మెుదటి స్థానం మనదే..!
-
కోటి 80లక్షల మొక్కలు నాటాం
-
మొక్కల రక్షణకు వెదురు బొంగులతో కంచె
-
మంత్రి జోగు రామన్న
ఆదిలాబాద్ : ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు మానస పుత్రిక తెలంగాణకు హరితహారం పథకంలో భాగంగా మొక్కలు నాటడంలో రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా మొదటి స్థానంలో ఉందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. ఇప్పటివరకు కోటి 80 లక్షల మొక్కలు నాటినట్లు తెలిపారు. గురువారం కలెక్టరేట్ నుంచి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధుల సమష్టి కషితో లక్ష్యంలో ముందున్నట్లు చెప్పారు.
మొక్కల సంరక్షణ కోసం వెదురు బొంగులతో నిర్మించిన గార్డ్(కంచె)లను నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో చూశానని, మన జిల్లాలో ఏర్పాటుకు శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. క్షీణించిన అటవీ ప్రాంతాల్లో అటవీశాఖ మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుందని, దీనికి అదనంగా డీఎఫ్‌ఓల పరిధిలో 500 హెక్టార్ల భూమిని గుర్తించి వాటిలో మొక్కలు నాటాలని మంత్రి ఆదేశించారు. అటవీ శాఖ లక్ష్యం జిల్లాలో 33లక్షల మొక్కలు కాగా, ఇప్పటివరకు పూర్తి కాలేదని, జిల్లా కంటే నిజామాబాద్ జిల్లా ముందుందని పేర్కొన్నారు. మిగిలిన రెండు మూడు రోజుల్లో అటవీ శాఖాధికారులు లక్ష్యం సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. టేకు మొక్కలను నాటే విధంగా చూడాలన్నారు.
ఆసిఫాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎం.జగన్‌మోహన్ మాట్లాడుతూ నాటిన మొక్కల రక్షణ, వాటికి నీరు పోయడానికి అయ్యే ఖర్చు నివేదికలను ఎంపీడీఓలు శనివారం పంపించాలని సూచించారు. శుక్రవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమానికి పది లక్షల మొక్కలు నిర్మల్‌కు సరఫరా చేస్తామని పేర్కొన్నారు. అక్కడి నుంచి అన్ని గ్రామాలకు రవాణా చేసేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ జేడీని ఆదేశించారు. అటవీ శాఖ కన్జర్వేటర్ తిమ్మారెడ్డి, జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, డీపీవో పోచయ్య, సామాజిక అటవీ శాఖ డీఎఫ్‌వో శ్రీనివాస్, డీఎఫ్‌వో మోహన్ పాల్గొన్నారు.