గ్రీన్‌హౌస్ సబ్సిడీపై నీలినీడలు
- రూ. 244 కోట్ల సబ్సిడీ సొమ్ము రైతులకు చెల్లించని సర్కారు
- రెండేళ్లలో రూ. 303 కోట్ల సబ్సిడీలో రైతుకిచ్చింది రూ. 58 కోట్లే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రీన్‌హౌస్ రైతులు గగ్గోలు పెడుతున్నారు. గ్రీన్‌హౌస్ నిర్మాణాలకు అప్పులు చేసి లక్షల రూపాయలు చెల్లించిన రైతులు.. ఇప్పుడు ప్రభుత్వం నుంచి సబ్సిడీ సొమ్ము రాక లబోదిబోమంటున్నారు. గ్రీన్‌హౌస్ సాగు పద్ధతి ద్వారా ఎకరానికి రూ. 10 లక్షలు ఆపై వరకు లాభాలు ఆర్జించవచ్చని ప్రభుత్వం భారీ ప్రచారం చేయడంతో అనేకమంది అటు మొగ్గారు. ముందే తమ వాటాగా 25 శాతం పెట్టుబడులు పెట్టడం.. ఆ తర్వాత వివిధ దశల్లో రావాల్సిన సబ్సిడీ సొమ్ము ప్రభుత్వం నుంచి విడుదల కాకపోవడంతో అనేకచోట్ల గ్రీన్‌హౌస్ నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో కంపెనీలు కూడా మధ్యలోనే పనులు వదిలేసి పోయాయి. ఈ రెండేళ్లలో ప్రభుత్వం కేవలం 20 మంది రైతులకే పూర్తి స్థాయిలో సబ్సిడీ సొమ్ము విడుదల చేసింది. 90 మంది రైతులకు సగమే విడుదల చేశారు.
రైతులకు రూ. 244 కోట్లు బకాయి పడిన సర్కారు
రాష్ట్రంలో గ్రీన్‌హౌస్ ద్వారా పెద్ద ఎత్తున కూరగాయలు, పూల దిగుబడులను పెద్ద ఎత్తున పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రీన్‌హౌస్‌ను రైతుల్లోకి తీసుకెళ్లేందుకు భారీ సబ్సిడీని ప్రకటించింది. ఉదాహరణకు ఒక ఎకరంలో గ్రీన్‌హౌస్ నిర్మాణం చేపట్టడానికి రూ. 40 లక్షల వరకు ఖర్చు అయితే రైతు 25 శాతం వాటాగా రూ. 10 లక్షలు... ప్రభుత్వ సబ్సిడీ రూ. 30 లక్షలు కానుంది. ఎస్సీ, ఎస్టీలైతే 95 శాతం సబ్సిడీగా ప్రభుత్వం నుంచి రూ. 38 లక్షలు... తమ వాటాగా రూ. 2 లక్షలు చెల్లించాలి. అంటే ఒక్కో ఎకరానికి సాధారణ రైతులు తమ వాటాగా రూ. 10 లక్షలు కంపెనీలకు చెల్లించారు.
కానీ సబ్సిడీ సొమ్ము విడుదల చేయడంలో సర్కారు విఫలమైంది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌లో రూ. 250 కోట్లు కేటాయించారు. 495 మంది రైతులు గ్రీన్‌హౌస్ నిర్మాణాలు చేపట్టారు. కానీ విడుదలైంది కేవలం రూ. 58.50 కోట్లే. అంటే ఆ ఆర్థిక సంవత్సరంలో రూ. 191.20 కోట్లు ప్రభుత్వం బకాయి పడింది. 2016–17 సంవత్సరంలో గ్రీన్‌హౌస్ సబ్సిడీ కోసం బడ్జెట్లో రూ. 199.50 కోట్లు కేటాయించారు. 177 మంది రైతులు గ్రీన్‌హౌస్ నిర్మాణాలు చేపట్టారు. అందుకోసం రూ. 53.14 కోట్లు విడుదల చేయాలి. కానీ ఇప్పటివరకు ఒక్కపైసా విడుదల కాలేదు. ఇలా ఈ రెండు ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వం రైతులకు రూ. 244 కోట్లు బకాయి పడింది. దీంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు.