ నర్సరీల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఇందుకోసం మున్సిపల్ ఫండ్ నుంచి బడ్జెట్‌ను కేటాయించారు. ఇటీవల వివిధ వార్డులలో ప్రజలకు పండ్లు, పూల మొక్కలను పంపిణీ చేసే సమయంలో తమ ఇళ్లల్లో మొక్కలు నాటేందుకు ప్రజల నుంచి∙వచ్చిన స్పందనను కమిషనర్ అమరేందర్‌రెడ్డి పరిశీలించారు. దీంతో కోదాడ పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో నర్సరీ ఏర్పాటు చేయాలని ఆయన యోచిస్తున్నారని సమాచారం. దీనిపై ప్రాథమికంగా స్థల పరిశీలన చేసి ఆయన త్వరలో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను పాలకవర్గం ముందు ఉంచనున్నారు.
పయోజనకారిగా ఉండేలా చర్యలు....
హరితహారం కార్యక్రమంలో భాగంగా పట్టణ ప్రజలను ఎక్కువగా భాగస్వాములుగా చేసేందుకు మున్సిపాలిటీ అధికారులు నిర్ణయించారు. నీడనిచ్చే మొక్కలను వీధులలో పెంచేందుకు ఆసక్తి చూపిన ప్రజలు తమ ఇళ్లల్లో మాత్రం వాటిని పెంచేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. దీనిని దష్టి ఉంచుకుని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నర్సరీని ఏర్పాటు చేసి ప్రజలకు ప్రయోజనకారిగా ఉండేలా నిర్వహించాలని కమిషనర్ యోచిస్తున్నారు. పట్టణ వాసులు తమకు కావాల్సిన పండ్లు, పూల రకాల మొక్కలను ప్రైవేట్‌గా నిర్వహించే నర్సరీల నుంచి అధిక మొత్తాన్ని వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. పట్టణ ప్రజలకు ఆంధ్రా ప్రాంతంలోని నర్సరీలలో దొరికే మంచి మొక్కలను తమ నర్సరీలోనే లభించేలా, మున్సిపాలిటీకి ఆదాయపరంగా, ప్రజలకు ప్రయోజకరంగా ఉండేలా దీనిని ఏర్పాటు చేయాలని కమిషనర్ ప్రయత్నిస్తున్నారు. ఈ నర్సరీ ఏర్పాటుపై ఆయన ఇప్పటికే బైపాస్ సమీపంలోని ఉత్తమ్ పద్మావతి నగర్‌లోని పార్క్ నిర్మాణ ప్రదేశంతో పాటు అక్కడే మున్సిపల్ లేఅవుట్ స్థలాన్ని పరిశీలించారు. పార్క్‌లో నిర్మాణ పనులు జరుగుతున్నందున రెండుఎకరాలకు పైగా ఉన్న లేఅవుట్ స్థలంలో దీనిని ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నారు. అయితే నర్సీరీ ఏర్పాటు, తదనంతరం నిర్వహణా ఖర్చులకు సంబంధించిన ప్రాజెక్టు రిపోర్టును తయారుచేసేందుకు ఆయన నిర్ణయించారు. ప్రస్తుతం నర్సరీ ఏర్పాటు, దానిలో ఏయే మొక్కలు పెంచాలి, వాటి నిర్వహణకు అవసరమైన సిబ్బంది, వారి జీతభత్యాలు, ఇతర నిర్వహణ వ్యయాలపై సమగ్రంగా అధ్యయనం చేసి దీనిపై రిపోర్టు తయారుచేసి దానిని పాలకవర్గ ముందు ఉంచనున్నారు. ఈ ప్రక్రియ త్వరగా పూర్తయితే పట్టణ వాసులకు నాణ్యమైన మొక్కలు తక్కువ ధరలకే అందుబాటులో రానున్నాయి.
ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం: కె.అమరేందర్‌రెడ్డి, కమిషనర్
మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలో నర్సరీని ఏర్పాటు చేసి ప్రజలకు మేలు జాతుల పండ్లు, పూల మొక్కలను అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. హరితహారం కార్యక్రమంలో భాగంగా వచ్చే సంవత్సరం నిర్వహించనున్న కార్యక్రమానికి మున్సిపాలిటీ నర్సరీ నుంచి మొక్కలు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. మొక్కల పెంపకం విషయంలో ప్రజలను చైతన్యపరిచి, హరితహారం కార్యక్రమంలో ఎక్కువ భాగస్వామ్యం కల్పించేందుకు ఈ నర్సరీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం.