tree plants
-
Akanksha Gupta: మొక్కవోని ఆకాంక్ష
ఈ రోజుల్లో ఇంట్లో కూర్చోనే షాపింగ్ చేసి లక్షలు ఖరీదు చేసే వస్తువులను సైతం క్షణాల్లో కొనేస్తున్నారు. వంట చేయడం కుదరనప్పుడో, తినడానికి ఏమీ లేనప్పుడో, బయటకు వెళ్లే ఓపిక లేనప్పుడో వెంటనే ఫుడ్ ఆర్డర్ పెట్టేస్తున్నారు. ఆర్డర్ ఇచ్చిన అరగంటలోపు వేడివేడి ఆహారం ఇంటి గుమ్మం ముందుకు వచ్చేస్తుంది. ఈ డెలివరీ యాప్‌లను ఆధారంగా చేసుకుని మొక్కల వ్యాపారం ప్రారంభించింది ఆకాంక్ష గుప్తా. ఫుడ్ డెలివరీ అయినట్టుగానే మొక్కలు, విత్తనాలు, ఎరువులను ఆర్డర్ ఇచ్చిన గంటల వ్యవధిలో కస్టమర్లకు అందిస్తోంది. కంపెనీ ప్రారంభించిన రెండేళ్లలో కోట్ల టర్నోవర్‌తో నడుస్తోంది. మొక్కలను ఎలా డెలివరీ చేస్తోందో ఆకాంక్ష మాటల్లోనే..... ఢిల్లీలోని మోడల్ టౌన్లో నివసించే సాంప్రదాయ ఉమ్మడి కుటుంబం మాది. నాన్న వ్యాపారి. అమ్మ ఇంటిపనులు చూసుకునేది. శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో బీకామ్ హానర్స్ పూర్తయ్యాక...ఉద్యోగం చేస్తాను అని ఇంట్లో వాళ్లకు చెప్పాను. అందరూ ఆశ్చర్యపోయారు. అమ్మాయిలు ఇంట్లో ఉండి పనులు చూసుకుంటుంటే, అబ్బాయిలు బయటకు వెళ్లి పనిచేసి సంపాదించడం పద్ధతి అనేది వాళ్ల నమ్మకం. దీంతో వాళ్లను ఒప్పించడానికి చాలా సమయం పట్టింది. నేను ఉద్యోగం ఎందుకు చేయాలనుకుంటున్నానో అన్నివిధాలుగా వివరించాను. అందుకు వాళ్లు సమ్మతించి ప్రోత్సహించారు. దీంతో ఈఎక్స్ఎల్ కంపెనీలో ఉద్యోగంలో చేరాను. ఇక్కడ రెండేళ్లు పనిచేశాక, 2016లో అహ్మదాబాద్ ఐఐఎమ్‌లో ఎమ్బీఏ పూర్తిచేశాను. తర్వాత ‘డెలాయిట్’ మేనేజ్మెంట్ కన్సల్టెంట్‌గా చేరాను. ► లాక్డౌన్ మార్చేసింది... డెలాయిట్‌లో పనిచేస్తున్నప్పుడు... తెలిసిన వాళ్ల అబ్బాయి సంభవ్ జైన్ పరిచయమయ్యాడు. సంభవ్ కూడా ఎమ్ఎన్సీలో పనిచేస్తుండడం, ఇరుకుటుంబాలకు నచ్చడంతో 2019లో మా పెళ్లి జరిగింది. పెళ్లి అయిన కొన్నినెలలకే లాక్డౌన్ విధించారు. ఇంట్లో ఉండి పనిచేస్తున్నప్పటికీ వారాంతపు సెలవుల్లో చాలా సమయం దొరికేది. మొక్కలు పెంచడం అంటే ఎంతో ఆసక్తి చూపే సంభవ్ సమయం మొత్తం గార్డెనింగ్‌కు కేటాయించేవాడు. సంభవ్ నిర్వహించే వర్క్‌షాపుల్లో ‘‘మొక్కలు ఎలా పెంచాలి? మొక్కలు బాగా పెరిగేందుకు సలహాలు సూచనలు’’ సంభవ్తో కలిసి నేను చెప్పేదాన్ని. ఆరేడు నెలల్లోను మేము నిర్వహించిన వర్క్‌షాపులకు మూడువేల మందికి పైగా హాజరై గార్డెనింగ్ గురించి తెలుసుకున్నారు. ఇలా లాక్డౌన్లో మా జీవితాలు గార్డెనింగ్ వైపు మళ్లాయి. ఈ మార్పే మమ్మల్ని వ్యాపార వేత్తలుగా మార్చింది. ► సమస్యల నుంచి... వర్క్‌షాపుల్లో చాలా మంది.. మొక్కలు పెంచాలని ఉంది కానీ, మంచి మొక్కలు, కుండీలు, ఎక్కడ కొనాలో తెలియడం లేదు. ఆన్లైన్లో కూడా మంచి స్టోర్లు ఏవీ లేవు. అరకొర ఆన్లైన్ స్టోర్లు కస్టమర్లకు నచ్చడం లేదు’’ అని చెప్పారు. దీంతో 2020లో సంభవ్ ఉద్యోగం వదిలేసి ‘ది బన్యన్ కంపెనీ’ పెట్టాడు. తనకి నేను సాయంగా ఉన్నాను. ఒక దగ్గర నర్సరీ పెంచుతూ అక్కడ నుంచి కస్టమర్లకు ఆర్డర్లు ఇవ్వడానికి రవాణా ఖర్చు ఎక్కువ అవడంతోపాటు, కొన్నిసార్లు రవాణాలో మొక్కలు పాడైపోయేవి. దీంతో మా కంపెనీ బాగా నష్టపోయింది. ► ఫుడ్ లా మొక్కలు కూడా... కంపెనీ అనేక నష్టాలను చూశాక ఎలా కంపెనీని నిర్వహించాలని తీవ్రంగా ఆలోచించాను. అప్పుడే నాకు ఫుడ్ డెలివరీ యాప్స్ గుర్తుకొచ్చాయి. ఫుడ్‌ను డెలివరీ చేసే యాప్స్‌లా మొక్కలను ఎందుకు డెలివరీ చేయకూడదు... అనిపించింది. దీనివల్ల సమయం, ఖర్చు రెండూ ఆదా అవుతాయి అనుకుని వెంటనే 2021లో ‘ఉర్వాన్.కామ్’ కంపెనీని ప్రారంభించాను. అర్బన్, ఫారెస్ట్ ల నుంచి పదాలను తీసుకుని ఉర్వాన్ పేరు పెట్టాను. ఈ కంపెనీ ప్రారంభించిన వెంటనే ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశాను. కుటుంబ సభ్యులంతా షాక్ అయ్యారు. ‘‘ఉద్యోగం వదిలేసి సంభవ్ చేసిన వ్యాపారంలో నష్టం వచ్చింది. మళ్లీ ఆకాంక్ష కూడా అదే పనిచేస్తోంది. ఈ వ్యాపారం కూడా నష్టపోదని గ్యారెంటీ ఏంటీ? సంభవ్ నువ్వు అయినా ఉద్యోగం చెయ్యి’’ అందరు సలహాలు ఇచ్చారు. కొంతమంది అయితే ఈ వ్యాపారం ఎప్పటికీ విజయవంతం కాదన్నారు. కానీ నేను, సంభవ్ ఏమాత్రం వెనక్కు తగ్గకుండా ముందుకు సాగాం. చివరకు ఒక బిజినేస్ అడ్వైజర్ దగ్గరకు వెళ్లి సలహా అడిగితే... ‘‘ఇది అంత మంచి వ్యాపారం కాదు. దీనివల్ల ఆదాయం ఏమీ రాదు. మీ ఇద్దరూ ఉద్యోగాలు చేసుకోవడం మంచిది’’ అని సలహా ఇచ్చారు. వెబ్సైట్ క్రియేట్ చేసిన తరువాత నర్సరీ నిర్వాహకులను కలిసి వెబ్సైట్లో యాడ్ చేశాము. కొంతమందికి కనీసం వాట్సాప్ మెస్సేజ్‌లు కూడా పంపడం రాదు. ఆన్లైన్లో మొక్కలు విక్రయించిన అనుభవం ఎవరికీ లేదు. దీంతో అందరికి దీనిలో శిక్షణ ఇచ్చాము. ప్రారంభంలో పెద్దగా ఆదాయం ఏమీ రాలేదు. కానీ రెండు వారాల తరువాత మేము పెట్టిన పెట్టుబడికి తగిన ఆదాయం రావడం మొదలైంది. కస్టమర్లు పెరగడంతో..స్నేహితులు, బంధువులు మా కంపెనీలో పెట్టుబడి పెట్టడం మొదలు పెట్టారు. ఆర్డర్ ఇచ్చిన మరుసటిరోజుకల్లా దగ్గర్లోని నర్సరీల నుంచి కస్టమర్లకు మొక్కలు డెలివరీ ఇస్తున్నాం. దీనికి అదనపు ప్యాకింగ్ చార్జీలు లేకపోవడం, బయటి రేటుకే ఆన్లైన్లో దొరుకుతుండడంతో ఎక్కువమంది మా దగ్గర కొనడం ప్రారంభించారు. తొలినాళ్లల్లో నెలకు ఐదువందల మొక్కలు విక్రయించడం కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు నెలకు మూడులక్షలకు పైగా మొక్కలను డెలివరీ ఇస్తున్నాము. ఇద్దరితో ప్రారంభమైన మా వ్యాపారం నేడు పాతిక మందికి చేరింది. మూడు నర్సరీల నుంచి నలభై నర్సరీలు అయ్యాయి. ఢిల్లీ, ఎన్సీఆర్లోనేగా బెంగళూరులోనూ మా మొక్కలు డెలివరీ ఇస్తున్నాము. వచ్చే సంవత్సరం వందకోట్ల టర్నోవర్ లక్ష్యంగా పనిచేస్తున్నాము. ‘‘కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు ఎవరికీ నచ్చకపోవచ్చు. కానీ ఆ నిర్ణయం మీద, మన మీద మనకు నమ్మకం ఉంటే ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొని విజయం సాధించవచ్చు’’ అని ఆకాంక్ష గుప్తా నిరూపించి చూపిస్తోంది. -
బొండాంతో భలే ఐడియా!
కొబ్బరిబొండాం.. ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ తాగి పడేసే బొండాంలో నీరు చేరి దోమలు పెరుగుతున్నాయి. మొక్కల పెంపకం.. పర్యావరణానికి ఎంతో మేలు. కానీ వాటిని పెంచడానికి ఉపయోగిస్తున్న ప్లాస్టిక్ సంచులతో అన్నీ సమస్యలే. ఈ రెండు సమస్యలకూ ఒకే ఒక్క చిన్న ఐడియాతో చెక్ పెట్టేశారు. తాగి పడేసిన కొబ్బరిబొండాల్లో మొక్కల పెంపకం ద్వారా సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఇదంతాఎక్కడో కాదు..మన తెలంగాణలోనే! దుగ్గొండి: సాధారణంగా ప్లాస్టిక్ సంచుల్లో మట్టి నింపి, అందులో విత్తనాలు వేసి మొక్కలు పెంచుతారు. ఇందుకోసం 250 నుంచి 300 గేజ్ ఉన్న ప్లాస్టిక్ సంచులను ఉపయోగిస్తారు. మొక్క పెరిగిన తర్వాత దానిని భూమిలో నాటినప్పుడు ఆ ప్లాస్టిక్ కవర్ తీసి పారేస్తారు. అది భూమిలో కలసిపోదు. ఒకవేళ దానిని కాల్చివేస్తే, అప్పుడు వచ్చే పొగ వల్ల కేన్సర్‌తోపాటు అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధానికి భారీగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇక తాగి పడేసే కొబ్బరిబొండాలతోనూ సమస్యలు తలెత్తుతున్నాయి. బొండాం తాగిన తర్వాత దానిని అలాగే పడేస్తుండటంతో వాటిలోకి నీరు చేరి దోమలు పెరుగుతున్నాయి. ఫలితంగా జ్వరాలు విజృంభిస్తున్నాయి. వాస్తవానికి ముదిరిన కొబ్బరిబొండాల తొక్కల నుంచి కోకోఫిట్, తాళ్లు తయారు చేస్తారు. అయితే, లేత కొబ్బరిబొండాలు అందుకు పనికిరావు. దీంతో వాటిని అలాగే పడేస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పరిష్కారమేంటి? తాగి పడేసే కొబ్బరిబొండాల్లో మట్టి నింపి అందులో మొక్కలు పెంచడం ద్వారా అటు ప్లాస్టిక్ వినియోగానికి అడ్డుకట్ట వేయడంతోపాటు ఇటు కొబ్బరిబొండాల ద్వారా తలెత్తుతున్న సమస్యల నుంచీ తప్పించుకోవచ్చు. పైగా మొక్కను బొండాంతో సహా భూమిలో నాటుకోవచ్చు. తద్వారా బొండాం భూమిలో కలిసిపోతుంది. ఎవరిదీ ఆలోచన? వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండల ఎంపీడీఓ గుంటి పల్లవికి ఈ వినూత్నమైన ఆలోచన వచ్చింది. ఓ వైపు ప్లాస్టిక్ భూతం.. మరోవైపు వాడి పడేసే బొండాలతో ఎదురవుతున్న సమస్యలు చూసిన ఆమె మొక్కల పెంపకానికి బొండాలను వినియోగించాలనే తలంపు వచ్చింది. దీనిని రాష్ట్రంలో తొలిసారిగా ప్రయోగాత్మకంగా అమలు చేయాలని భావించారు. కేరళలో కొబ్బరిబొండాల్లో మొక్కల పెంపకంపై అధ్యయనం చేసిన తర్వాత శుక్రవారం మండలంలోని నాచినపల్లి గ్రామ నర్సరీలో ఇందుకు శ్రీకారం చుట్టారు. వెయ్యి కొబ్బరి బొండాల్లో మట్టి నింపి చింత గింజలను నాటారు. తొగర్రాయి, గిర్నిబావి, శివాజినగర్, తిమ్మంపేట, దుగ్గొండి గ్రామ నర్సరీల్లో ఇలా దాదాపు 5వేల కొబ్బరిబొండాల్లో మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఇందుకు వరంగల్, హన్మకొండ పట్టణాల్లో వాడిపడేసిన బొండాలను సేకరించారు. ఎంతో పర్యవరణ హితం వాడిపడేసిన కొబ్బరి బొండాల్లో మొక్కలు పెంచడం పర్యావరణ హితంగా ఉంటాయి. కేరళలో బొండాల్లో మొక్కలు పెంచుతున్న విధానాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాను. ఆ పద్ధతిలో మొక్కలు నాటి గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించాలనుకుంటున్నాం. కొబ్బరి బొండాల్లో పెరిగిన మొక్కను బొండాంతో సహా అలాగే భూమిలో పాతిపెట్టొచ్చు. ఆ బొండాం రెండు, మూడు నెలల్లోనే భూమిలో కరిగిపోతుంది. పైగా మొక్కకు ఎరువుగానూ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ విధానం ప్లాస్టిక్ నివారణకు కొంత మేరకు దోహదపడుతుంది. – గుంటి పల్లవి, ఎంపీడీవో ఎంపీడీఓ గుంటి పల్లవి -
‘ఇలాంటి చర్యలకు పాల్పడటం సిగ్గు చేటు’
-
‘ఇలాంటి చర్యలకు పాల్పడటం సిగ్గు చేటు’
న్యూఢిల్లీ : ఓ వ్యక్తి చేసిన నిర్వాకం నెటజన్లను తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తోంది. అసలు ఎందుకిలా చేశాడంటూ అనేక మంది అతనిపై మండిపడుతున్నారు. ఇంతకీ విషయం ఏంటీ అనుకుంటున్నారా? ఢిల్లీలోని రోడ్లపై ఏర్పాటు చేసిన వర్టికల్ గార్డెన్లో మొక్కల పెంచే కుండీలపై ఓ వ్యక్తి కన్నుపడింది. అవి అతనికి అందంగా కనిపించాయో? లేక అమ్ముకుందామనుకున్నాడో తెలియదు కానీ.. ఆ కుండీల్లోని మొక్కలను అక్కడే పడేసి ఒకటి కాదు రెండు కాదు అనేక కుండీలను దొంగలించి.. ఓ సంచిలో వేసుకొని ఎత్తుకెళ్లాడు. అతడి చేష్టలను ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఇది గమనించిన సదరు దుండగుడు అక్కడి నుంచి పరుగు లంకించుకున్నాడు. ‘ఆల్వేజ్ దిల్ సే’ అనే ఫేస్బుక్ పేజీ పోస్టు చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. మొక్కలను నాశనం చేసి మరీ.. ప్లాస్టిక్ కుండీలను అతను ఎందుకు ఎత్తుకెళ్లాడో అర్థం కావడం లేదని ఈ వీడియోను పోస్టు చేసిన యూజర్ కామెంట్ చేశారు. దీనిని వీక్షించిన నెటిజన్లు మొక్కలను పెంచే కుండీలను దొంగిలించిన దుండగుడిపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలాంటి వ్యక్తులను అడ్డుకోలేనంత వరకు ఏ ప్రభుత్వాలను విమర్శించలేమని కామెంట్ చేస్తున్నారు. ‘ఇందుకే ఇండియా ఎప్పటికీ అభివృద్ధి చెందడం లేదు. ఇలాంటి చర్యలు సిగ్గుచేటు.. వీరిపై అధికారులు చర్యలు తీసుకోవాలి’ అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అయితే అతన్ని పట్టుకొని స్థానిక అధికారులకు అప్పజెప్పానని, కానీ ప్రస్తుతానికి అతన్ని వదిలేయమని చెప్పానని ఫేస్బుక్ యూజర్ వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా, పచ్చదనాన్ని పెంపొందించే ఉద్ధేశంతో ప్రభుత్వాలు రహదారుల మధ్యలో వర్టికల్ గార్డెన్లను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. -
మెుదటి స్థానం మనదే..!
కోటి 80లక్షల మొక్కలు నాటాం మొక్కల రక్షణకు వెదురు బొంగులతో కంచె మంత్రి జోగు రామన్న ఆదిలాబాద్ : ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు మానస పుత్రిక తెలంగాణకు హరితహారం పథకంలో భాగంగా మొక్కలు నాటడంలో రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా మొదటి స్థానంలో ఉందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. ఇప్పటివరకు కోటి 80 లక్షల మొక్కలు నాటినట్లు తెలిపారు. గురువారం కలెక్టరేట్ నుంచి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధుల సమష్టి కషితో లక్ష్యంలో ముందున్నట్లు చెప్పారు. మొక్కల సంరక్షణ కోసం వెదురు బొంగులతో నిర్మించిన గార్డ్(కంచె)లను నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో చూశానని, మన జిల్లాలో ఏర్పాటుకు శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. క్షీణించిన అటవీ ప్రాంతాల్లో అటవీశాఖ మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుందని, దీనికి అదనంగా డీఎఫ్ఓల పరిధిలో 500 హెక్టార్ల భూమిని గుర్తించి వాటిలో మొక్కలు నాటాలని మంత్రి ఆదేశించారు. అటవీ శాఖ లక్ష్యం జిల్లాలో 33లక్షల మొక్కలు కాగా, ఇప్పటివరకు పూర్తి కాలేదని, జిల్లా కంటే నిజామాబాద్ జిల్లా ముందుందని పేర్కొన్నారు. మిగిలిన రెండు మూడు రోజుల్లో అటవీ శాఖాధికారులు లక్ష్యం సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. టేకు మొక్కలను నాటే విధంగా చూడాలన్నారు. ఆసిఫాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్ మాట్లాడుతూ నాటిన మొక్కల రక్షణ, వాటికి నీరు పోయడానికి అయ్యే ఖర్చు నివేదికలను ఎంపీడీఓలు శనివారం పంపించాలని సూచించారు. శుక్రవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమానికి పది లక్షల మొక్కలు నిర్మల్‌కు సరఫరా చేస్తామని పేర్కొన్నారు. అక్కడి నుంచి అన్ని గ్రామాలకు రవాణా చేసేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ జేడీని ఆదేశించారు. అటవీ శాఖ కన్జర్వేటర్ తిమ్మారెడ్డి, జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, డీపీవో పోచయ్య, సామాజిక అటవీ శాఖ డీఎఫ్‌వో శ్రీనివాస్, డీఎఫ్‌వో మోహన్ పాల్గొన్నారు. -
సెల్ఫీ విత్ మెుక్క
-
మెుక్క.. లెక్క తప్పింది..!
అప్పుడు ఉన్నాయన్నారు.. ఇప్పుడు కొంటామంటున్నారు.. సోషల్ ఫారెస్టులో మళ్లీ మొక్కల›కొనుగోళ్ల జాతర ఏకంగా 1.30 కోట్ల మొక్కలు కొనాలని నిర్ణయం అత్యవసరం పేరుతో షార్ట్‌టెండర్ గతేడాది కొనుగోళ్లలో రూ.కోట్లలో అక్రమాలు.. సస్పెన్షన్లు.. సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ‘హరితహారం అమలుకు సిద్ధంగా ఉన్నాం.. నాటేందుకు నాలుగు కోట్ల మొక్కలు అందుబాటులో ఉంచాం. ఈసారి అటవీ శాఖ నర్సరీల్లో 1.45 కోట్ల మొక్కలు పెంచాం. సోషల్ ఫారెస్టు నర్సరీల్లో 1.10 కోట్ల మొక్కలు, డ్వామా నర్సరీల్లో కోటి మొక్కలు, ఐటీడీఏ నర్సరీల్లో 30 లక్షలు, సింగరేణి నర్సరీల్లో 15 లక్షల మొక్కలు పెంచాం. మొత్తం నాలుగు కోట్ల మొక్కలున్నాయి.. ఉద్యమంలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం..’ హరితహారం కార్యక్రమం ప్రారంభానికి (ఈనెల 8కి) ముందు ప్రజాప్రతినిధుల ప్రకటనలు, ఉన్నతాధికారుల నివేదికల సారాంశం ఇది. ‘నర్సరీల్లో టేకు మొక్కలు ఇంకా పెరగలేదు. ఇంకా పండ్ల మొక్కలు కావాలని ప్రజలు అడుగుతున్నారు. ప్రస్తుతం ఈ మొక్కలు అందుబాటులో లేవు. అందుకే అత్యవసరంగా మొక్కలు కొనుగోలు చేయాలని నిర్ణయించాం.’ సోషల్ ఫారెస్టు విభాగం తాజా నిర్ణయమిది. హరితహారం మొక్కల కొనుగోళ్ల జాతరకు మళ్లీ తెరలేచింది. ఇన్నాళ్లు నాలుగు కోట్ల మొక్కలు సిద్ధంగా ఉన్నాయని ప్రకటించిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పుడు నర్సరీల్లో మొక్కలు ఇంకా పెరగలేవని, సుమారు 30 లక్షల పండ్ల మొక్కలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా జామ, మామిడి, సపోట, దానిమ్మ వంటి పండ్ల మొక్కలను కొనేందుకు సిద్ధమయ్యారు. ఈ 30 లక్షల్లో పది లక్షల అంట్ల మొక్కలు (గ్రాఫ్ట్ వెరైటీ) కొనాలని భావిస్తున్నారు. అత్యవసరం పేరుతో షార్ట్‌టెండర్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. గతేడాది మొక్కల కొనుగోళ్లలో భారీగా అక్రమాలు జరిగిన విషయం విధితమే. అసలు కొనుగోలు చేయకుండానే కొన్నట్లు.. వాటిని రహదారులకు ఇరువైపులా నాటినట్లు రికార్డులు సృష్టించారు. ప్రజాప్రతినిధులు, అటవీ శాఖలోని అధికారులు కాంట్రాక్టర్లుగా అవతారమెత్తి రూ.లక్షల్లో జేబులు నింపుకున్నారు. ఆ శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు చేపట్టిన విచారణలో ఈ వ్యవహారం బట్టబయలు కావడంతో ఏకంగా డీఎఫ్‌వోతోపాటు, పలువురు రేంజ్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ నేపథ్యంలో ఈసారి 30 లక్షల మొక్కలు కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. ఈ సారైనా కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగుతుందా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో కోటి టేకు వేర్లు కొనుగోళ్లు.. పండ్ల మొక్కలే కాదు, టేకు వేర్లను కూడా కొనుగోలు చేయాలని అటవీ శాఖ నిర్ణయించింది. ఇప్పటివరకు టేకు మొక్కలను సరఫరా చేసిన అటవీ శాఖ ఇప్పుడు రైతులకు టేకు వేర్లనే సరఫరా చేయాలని భావిస్తోంది. దీంతో ఇకపై రైతులు టేకు మొక్కలకు బదులు టేకు వేర్లను నాటుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు కోటి టేకు వేర్లను కొనుగోలు చేసేందుకు షార్ట్టెండర్లు పిలవాలని నిర్ణయించారు. అయితే సమయం లేదనే కారణంగా ఇతర పక్క జిల్లాల్లో సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లకే సరఫరా కాంట్రాక్టు అప్పగించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. 1.63 కోట్లు నాటి రాష్ట్రంలోనే ప్ర«థమస్థానం.. హరితహారం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గానికి 40 లక్షల చొప్పున జిల్లా వ్యాప్తంగా నాలుగు కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఈ నెల 8న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో సోమవారం వరకు 1.63 కోట్ల మొక్కలు నాటినట్లు అటవీ శాఖ రికార్డుల్లో పేర్కొంటోంది. ఈ లెక్కన నాలుగు కోట్ల మొక్కల్లో నాటిన 1.63 కోట్ల మొక్కలు పోగా, ఇంకా సుమారు 2.37 కోట్ల మొక్కలుండాలి. కానీ.. అటవీ శాఖ తాజాగా 1.30 కోట్ల మొక్కలను కొనుగోలు చేయాలనే నిర్ణయానికి రావడం గమనార్హం. దీంతో మొక్కల లెక్కల్లో గందరగోళం నెలకొంది.] ప్రజలు అడుగుతున్నారనే కొంటున్నాం.. పండ్ల మొక్కలు కావాలని ప్రజలు కోరుతున్నారు.. టేకు మొక్కలు కావాలని రైతులు అడుగుతున్నారు. పెంచిన మొక్కలన్నీంటిని సరఫరా చేశాం. ఇంకా కావాలని డిమాండ్ ఉంది. 30 లక్షల పండ్ల మొక్కలు కావాలని మండలాల నుంచి ఇండెంట్లు అందాయి. అందుకే కొనుగోలు చేయాలని నిర్ణయించాం. ఈ మేరకు కొనుగోళ్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టాం. – శ్రీనివాస్‌రావు, సోషల్ ఫారెస్టు డీఎఫ్‌వో