మెుక్క.. లెక్క తప్పింది..! | tree plant.. no counting | Sakshi
Sakshi News home page

మెుక్క.. లెక్క తప్పింది..!

Published Tue, Jul 19 2016 6:00 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM

మెుక్క.. లెక్క తప్పింది..!

మెుక్క.. లెక్క తప్పింది..!

  • అప్పుడు ఉన్నాయన్నారు.. 
  • ఇప్పుడు కొంటామంటున్నారు..
  • సోషల్‌ ఫారెస్టులో మళ్లీ మొక్కల›కొనుగోళ్ల జాతర 
  • ఏకంగా 1.30 కోట్ల మొక్కలు కొనాలని నిర్ణయం 
  • అత్యవసరం పేరుతో షార్ట్‌టెండర్‌
  • గతేడాది కొనుగోళ్లలో రూ.కోట్లలో అక్రమాలు.. సస్పెన్షన్లు..
  • సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్‌ : 
    • ‘హరితహారం అమలుకు సిద్ధంగా ఉన్నాం.. నాటేందుకు నాలుగు కోట్ల మొక్కలు అందుబాటులో ఉంచాం. ఈసారి అటవీ శాఖ నర్సరీల్లో 1.45 కోట్ల మొక్కలు పెంచాం. సోషల్‌ ఫారెస్టు నర్సరీల్లో 1.10 కోట్ల మొక్కలు, డ్వామా నర్సరీల్లో కోటి మొక్కలు, ఐటీడీఏ నర్సరీల్లో 30 లక్షలు, సింగరేణి నర్సరీల్లో 15 లక్షల మొక్కలు పెంచాం. మొత్తం నాలుగు కోట్ల మొక్కలున్నాయి.. ఉద్యమంలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం..’ హరితహారం కార్యక్రమం ప్రారంభానికి (ఈనెల 8కి) ముందు ప్రజాప్రతినిధుల ప్రకటనలు, ఉన్నతాధికారుల నివేదికల సారాంశం ఇది.
    • ‘నర్సరీల్లో టేకు మొక్కలు ఇంకా పెరగలేదు. ఇంకా పండ్ల మొక్కలు కావాలని ప్రజలు అడుగుతున్నారు. ప్రస్తుతం ఈ మొక్కలు అందుబాటులో లేవు. అందుకే అత్యవసరంగా మొక్కలు కొనుగోలు చేయాలని నిర్ణయించాం.’ సోషల్‌ ఫారెస్టు విభాగం తాజా నిర్ణయమిది.
     
    హరితహారం మొక్కల కొనుగోళ్ల జాతరకు మళ్లీ తెరలేచింది. ఇన్నాళ్లు నాలుగు కోట్ల మొక్కలు సిద్ధంగా ఉన్నాయని ప్రకటించిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పుడు నర్సరీల్లో మొక్కలు ఇంకా పెరగలేవని, సుమారు 30 లక్షల పండ్ల మొక్కలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా జామ, మామిడి, సపోట, దానిమ్మ వంటి పండ్ల మొక్కలను కొనేందుకు సిద్ధమయ్యారు. ఈ 30 లక్షల్లో పది లక్షల అంట్ల మొక్కలు (గ్రాఫ్ట్‌ వెరైటీ) కొనాలని భావిస్తున్నారు. అత్యవసరం పేరుతో షార్ట్‌టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. గతేడాది మొక్కల కొనుగోళ్లలో భారీగా అక్రమాలు జరిగిన విషయం విధితమే.
     
    అసలు కొనుగోలు చేయకుండానే కొన్నట్లు.. వాటిని రహదారులకు ఇరువైపులా నాటినట్లు రికార్డులు సృష్టించారు. ప్రజాప్రతినిధులు, అటవీ శాఖలోని అధికారులు కాంట్రాక్టర్లుగా అవతారమెత్తి రూ.లక్షల్లో జేబులు నింపుకున్నారు. ఆ శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు చేపట్టిన  విచారణలో ఈ వ్యవహారం బట్టబయలు కావడంతో ఏకంగా డీఎఫ్‌వోతోపాటు, పలువురు రేంజ్‌ అధికారులపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ నేపథ్యంలో ఈసారి 30 లక్షల మొక్కలు కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. ఈ సారైనా కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగుతుందా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
     
    మరో కోటి టేకు వేర్లు కొనుగోళ్లు..
    పండ్ల మొక్కలే కాదు, టేకు వేర్లను కూడా కొనుగోలు చేయాలని అటవీ శాఖ నిర్ణయించింది. ఇప్పటివరకు టేకు మొక్కలను సరఫరా చేసిన అటవీ శాఖ ఇప్పుడు రైతులకు టేకు వేర్లనే సరఫరా చేయాలని భావిస్తోంది. దీంతో ఇకపై రైతులు టేకు మొక్కలకు బదులు టేకు వేర్లను నాటుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు కోటి టేకు వేర్లను కొనుగోలు చేసేందుకు షార్ట్‌టెండర్లు పిలవాలని నిర్ణయించారు. అయితే సమయం లేదనే కారణంగా ఇతర పక్క జిల్లాల్లో సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లకే సరఫరా కాంట్రాక్టు అప్పగించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.
     
    1.63 కోట్లు నాటి రాష్ట్రంలోనే ప్ర«థమస్థానం..
    హరితహారం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గానికి 40 లక్షల చొప్పున జిల్లా వ్యాప్తంగా నాలుగు కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఈ నెల 8న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో సోమవారం వరకు 1.63 కోట్ల మొక్కలు నాటినట్లు అటవీ శాఖ రికార్డుల్లో పేర్కొంటోంది. ఈ లెక్కన నాలుగు కోట్ల మొక్కల్లో నాటిన 1.63 కోట్ల మొక్కలు పోగా, ఇంకా సుమారు 2.37 కోట్ల మొక్కలుండాలి. కానీ.. అటవీ శాఖ తాజాగా 1.30 కోట్ల మొక్కలను కొనుగోలు చేయాలనే నిర్ణయానికి రావడం గమనార్హం. దీంతో మొక్కల లెక్కల్లో గందరగోళం నెలకొంది.]
     
    ప్రజలు అడుగుతున్నారనే కొంటున్నాం.. 
    పండ్ల మొక్కలు కావాలని ప్రజలు కోరుతున్నారు.. టేకు మొక్కలు కావాలని రైతులు అడుగుతున్నారు. పెంచిన మొక్కలన్నీంటిని సరఫరా చేశాం. ఇంకా కావాలని డిమాండ్‌ ఉంది. 30 లక్షల పండ్ల మొక్కలు కావాలని మండలాల నుంచి ఇండెంట్లు అందాయి. అందుకే కొనుగోలు చేయాలని నిర్ణయించాం. ఈ మేరకు కొనుగోళ్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టాం.
    – శ్రీనివాస్‌రావు, సోషల్‌ ఫారెస్టు డీఎఫ్‌వో 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement