న్యూఢిల్లీ : ఓ వ్యక్తి చేసిన నిర్వాకం నెటజన్లను తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తోంది. అసలు ఎందుకిలా చేశాడంటూ అనేక మంది అతనిపై మండిపడుతున్నారు. ఇంతకీ విషయం ఏంటీ అనుకుంటున్నారా? ఢిల్లీలోని రోడ్లపై ఏర్పాటు చేసిన వర్టికల్ గార్డెన్‌లో మొక్కల పెంచే కుండీలపై ఓ వ్యక్తి కన్నుపడింది. అవి అతనికి అందంగా కనిపించాయో? లేక అమ్ముకుందామనుకున్నాడో తెలియదు కానీ.. ఆ కుండీల్లోని మొక్కలను అక్కడే పడేసి ఒకటి కాదు రెండు కాదు అనేక కుండీలను దొంగలించి.. ఓ సంచిలో వేసుకొని ఎత్తుకెళ్లాడు. అతడి చేష్టలను ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఇది గమనించిన సదరు దుండగుడు అక్కడి నుంచి పరుగు లంకించుకున్నాడు. ‘ఆల్వేజ్ దిల్ సే’ అనే ఫేస్‌బుక్ పేజీ పోస్టు చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
మొక్కలను నాశనం చేసి మరీ.. ప్లాస్టిక్ కుండీలను అతను ఎందుకు ఎత్తుకెళ్లాడో అర్థం కావడం లేదని ఈ వీడియోను పోస్టు చేసిన యూజర్ కామెంట్ చేశారు. దీనిని వీక్షించిన నెటిజన్లు మొక్కలను పెంచే కుండీలను దొంగిలించిన దుండగుడిపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలాంటి వ్యక్తులను అడ్డుకోలేనంత వరకు ఏ ప్రభుత్వాలను విమర్శించలేమని కామెంట్ చేస్తున్నారు. ‘ఇందుకే ఇండియా ఎప్పటికీ అభివృద్ధి చెందడం లేదు. ఇలాంటి చర్యలు సిగ్గుచేటు.. వీరిపై అధికారులు చర్యలు తీసుకోవాలి’ అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అయితే అతన్ని పట్టుకొని స్థానిక అధికారులకు అప్పజెప్పానని, కానీ ప్రస్తుతానికి అతన్ని వదిలేయమని చెప్పానని ఫేస్‌బుక్ యూజర్ వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా, పచ్చదనాన్ని పెంపొందించే ఉద్ధేశంతో ప్రభుత్వాలు రహదారుల మధ్యలో వర్టికల్ గార్డెన్‌లను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment