గ్రీన్‌హౌస్‌కు ప్రత్యామ్నాయంగా ‘షేడ్‌నెట్’
సాక్షి, హైదరాబాద్: గ్రీన్‌హౌస్‌తోపాటు షేడ్‌నెట్‌ను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ ఉద్యాన శాఖ నిర్ణయించింది. భారీ పెట్టుబడితో కూడిన గ్రీన్‌హౌస్‌ను ధనిక రైతులే ఉపయోగించుకుంటున్నందున.. అందుకు ప్రత్యామ్నాయంగా చిన్న సన్నకారు రైతులకు అందుబాటులో ఉండేలా షేడ్‌నెట్‌ను తీసుకురావాలని యోచిస్తోంది. ఈ మేరకు ఉద్యాన శాఖ కసరత్తు మొదలుపెట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి షేడ్‌నెట్‌ను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది.
రైతుకు భారంగా గ్రీన్‌హౌస్
గ్రీన్‌హౌస్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. అందుకోసం ఈ ఏడాది 847 ఎకరాలకు రూ.250 కోట్లు కేటాయించింది. గ్రీన్‌హౌస్ కోసం ముందుకు వచ్చే రైతులకు దాని నిర్మాణ వ్యయంలో 75 శాతం సబ్సిడీని ఇస్తోంది. ఆ ప్రకారం ఎకరా విస్తీర్ణంలో గ్రీన్‌హౌస్ నిర్మాణం చేపట్టాలంటే రూ. 39.50 లక్షలు ఖర్చవుతోంది. ఇందులో 75 శాతం సబ్సిడీ ఇస్తున్నా ఎకరాకు సుమారు రూ. 10 లక్షలు ఖర్చు చేయడం రైతుకు భారంగా మారుతోంది. దీంతో గ్రీన్‌హౌస్‌కు అనుకున్నంత స్థాయిలో రైతుల నుంచి స్పందన రావడంలేదు. ఈ ఏడాది ఇప్పటివరకు 30 ఎకరాల్లోపే గ్రీన్‌హౌస్ నిర్మాణం జరిగింది. ఎస్సీ, ఎస్టీలు ఎవరూ గ్రీన్‌హౌస్‌కు దరఖాస్తు చేయలేదని అధికారులు చెబుతున్నారు. దీంతో మార్గదర్శకాల్లో మార్పులు చేశారు. రైతులకే నేరుగా సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు. అయినా గ్రీన్‌హౌస్‌కు భారీగా పెట్టుబడి పెట్టాల్సి రావడంతో సన్న చిన్నకారు రైతులు, ఎస్సీ, ఎస్టీలు దానివైపే చూడడంలేదు. ఈ పరిస్థితిని గమనించిన ఉద్యాన శాఖ షేడ్‌నెట్ నిర్మాణం వైపు అడుగులు వేస్తోంది.
చిన్నసన్నకారు రైతుల కోసమే షేడ్‌నెట్..
గ్రీన్‌హౌస్ నిర్మాణానికి ఎకరాకు రూ. 39.50 లక్షలైతే, షేడ్‌నెట్‌కు రూ. 12 లక్షల వరకు మాత్రమే ఖర్చవుతోంది. గ్రీన్‌హౌస్‌లో వేసే పంటలకు అవసరమైన ఉష్ణోగ్రతలను పూర్తిస్థాయిలో నియంత్రించుకునే వీలుంటుంది. వర్షం పడినా గ్రీన్ హౌస్‌లో పంటలపై పడదు. షేడ్‌నెట్ కేవలం ఒక పందిరిలాంటిది అనుకోవచ్చు. నాలుగు పక్కలా ఆగ్రో నెట్(ఆకుపచ్చ రంగులో కనిపించే వలలు) లేదా ఇతర విధంగా నేయబడిన వలతో కప్పివేయబడి ఉంటుంది. మొక్కలకు అవసరమైన సూర్యరశ్మి, గాలి, తేమ ఆ వలలోని సందుల గుండా ప్రసరించేలా అనువైన వాతావరణం ఉంటుంది. షేడ్‌నెట్‌లో ఎండ, గాలి, వడగండ్ల నుంచి మాత్రమే రక్షించుకోవచ్చు. వర్షం వస్తే మాత్రం పంటలపై బోరున పడుతుంది. అందువల్ల రబీలోనే షేడ్‌నెట్ వల్ల ప్రయోజనం ఉంటుందని, వర్షాకాలంలో దీనివల్ల అంతగా ప్రయోజనం ఉండదని ఉద్యాన శాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి చెబుతున్నారు.
గ్రీన్‌హౌస్ ద్వారా పూల సాగు చేస్తే రైతుకు లాభదాయకంగా ఉంటుందని, షేడ్‌నెట్ ద్వారా రబీలో కూరగాయల సాగు చేయవచ్చని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో షేడ్‌నెట్‌ను వచ్చే ఏడాది నుంచి భారీగా ప్రోత్సహించాలని ఉద్యాన శాఖ భావిస్తోంది. ఎకరాకు రూ. 12 లక్షలు ఖర్చు అవుతున్నందున గ్రీన్‌హౌస్‌కు ఇచ్చినట్లే దీనికి కూడా 75 శాతం సబ్సిడీ ఇవ్వాలని.. ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం సబ్సిడీ ఇవ్వాలని యోచిస్తున్నారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో 5 వేల ఎకరాల్లో షేడ్‌నెట్ సాగు చేపట్టాలని ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం గ్రీన్‌హౌస్ నిర్మాణానికి ముందుకొచ్చిన కంపెనీలతోనే షేడ్‌నెట్ నిర్మాణాలు చేపట్టేలా చూడాలని భావిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. త్వరలో మార్గదర్శకాలు తయారుచేసి షేడ్‌నెట్‌పై విరివిగా ప్రచారం చేయాలని యోచిస్తున్నారు.