ప్రోత్సాహమేదీ? | no encaragement for mushroom cultivation | Sakshi
Sakshi News home page

ప్రోత్సాహమేదీ?

Published Sat, Jul 2 2016 8:10 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

ప్రోత్సాహమేదీ? - Sakshi

ప్రోత్సాహమేదీ?

పుట్టగొడుగుల పెంపకాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం
సబ్సిడీలు, ప్రోత్సాహం లేక ముందుకురాని యువత, రైతులు
శిక్షణకు హాజరయ్యేందుకు అనాసక్తి
ఇతర పథకాల్లాగే రాయితీలు వర్తింపజేయాలని డిమాండ్

 పుట్టగొడుగుల పేరు చెబితే భోజన ప్రియులు లొట్టలేస్తారు. శాఖాహారులు.. మాంసాహారులనే బేధం లేకుండా ఉభయులూ ఇష్టపడతారు. హృద్రోగులకు, మధుమేహ వ్యాధిగ్రస్తులకూ ఆరోగ్యకరమైన ఆహారం. మష్రూమ్స్ కర్రీకి హోటళ్లలోనూ మంచి డిమాండ్ ఉంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న పుట్టగొడుగుల పెంపకంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయూన్నిచ్చే వీటి పెంపకంపై నిరుద్యోగ యువత, రైతులు ఆసక్తి కనబర్చు తున్నప్పటికీ ప్రోత్సాహం లేక ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది.

ఒంగోలు టూటౌన్ :  జిల్లాలో ఉద్యానశాఖ ద్వారా పుట్టగొడుగుల పెంపకం పథకం 20 ఏళ్లుగా అమలవుతోంది. ఒంగోలులోని ఉద్యాన శాఖ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన పుట్టగొడుగుల కేంద్రంలో ప్రతి మంగళవారం శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ఈ శిక్షణకు ప్రకాశం జిల్లా నుంచే కాకుండా గుంటూరు, నెల్లూరు జిల్లాల నుంచి కూడా రైతులు వస్తుంటారు. శిక్షణకు ప్రతి రైతు రూ.100 చెల్లించాల్సి ఉండటంతో చాల మంది అనాసక్తి చూపిస్తున్నారు. ఒక్కో జిల్లా నుంచి ఇద్దరు ముగ్గురు మాత్రమే హాజరవుతున్నారు.

 కొత్తపట్నంలో విత్తన ఉత్పత్తి కేంద్రం..
జిల్లాలోని తీరప్రాంతమైన కొత్తపట్నంలోని ఉద్యాన నర్సరీలో పుట్టగొడుగుల విత్తనోత్పత్తి కేంద్రం ఏర్పాటు చేశారు. ఏటా 1000 కిలోలు మాత్రమే ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. అంతే స్థాయిలో ఏటా లక్ష్యంగా నిర్ణయించారు. ఉత్పత్తి చేసిన విత్తనాలను శిక్షణకు వచ్చిన రైతులకు మాత్రమే అమ్ముతారు. కిలో విత్తనాలు రూ.90 విక్రయిస్తారు. ఒక్కొక్క రైతుకు 20 కేజీలు మాత్రమే ఇస్తారు. విత్తనాల కొనుగోలు కూడా ఎలాటి రాయితీ లేకపోవడంతో శిక్షణకు వచ్చి రైతులు సైతం నిరుత్సాహనికి గురవుతున్నారు. పుట్టగొడుగుల పెంపకంతో ఏదైనా తేడా వస్తే.. రైతు ఆర్థికంగా మొత్తం నష్టపోవాల్సి వస్తోందని శిక్షణకు వచ్చిన పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 పెంపకానికి ఎక్కడ అనుకూలం..
తీరప్రాంతంతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాలు పుట్టగొడుగుల పెంపకానికి అనుకూలమే. చల్లగా ఉండే కొండప్రాంతాలు, మన రాష్ట్రంలో మైదాన ప్రాంతాల్లో శీతాకాలంలో పెంచుతుంటారు. వైట్ బటన్, అయిస్టర్ లేక థింగీ (ముత్యపు చుక్క), చైనీస్ (ఓల్వోరిల్లా స్పీషిస్), సబ్ స్ట్రాట్, ఇంక్యుబేషిన్ క్రాపింగ్ ఇలా  దాదాపు రెండు వేల రకాల పుట్టగొడుగులు ఉన్నాయి. వీటి పెంపకంలో సాంకేతిక నైపుణ్యం అవసరం. ఉష్ణోగ్రతలలో ఏదైన తేడా వస్తే పుట్టగొడుగుల బెడ్స్ మొత్తానికి వైరస్ సోకి పాడైపోయే ప్రమాదం ఉంది. దీంతో రైతు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది.

 బ్యాంకు రుణాలూ అందని ద్రాక్షే..
ఉద్యానశాఖ ద్వారా అమలు చేస్తున్న పలు పథకాలకు లక్షాలాది రూపాయలను సబ్సిడీలుగా అందిస్తున్న ప్రభుత్వం పుట్టగొడుగుల పెంపకాన్ని మాత్రం విస్మరించడం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు రుణాలు కూడా అందని ద్రాక్షే అవుతోంది. కొత్తగా పండ్లతోటలు సాగు చేసే రైతులకు 40 శాతం, బత్తాయి, నిమ్మతోటలకు రూ.23,160, మామిడికి రూ.19,460, దానిమ్మకు 29,500, టిష్యుకల్చర్ అరటి సాగుకు రూ.54,100, బొప్పాయి తోటలకు రూ.48,030 ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తోంది. రెండవ, మూడవ సంవత్సరంలో పండ్ల తోటల నిర్వహణకు 75 శాతం రాయితీ కల్పించడం జరుగుతుంది.

50 శాతం రాయితీపై పాత తోటల పునరుద్ధరణ పథకం కింద బత్తాయి, నిమ్మ, జామ, జీడి మామిడి తోటలకు హెక్టారుకు రూ.20,000 సాయం అందిస్తోంది. మామిడి, బత్తాయి మరియు నిమ్మతోటలలో కొమ్మ కత్తిరింపుల పథకం కింద 50 శాతం రాయితీలు మంజూ చేస్తోంది. ఇలా పలు పథకాలకు రాయితీలు అందిస్తూ పుట్టగొడుగుల పెంపకానికి మాత్రం మొండిచేయి చూపడంపై రైతు సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం స్పందించి పండ్ల తోటలకు మాదిరిగానే పుట్టగొడుగుల పెంపకానికి కూడా సబ్సిడీలు మంజూరు చేసి ప్రోత్సాహించాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement