నారు పోస్తుంది.. నీరూ పోస్తుంది!
విత్తు మొదలు నారు పెంపు వరకు యాంత్రీకరణ పద్ధతిలోనే..
♦ రూ.11 కోట్ల కూరగాయల నారుమడికి శ్రీకారం
♦ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్సీ కింద ములుగులో ఏర్పాటుకు సర్కారు సన్నాహాలు
♦ 7న ప్రారంభించనున్న సీఎం
సాక్షి, హైదరాబాద్: తోటల పెంపకానికి నారే అత్యంత కీలకం. నారు ఎంత ఆరోగ్యంగా ఉంటుందో దాని నుంచి వచ్చే పంట అంతే స్థాయిలో అధిక దిగుబడినిస్తుంది. సహజంగా నారు మడులను రైతులు వ్యవసాయ క్షేత్రాల్లో తయారు చేస్తారు. కొన్నిచోట్ల నర్సరీల్లోనూ తయారు చేస్తారు. అలా తయారైన నారును తీసేటప్పుడు కొన్ని మొక్కల వేర్లు తెగిపోతుంటాయి. ఫలితంగా అందులో కొన్ని చనిపోతాయి. చీడపీడలు ఆశించి మరికొన్ని చనిపోతాయి. మరోవైపు దిగుబడి కూడా తక్కువగా ఉంటుంది. కూరగాయల సాగులో ఈ పరిస్థితి రైతుకు నష్టదాయకంగా మారుతోంది. ఈ పరిస్థితిని అధిగమించాలని తెలంగాణ ఉద్యానశాఖ, ఆగ్రోస్ నిర్ణయించాయి.
చంటి బిడ్డను కాపాడుకున్నట్లుగా నారును పెంచేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని నిర్ణయించాయి. ఫ్లగ్ టైప్ నర్సరీని నెలకొల్పి రైతుకు నారును సబ్సిడీపై అందజేయాలని సర్కారు నిర్ణయించింది. కోళ్ల ఫారాల్లో కోడిగుడ్లను ట్రేలల్లో పెట్టి సరఫరా చేసినట్లుగానే నారును కూడా అలాగే పెంచి రైతులకు సరఫరా చేయనున్నారు.
రూ.11 కోట్లతో ఫ్లగ్ టైప్ నర్సరీ
ఫ్లగ్ టైప్ నర్సరీలో ఆటోమేషన్ యూనిట్, గ్రీన్‌హౌస్, ప్రైమరీ హార్డినింగ్ చాంబర్ తదితరాలుంటాయి. అంతా వ్యవసాయ సంబంధిత యంత్ర పరికరాలే అందులో ఉంటాయి. ఆటోమేషిన్ యూనిట్‌లో విత్తనానికి సంబంధించిన ప్రక్రియ, వాటికి ఎంతెంత నీరు, ఎరువు, ఉష్ణోగ్రత ఉండాలో నిర్దారణ జరుగుతుంది. ఆ తర్వాత వాటిని ఆటోమేటిక్‌గా గ్రీన్‌హౌస్‌లోని సీడ్ జర్మినేషన్ చాంబర్‌కు పంపిస్తారు. అక్కడ నారుకు ఉష్ణోగ్రత, నీరు, తేమ ఎంత మోతాదులో ఉండాలనే వాటిని కంప్యూటర్ ద్వారానే నియంత్రిస్తారు. ఎరువు, నీరు కూడా కంప్యూటర్ ఆదేశాల మేరకు నిర్ణీత పరిమాణంలో విత్తనానికి చేరుతాయి.
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆపరేట్ చేయడానికి, శాస్త్రవేత్తల పర్యవేక్షణ కోసం తప్ప ఇతరత్రా కూలీలు, మనుషులతో పనిలేనేలేదు. నారు తయారయ్యాక కన్వేయర్ బెల్టు ద్వారా నారు ట్రేలల్లో బయటకు వస్తుంది. ఇదీ ఫ్లగ్ టైప్ నర్సరీకి సంబంధించిన ప్రాథమిక అంశాలు. ఈ ఫ్లగ్ టైప్ నర్సరీలో కూరగాయల నారును పెంచుతారు. ఒక్క నారు మొక్క కూడా చనిపోదు. దే నికీ చీడపీడలు రావు. అలా తయారైన నారు మొక్కలను రైతులకు ఇస్తే అవి పెరిగి పెద్దవై 30 శాతం అదనపు దిగబడులు ఇస్తాయి. ప్రస్తుతం ఫ్లగ్ టైప్ నర్సరీలు రాయపూర్, కేరళల్లోనే ఉన్నాయి. రాష్ట్రంలో మొదటిసారిగా మెదక్ జిల్లా ములుగులో ఏర్పాటు చేయనున్నారు.
అక్కడ ఈ నెల 7వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేయనున్న సంగతి తెలిసిందే. ఆ ప్రాంగణంలోనే సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్సీ కింద ఫ్లగ్ టైప్ నర్సరీ నిర్మాణానికి సీఎం శ్రీకారం చుడతారు. రూ.11 కోట్లు ఖర్చు చేసి 50 ఎకరాల్లో ఈ నర్సరీని ఏర్పాటు చేస్తారు. వీటిల్లో బీర, సోర, కాకర, దోస, టమాటా, వంకాయ సహా వివిధ రకాల కూర గాయల నారును పెంచుతారు. ఈ నర్సరీ సామర్థ్యం ఏడాదికి 80 లక్షల నారు మొక్కలను తయారు చేయగలదు. ఆ నారు 666 ఎకరాలకు సరిపోతుందని ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. ఇక్కడ తయారయ్యే కూరగాయల నారును రైతులకు సబ్సిడీపై ఇస్తామన్నారు.
పరిశ్రమగా అభివృద్ధి చేసే యోచన
గ్రీన్‌హౌస్‌కు సబ్సిడీ ఇచ్చినట్లుగానే ఫ్లగ్ టైప్ నర్సరీకి కూడా సబ్సిడీ ఇచ్చే ఆలోచనలో సర్కారు ఉన్నట్లు సమాచారం. దీన్ని సాధారణ రైతులు నెలకొల్పుకోవడం అసాధ్యం. అనవసరం కూడా. అయితే దీన్నో పరిశ్రమగా ప్రోత్సహిస్తే ఫ్లగ్ టైప్ నర్సరీల్లో తయారయ్యే నారు మొక్కలతో కూరగాయల ఉత్పత్తిని 30 శాతం వరకు పెంచుకోవచ్చు. ఔత్సాహికులుంటే వారిని ఫ్లగ్ టైప్ నర్సరీ వైపు ప్రోత్సహిస్తామని ఆగ్రోస్ ఎండీ ఎ.మురళి ‘సాక్షి’కి చెప్పారు.