ఈ రోజుల్లో ఇంట్లో కూర్చోనే షాపింగ్ చేసి లక్షలు ఖరీదు చేసే వస్తువులను సైతం క్షణాల్లో కొనేస్తున్నారు. వంట చేయడం కుదరనప్పుడో, తినడానికి ఏమీ లేనప్పుడో, బయటకు వెళ్లే ఓపిక లేనప్పుడో వెంటనే ఫుడ్ ఆర్డర్ పెట్టేస్తున్నారు. ఆర్డర్ ఇచ్చిన అరగంటలోపు వేడివేడి ఆహారం ఇంటి గుమ్మం ముందుకు వచ్చేస్తుంది.
ఈ డెలివరీ యాప్‌లను ఆధారంగా చేసుకుని మొక్కల వ్యాపారం ప్రారంభించింది ఆకాంక్ష గుప్తా. ఫుడ్ డెలివరీ అయినట్టుగానే మొక్కలు, విత్తనాలు, ఎరువులను ఆర్డర్ ఇచ్చిన గంటల వ్యవధిలో కస్టమర్లకు అందిస్తోంది. కంపెనీ ప్రారంభించిన రెండేళ్లలో కోట్ల టర్నోవర్‌తో నడుస్తోంది. మొక్కలను ఎలా డెలివరీ చేస్తోందో ఆకాంక్ష మాటల్లోనే.....
ఢిల్లీలోని మోడల్ టౌన్‌లో నివసించే సాంప్రదాయ ఉమ్మడి కుటుంబం మాది. నాన్న వ్యాపారి. అమ్మ ఇంటిపనులు చూసుకునేది. శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో బీకామ్ హానర్స్ పూర్తయ్యాక...ఉద్యోగం చేస్తాను అని ఇంట్లో వాళ్లకు చెప్పాను. అందరూ ఆశ్చర్యపోయారు. అమ్మాయిలు ఇంట్లో ఉండి పనులు చూసుకుంటుంటే, అబ్బాయిలు బయటకు వెళ్లి పనిచేసి సంపాదించడం పద్ధతి అనేది వాళ్ల నమ్మకం.
దీంతో వాళ్లను ఒప్పించడానికి చాలా సమయం పట్టింది. నేను ఉద్యోగం ఎందుకు చేయాలనుకుంటున్నానో అన్నివిధాలుగా వివరించాను. అందుకు వాళ్లు సమ్మతించి ప్రోత్సహించారు. దీంతో ఈఎక్స్‌ఎల్ కంపెనీలో ఉద్యోగంలో చేరాను. ఇక్కడ రెండేళ్లు పనిచేశాక, 2016లో అహ్మదాబాద్ ఐఐఎమ్‌లో ఎమ్‌బీఏ పూర్తిచేశాను. తర్వాత ‘డెలాయిట్’ మేనేజ్‌మెంట్ కన్సల్‌టెంట్‌గా చేరాను.
► లాక్‌డౌన్ మార్చేసింది...
డెలాయిట్‌లో పనిచేస్తున్నప్పుడు... తెలిసిన వాళ్ల అబ్బాయి సంభవ్ జైన్ పరిచయమయ్యాడు. సంభవ్ కూడా ఎమ్‌ఎన్‌సీలో పనిచేస్తుండడం, ఇరుకుటుంబాలకు నచ్చడంతో 2019లో మా పెళ్లి జరిగింది. పెళ్లి అయిన కొన్నినెలలకే లాక్‌డౌన్ విధించారు. ఇంట్లో ఉండి పనిచేస్తున్నప్పటికీ వారాంతపు సెలవుల్లో చాలా సమయం దొరికేది. మొక్కలు పెంచడం అంటే ఎంతో ఆసక్తి చూపే సంభవ్ సమయం మొత్తం గార్డెనింగ్‌కు కేటాయించేవాడు.
సంభవ్ నిర్వహించే వర్క్‌షాపుల్లో ‘‘మొక్కలు ఎలా పెంచాలి? మొక్కలు బాగా పెరిగేందుకు సలహాలు సూచనలు’’ సంభవ్‌తో కలిసి నేను చెప్పేదాన్ని. ఆరేడు నెలల్లోను మేము నిర్వహించిన వర్క్‌షాపులకు మూడువేల మందికి పైగా హాజరై గార్డెనింగ్ గురించి తెలుసుకున్నారు. ఇలా లాక్‌డౌన్‌లో మా జీవితాలు గార్డెనింగ్ వైపు మళ్లాయి. ఈ మార్పే మమ్మల్ని వ్యాపార వేత్తలుగా మార్చింది.
► సమస్యల నుంచి...
వర్క్‌షాపుల్లో చాలా మంది.. మొక్కలు పెంచాలని ఉంది కానీ, మంచి మొక్కలు, కుండీలు, ఎక్కడ కొనాలో తెలియడం లేదు. ఆన్‌లైన్‌లో కూడా మంచి స్టోర్లు ఏవీ లేవు. అరకొర ఆన్‌లైన్ స్టోర్లు కస్టమర్లకు నచ్చడం లేదు’’ అని చెప్పారు. దీంతో 2020లో సంభవ్ ఉద్యోగం వదిలేసి ‘ది బన్యన్ కంపెనీ’ పెట్టాడు. తనకి నేను సాయంగా ఉన్నాను. ఒక దగ్గర నర్సరీ పెంచుతూ అక్కడ నుంచి కస్టమర్లకు ఆర్డర్లు ఇవ్వడానికి రవాణా ఖర్చు ఎక్కువ అవడంతోపాటు, కొన్నిసార్లు రవాణాలో మొక్కలు పాడైపోయేవి. దీంతో మా కంపెనీ బాగా నష్టపోయింది.
► ఫుడ్ లా మొక్కలు కూడా...
కంపెనీ అనేక నష్టాలను చూశాక ఎలా కంపెనీని నిర్వహించాలని తీవ్రంగా ఆలోచించాను. అప్పుడే నాకు ఫుడ్ డెలివరీ యాప్స్ గుర్తుకొచ్చాయి. ఫుడ్‌ను డెలివరీ చేసే యాప్స్‌లా మొక్కలను ఎందుకు డెలివరీ చేయకూడదు... అనిపించింది. దీనివల్ల సమయం, ఖర్చు రెండూ ఆదా అవుతాయి అనుకుని వెంటనే 2021లో ‘ఉర్వాన్.కామ్’ కంపెనీని ప్రారంభించాను. అర్బన్, ఫారెస్ట్ ల నుంచి పదాలను తీసుకుని ఉర్వాన్ పేరు పెట్టాను. ఈ కంపెనీ ప్రారంభించిన వెంటనే ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశాను. కుటుంబ సభ్యులంతా షాక్ అయ్యారు.
‘‘ఉద్యోగం వదిలేసి సంభవ్ చేసిన వ్యాపారంలో నష్టం వచ్చింది. మళ్లీ ఆకాంక్ష కూడా అదే పనిచేస్తోంది. ఈ వ్యాపారం కూడా నష్టపోదని గ్యారెంటీ ఏంటీ? సంభవ్ నువ్వు అయినా ఉద్యోగం చెయ్యి’’ అందరు సలహాలు ఇచ్చారు. కొంతమంది అయితే ఈ వ్యాపారం ఎప్పటికీ విజయవంతం కాదన్నారు. కానీ నేను, సంభవ్ ఏమాత్రం వెనక్కు తగ్గకుండా ముందుకు సాగాం. చివరకు ఒక బిజినేస్ అడ్వైజర్ దగ్గరకు వెళ్లి సలహా అడిగితే... ‘‘ఇది అంత మంచి వ్యాపారం కాదు. దీనివల్ల ఆదాయం ఏమీ రాదు. మీ ఇద్దరూ ఉద్యోగాలు చేసుకోవడం మంచిది’’ అని సలహా ఇచ్చారు.
వెబ్‌సైట్ క్రియేట్ చేసిన తరువాత నర్సరీ నిర్వాహకులను కలిసి వెబ్‌సైట్‌లో యాడ్ చేశాము. కొంతమందికి కనీసం వాట్సాప్ మెస్సేజ్‌లు కూడా పంపడం రాదు. ఆన్‌లైన్‌లో మొక్కలు విక్రయించిన అనుభవం ఎవరికీ లేదు. దీంతో అందరికి దీనిలో శిక్షణ ఇచ్చాము. ప్రారంభంలో పెద్దగా ఆదాయం ఏమీ రాలేదు. కానీ రెండు వారాల తరువాత మేము పెట్టిన పెట్టుబడికి తగిన ఆదాయం రావడం మొదలైంది. కస్టమర్లు పెరగడంతో..స్నేహితులు, బంధువులు మా కంపెనీలో పెట్టుబడి పెట్టడం మొదలు పెట్టారు. ఆర్డర్ ఇచ్చిన మరుసటిరోజుకల్లా దగ్గర్లోని నర్సరీల నుంచి కస్టమర్లకు మొక్కలు డెలివరీ ఇస్తున్నాం.
దీనికి అదనపు ప్యాకింగ్ చార్జీలు లేకపోవడం, బయటి రేటుకే ఆన్‌లైన్‌లో దొరుకుతుండడంతో ఎక్కువమంది మా దగ్గర కొనడం ప్రారంభించారు. తొలినాళ్లల్లో నెలకు ఐదువందల మొక్కలు విక్రయించడం కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు నెలకు మూడులక్షలకు పైగా మొక్కలను డెలివరీ ఇస్తున్నాము. ఇద్దరితో ప్రారంభమైన మా వ్యాపారం నేడు పాతిక మందికి చేరింది. మూడు నర్సరీల నుంచి నలభై నర్సరీలు అయ్యాయి. ఢిల్లీ, ఎన్‌సీఆర్‌లోనేగా బెంగళూరులోనూ మా మొక్కలు డెలివరీ ఇస్తున్నాము. వచ్చే సంవత్సరం వందకోట్ల టర్నోవర్ లక్ష్యంగా పనిచేస్తున్నాము.
‘‘కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు ఎవరికీ నచ్చకపోవచ్చు. కానీ ఆ నిర్ణయం మీద, మన మీద మనకు నమ్మకం ఉంటే ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొని విజయం సాధించవచ్చు’’ అని ఆకాంక్ష గుప్తా నిరూపించి చూపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment