mushroom cultivation
-
సాగుబడి: పాలేకర్ ఫుడ్ ఫారెస్ట్‌లో ఎకరానికి రూ. 6 లక్షల ఆదాయం!
"పాలేకర్ ఫుడ్ ఫారెస్ట్ ఐదు అంచెల పంటల సాగు నమూనాతో ఎకరానికి ఏటా రూ. 6 లక్షల ఆదాయం సమకూరుతుందని పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. సుభాష్ పాలేకర్ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. గుజరాత్లో ఫైవ్ లేయర్ ఫుడ్ ఫారెస్ట్లు తన టెక్నాలజీకి నిదర్శనంగా నిలిచాయని, తొలి ఏడాదే రూ. 2 లక్షలు, ఆరో ఏడాది నుంచి రూ. 6 లక్షల ఆదాయం సమకూరుతోందన్నారు. ఆసక్తిగల రైతులు గుజరాత్ వస్తే తానే స్వయంగా చూపిస్తానన్నారు." ఈ నెల 29,30,31 తేదీల్లో అహ్మదాబాద్‌కు 151 కి.మీ. దరంలోని పాలియాడ్ (బోటాడ్ జిల్లా)లోని శ్రీ విషమన్ బాపు ప్యాలెస్ మందిర్‌లో (ఆంగ్లం/ హిందీ) రైతు శిక్షణా శిబిరంలో పాల్గొనే వారికి ఈ ఫుడ్ ఫారెస్ట్‌లను స్వయంగా చూపిస్తానన్నారు. 3 రోజులకు ఫీజు రూ.700. ఇతర వివరాలకు.. ఘనశ్యాం భాయ్ వాల– 63550 77257, కశ్యప్ భాయ్‌చౌహాన్– 85303 13211. పుట్టగొడుగుల సాగుపై 26 రోజుల ఉచిత శిక్షణ.. ఇంటర్/డిప్లొమా దశలో చదువు మధ్యలో ఆపేసిన గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం, ‘ఆస్కి’ సంయుక్త ఆధ్వర్యంలో మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు పుట్టగొడుగుల పెంపకంపై పూర్తిస్థాయి శిక్షణా శిబిరం జరగనుంది. హైదరాబాద్ (రాజేంద్రనగర్‌లోని పిజెటిఎస్ఎయు ఆవరణ) లోని విస్తరణ విద్యా సంస్థలో జరిగే ఈ శిబిరంలో పాల్గొనే వారికి బోధనతో పాటు భోజన, వసతి కూడా పూర్తిగా ఉచితం. చిన్న స్థాయి పుట్టగొడుగుల రైతుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని అంశాలపై నైపుణ్య శిక్షణ ఇస్తారు. 16 ఏళ్లు పైబడిన గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులు అర్హులు. ఇంటర్ ఫస్టియర్ పాస్ లేదా టెన్త్ తర్వాత వ్యవసాయ/ అనుబంధ విభాగాల్లో 3 ఏళ్ల డిప్లొమా మొదటి ఏడాది పూర్తి చేసిన లేదా పదో తరగతి పాసైన తర్వాత కనీసం ఒక ఏడాది పుట్టగొడుగుల పెంపకంలో అనుభవం పొందిన వారు లేదా 8వ తరగతి పాసైన తర్వాత కనీసం 3 ఏళ్లుగా పుట్టగొడుగులు పెంపకం పని చేస్తున్న వారు.. ఈ ఉచిత శిక్షణకు అర్హులు. విద్యార్హత, కులధృవీకరణ, ఆధార్, ఫోటో తదితర వివరాలను పొందుపరుస్తూ ఆన్లైన్లో గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ఈ క్యూ.ఆర్. కోడ్‌ను స్కాన్ చేయండి. ఇతర వివరాలకు.. 040– 2405368, 98666 18107. eeihyd1962@gmail.com 22 నుంచి దేశీ వరి సాగు, నీటి సంరక్షణపై ‘సేవ్’ శిక్షణ.. విశాఖపట్నం కృష్ణాపురంలోని సింహాచలం దేవస్థానం గోశాల (న్యూ)లో ఈ నెల 22 నుంచి 26 వరకు దేశీ వరి సాగుదారులు, దేశీ వరి బియ్యాన్ని సేకరించి ఆలయాల్లో నైవేద్యాల కోసం అందించే దాతలతో రైతుల ముఖాముఖి పరిచయ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకృతి వ్యవసాయ సాధకులు, ‘సేవ్’ సంస్థ నిర్వాహకులు విజయరామ్ తెలిపారు. పాలేకర్ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో దేశీ వరి రకాల సాగు, ఉద్యాన పంటల 5 లేయర్ సాగు, వాననీటి సంరక్షణకు ఇంకుడు గుంతల తవ్వకంపై రైతులకు శిక్షణ ఇస్తామన్నారు. పెళ్లిళ్లలో ఔషధ గుణాలు గల సంప్రదాయ వంటకాలు వడ్డించే ఆసక్తి గల వారికి ఆ వంటకాలను కూడా ఈ శిబిరంలో పరిచయం చేస్తామన్నారు. ‘శబలా భోజన పండుగ’ పేరిట నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలన్నీ ఐదు రోజులూ జరుగుతాయని, ఆసక్తిగల వారు ఏదో ఒక రోజు హాజరైతే చాలని విజయరామ్ తెలిపారు. వివరాలకు.. సేవ్ కార్యాలయం 63091 11427, సురేంద్ర 99491 90769. 29 నుంచి సేవాగ్రామ్‌లో జాతీయ విత్తనోత్సవం! వాతావరణ మార్పుల్ని తట్టుకునే శక్తి దేశీ వంగడాలకే ఉందనే నినాదంతో ఈ నెల 29 నుంచి 31 వరకు మహారాష్ట్ర వార్థా జిల్లా సేవాగ్రామ్‌లోని నాయ్ తాలిమ్ సమితి పరిసర్లో వార్షిక జాతీయ విత్తనోత్సవం జరగనుంది. దేశం నలుమూలల నుంచి అనేక పంటల దేశీ వంగడాల ప్రదర్శన, అమ్మకంతో పాటు సేంద్రియ రైతుల సదస్సులు, క్షేత్ర సందర్శనలు, నిపుణులతో ముఖాముఖి వంటి కార్యక్రమాలను నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. రుసుము రూ. వెయ్యి. వివరాలకు.. యుగంధర ఖోడె – 91302 17662, ప్రతాప్ మరొడె – 75888 46544. ఇవి చదవండి: సాగుబడి: ఈ సరికొత్త ప్రయోగంతో.. కరువును తట్టుకున్న పంటలు! -
పుట్టగొడుగులతో పుట్టెడు లాభాలు తెలుసా?!
సాక్షి, అమరావతి: చిల్లీ చికెన్, పెప్పర్ చికెన్, పత్తర్ కా ఘోష్, మటన్ టిక్కా, అపోలో ఫిష్.. ఇలాంటి ప్రత్యేక వంటకాల సరసన ఇప్పుడు మష్రూమ్‌లు (పుట్టగొడుగులు) కూడా చేరిపోయాయి. ఇప్పుడు ఏ రెస్టారెంట్‌కి వెళ్లినా స్పెషల్ మెనూలో పుట్టగొడుగులతో చేసిన వంటకాలు ఉండటం చూడొచ్చు. ఇంకో అడుగు ముందుకేసిన చిరు వ్యాపారులు తాజాగా పుట్టగొడుగులతో పచ్చళ్లు పెట్టి అమ్మడం మొదలు పెట్టారు. అందువల్లే పుట్టగొడుగుల పెంపకం ఇప్పుడు మంచి లాభాలు తెచ్చిపెట్టే కుటీర పరిశ్రమల జాబితాలో చేరింది. ఆహార నిపుణులు కూడా వీటి వాడకాన్ని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో పుట్టగొడుగుల లాభసాటి సాగుపై కథనం. 4 రకాల సాగు.. ప్రపంచ వ్యాప్తంగా పుట్టగొడుగులు 4 వేల రకాల వరకు ఉన్నా 200 రకాలను మాత్రమే తినగలిగినవిగా గుర్తించారు. అయితే వీటిలో సాగు చేస్తున్నవి మాత్రం 3, 4 రకాలే. అవి.. తెల్లగుండి పుట్టగొడుగులు, ముత్యపు చిప్ప పుట్టగొడుగులు, పాల పుట్టగొడుగులు, వరిగడ్డి పుట్టగొడుగులు. వీటి పెంపకానికి వాతావరణంలో తేమని, ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించాల్సి ఉంటుంది. 85–90 శాతం తేమ, 16–18 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, కంపోస్టు ఎరువు అవసరం. జూన్ నుంచి ఫిబ్రవరి వరకు వీటి పెంపకానికి అనువైన కాలం. వ్యవసాయ వ్యర్థ పదార్ధాలైన గడ్డి, చొప్ప ఇతర పదార్థాలతో పెంచవచ్చు. పుట్టగొడుగుల సాగును కుటీర పరిశ్రమగా చేపట్టవచ్చు. 35 నుంచి 40 రోజుల్లో పంట దిగుబడి వస్తుంది. పెద్దగా పెట్టుబడి లేని వ్యాపారం కనుక నిరుద్యోగ యువత స్వయం ఉపాధిగా వీటి సాగును చేపట్టవచ్చు. విత్తనమే కీలకం.. పుట్టగొడుగులు పెంచడానికి కావల్సిన విత్తనాలను స్పాన్ అంటారు. స్పాన్ (విత్తన) తయారీ మూడు దశల్లో జరుగుతుంది. మొదటగా జొన్నల నుంచి కల్చరును తయారు చేస్తారు. దాన్ని పరిశుభ్రమైన జొన్నలతో చేర్చితే మైసీలియం తయారవుతుంది. ఈ మైసీలియం వ్యాపించిన జొన్నలను స్పాన్ అంటారు. స్పాన్ స్వచ్ఛత మీదే పంట దిగుబడి ఆధారపడి ఉంటుంది. పుట్టగొడుగుల పెంపకంలో విత్తనం తర్వాత కీలకమైన అంశం శుభ్రత. చీడపీడలను గుర్తించి సకాలంలో చర్యలు తీసుకోవడం, పెంపకానికి ఉపయోగించే బెడ్లను క్రిమికీటకాలు సోకకుండా కాపాడుకోవటం ప్రధానం. ఒకసారి పుట్టగొడుగులను కోసిన తర్వాత 24 గంటలకు మించి నిల్వ ఉండవు. నిల్వ ఉంచాలనుకుంటే తగిన విధంగా శుద్ధి చేసి ఎండబెట్టి ప్యాకింగ్ చేసుకోవాలి. కృషి విజ్ఞాన కేంద్రాల్లో శిక్షణ బాపట్ల వ్యవసాయ కళాశాలలోను, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీకి చెందిన కృషి విజ్ఞాన కేంద్రాలలోనూ పుట్టగొడుగుల విత్తన తయారీపై శిక్షణ ఇస్తున్నారు. పెంపకం కేంద్రాలను పెట్టుకునేందుకు చాలా మంది ఈ శిక్షణ తరగతులకు హాజరవుతున్నారు. యూనివర్సిటీ 8 వారాల సర్టిఫికెట్ కోర్సును కూడా అందజేస్తోంది. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ శాస్త్రవేత్త టి.గోపీకృష్ణను 9989625239 నెంబరులో సంప్రదించవచ్చు. శాఖాహారమా? మాంసాహారమా? పుట్టగొడుగులు నిస్సందేహంగా శాఖాహారమేనని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్లాంట్ పాంథాలజిస్ట్ ప్రొఫెసర్ టి.గోపీకృష్ణ చెబుతున్నారు. శిలీంద్ర జాతికి చెందిన ఈ చిన్న మొక్కల్లో బహుళ పోషకాలున్నాయి. పౌష్టికాహార లోపంతో బాధ పడే మహిళలు, పిల్లలకు ఇవి చాలా మంచి ఆహారం. మాంసకృత్తులు, బి, సి విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు పదార్ధాలు ఎక్కువ. ప్రతి వంద గ్రాముల పుట్టగొడుగుల్లో 43 కిలో కేలరీల శక్తి లభిస్తుంది. వీటిలో పిల్లల పెరుగుదలకు కావాల్సిన లైసిన్, ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లాలు ఉన్నాయి. ఆహారంగా తీసుకునే పుట్టగొడుగుల్లో 89 నుంచి 91 శాతం మధ్య నీరు, 0.97 నుంచి 1.26 శాతం వరకు లవణాలు, 4 శాతం వరకు మాంసకృత్తులు, 5.3 నుంచి 6.28 శాతం వరకు పిండి పదార్ధాలు ఉంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. పోషకాహారంగా వీటిని న్యూట్రిషియన్లు సిఫార్సు చేస్తున్నారు. చికెన్, రొయ్యల పచ్చళ్ల మాదిరే పుట్టగొడుగులతో ప్రస్తుతం పచ్చళ్లు తయారు చేస్తున్నారు. చాలా ఫంక్షన్లలో ఫ్రెడ్‌రైస్, పులావ్, వేపుళ్లు, పకోడీలు, సమోసా, బోండా, కట్లేట్, బజ్జీ, కుర్మా తదితర వంటకాలకు పుట్టగొడుగులను ఉపయోగిస్తున్నారు. -
కాలక్షేపంలో కాసుల పుట్ట
ఇంటిపనులతో ఎప్పుడూ బిజీగా ఉండే గృహిణులు కాస్త సమయం దొరికితే... నచ్చిన వ్యాపకాలతో కాలక్షేపం చేస్తుంటారు. షిజే వర్గీస్ అలాగే తనకు నచ్చిన çపుట్టగొడుగుల సాగును చేపట్టి ఖాళీసమయాన్ని కాసుల పంటగా మార్చి, నెలకు లక్షరూపాయలకు పైగా ఆర్జిçస్తున్నారు. మరోపక్క తనలాంటి వారెందరికో పుట్టగొడుగు ల పెంపకం గురించి క్లాసులు నిర్వహిస్తున్నారు. ఇది గుర్తించిన కేరళ ప్రభుత్వం ‘బెస్ట్ మష్రుమ్ ఫార్మర్’ అవార్డుతో సత్కరించింది. కేరళలోని అలప్పుఱ జిల్లా ఎరమళ్లూ్లర్కు చెందిన షిజే వర్గీస్ ఇంటిపనులు, పిల్లల బాగోగులు చూసుకుంటూ బిజీగా ఉండేవారు. పిల్లలు ఎదిగి తమ పనులు తాము చేసుకుంటుండడంతో షిజేకు కాస్త తీరిక దొరికింది. అప్పుడే అనుకోకుండా షిజే ఇంటికి దగ్గర్లో ‘‘పుట్టగొడుగుల పెంపకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిçస్తున్నాం. మీరు పాల్గొనండి’’ అని వ్యవసాయ అధికారి షిజేను ఆహ్వానించారు. అక్కడ పుట్టగొడుగుల పెంపకం గురించి తెలుసుకుంది. అది నచ్చడంతో ఇంట్లోనే పుట్టగొడుగుల సాగును ప్రారంభించింది. రెండు ప్యాకెట్లు, ఆరు బెడ్లు.. 2007లో రెండు ప్యాకెట్ల విత్తనాలు, ఆరు బెడ్లతో పుట్టగొడుగుల పెంపకాన్ని ప్రారంభించింది. కానీ పుట్టగొడుగులు పెద్దగా పెరగలేదు. అయితే షిజే భర్త ఆమెను ప్రోత్సహించడంతో ఈ సారి 300 బెడ్లతో పెంపకాన్ని చేపట్టింది. ఈ క్రమంలో కేరళలో పుట్టగొడుగులు సాగుచేస్తోన్న అనేక ప్రాంతాలను సందర్శించి దానిలో మరిన్ని మెలకువలు నేర్చుకుని వాటిని తన సొంత క్షేత్రం లో అమలు చేయడంతో విజయం సాధించింది. కూన్ ఫ్రెష్.. షిజే పుట్టగొడుగుల పెంపకం ప్రారంభించిన రెండేళ్లల్లో పోషకాలతో కూడిన ‘ఆయిస్టర్, మిల్కీ పుట్టగొడుగులను’ సాగు చేసి వాటిని ‘కూన్ఫ్రెష్’పేరిట విక్రయించేవారు. మలయాళంలో కూన్ అంటే పుట్టగొడుగులు అని అర్థం. కూన్ఫ్రెష్ మష్రుమ్స్ రుచికరంగా ఉండడంతో ఎక్కువమంది కొనుగోలు చేసేవారు. కూన్ఫ్రెష్కు మంచి డిమాండ్ పెరగడంతో ఉత్పత్తిని పెంచారు. ప్రస్తుతం రెండు వేల బెడ్లు రోజుకు ఎనిమిది నుంచి పది కేజీల వరకు పంటను ఉత్పత్తి చేస్తున్నారు. వీటికి మంచి ధర పలకడం తో నెలకు లక్ష రూపాయలకు పైగా ఆదాయం వస్తోంది. ఈ విషయం వ్యవసాయ శాఖాధికారులకు తెలియడంతో వారు ఆమె ఇంటికి వచ్చి పుట్టగొడుగుల సాగును పరిశీలించి, మరింత మందికి ఆమెతో క్లాసులు చెప్పించేవారు. దీంతో షిజే వారికి టీచర్‌గా మారి పుట్టగొడుగుల పెంపకం గురించి బోధించడం ఆరంభించారు. సొంతంగా విత్తనాల తయారీ.. తొలినాళ్లల్లో వేరే రైతుల వద్ద విత్తనాలు, క్రిమిసంహారాలు గురించి తెలుసుకుని వాడేవారు. షిజేకు పుట్టగొడుగుల సాగుపై అనుభవం పెరిగేటప్పటికీ స్వయంగా విత్తనాలు తయారు చేసుకుంటున్నారు. ప్రారంభంలో కోచ్చిలోని సూపర్ మార్కెట్లలో పుట్టగొడుగులను విక్రయించేవారు. తరువాత ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. గత ఎనిమిదేళ్లుగా కేరళ వ్యాప్తంగా పుట్టగొడుగుల సాగుపై షిజే వీక్లీ క్లాసులు నిర్వహిస్తున్నారు. గతేడాది కరోనా లాక్‌డౌన్‌తో ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తూ కొత్తగా వచ్చేవారికి సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఈ మొత్తం పనిలో షిజేకి భర్తతోపాటు కొడుకు, కూతురు సాయం చేస్తున్నారు. ఎవరైనా చేయవచ్చు.. ‘‘ప్రారంభంలో నాకు ఇష్టలేకపోయినప్పటికీ మావారి ప్రోత్సాహంతో ఈరోజు ఈస్థాయికి ఎదిగాను. పోషకాలతో కూడిన పుట్టగొడుగులు ఉత్పత్తి చేయడం వల్ల మా కూన్ఫ్రెష్కు మంచి డిమాండ్ వచ్చింది. పుట్టగొడుగుల సాగు ఎవరైనా చేయవచ్చు. నిబ్బద్దత, ఆసక్తి, సహనంతో చేయగలిగితే మంచి లాభాలు ఆర్జించవచ్చు’’ అని షిజే చెప్పారు. -
‘మగవాళ్ల పనులు నీకెందుకమ్మా సుభద్ర..'
ఆర్యా రాజేంద్రన్ (21) గురించి ఆ మధ్య దేశమంతా గొప్పగా చెప్పుకుంది. ఆర్య చిన్న వయసులో తిరువనంతపురం మేయర్‌గా ఎన్నికవడమే అందుకు కారణం. ఆర్య వయసు అమ్మాయే సుభద్ర. ఇరవై ఒక్కేళ్లు. అయితే తనేమీ రాజకీయాల్లో లేదు. తనింటి కోసం నాలుగు పనులు చేస్తోంది. ఆ ఘనతే ఆమెను ఊళ్లో వండర్ గర్ల్‌గా నిలబెట్టింది. సుభద్ర పాఠాలు చెబుతుంది. డిగ్రీ చదివింది కనుక అంతవరకు ఒకే. అయితే అదొకటే ఆమెకు ఉపాధి కాదు. పొలం పనులు చేస్తుంది. పుట్టగొడుగుల సాగు పనులు చూస్తుంది. రైతుల్నించి పాలు సేకరించి డైరీలకు రవాణా చేయిస్తుంది. పిండి మర నడుపుతుంది. ఒడ్ల నుంచి పొట్టు తీస్తుంది. ఇంకా కొన్ని బండ పనులు, భారమయ్యే పనులు మీద వేసుకుంది. అన్ని పనులూ కుటుంబ పోషణ కోసం. సాధారణంగా గ్రామాల్లో ఈ తరహా పనులన్నీ మగవాళ్లే చేస్తారు. ఒడిశా, జైపూర్ జిల్లాలోని మారుమూల గ్రామం ‘బందా’ సుభద్ర వాళ్లది. ఇంట్లో ఆమెతో కలిపి ముగ్గురే ఉంటారు. తండ్రి, అన్న, తను. తల్లి లేదు. అన్నకు ఉద్యోగం లేదు. తండ్రి అప్పులు చేయడంతో అవి తీర్చందే ఆయన ఊరు దాటి వెళ్లి పరిస్థితి లేదు. ఆయనకు రెండెకరాల పొలం ఉంది. అందులో వరి, కూరగాయలు పండించేవాడు. పాడి రైతుల నుంచి పాలను చుట్టుపక్కల డెయిరీలకు సరఫరా చేసేవాడు. వరి పొట్టు తీసేవాడు. అలా కొంత డబ్బు వచ్చేది. అన్న ఇంజినీరింగ్ చేసే సమయంలో తండ్రికి ఆ పనుల్లో సహాయం చేసేది సుభద్ర. ‘మగవాళ్ల పనులు నీకెందుకమ్మా..’ అంటున్నా వినిపించుకునే కాదు. ఎవరో ఒకరు సహాయం చేయకపోతే నాన్న కూలబడిపోతాడు. కూలబడే వరకు ఎందుకు చేయడం? ఎందుకంటే.. అప్పు తీరాలి. ఐదేళ్ల క్రితం కొడుకు చదువు కోసం యాభై వేల రూపాయలు అప్పు చేశాడాయన. ఆ అప్పు సంగతీ, అదింకా తీరని సంగతీ సుభద్రకు తెలుసు. పిల్లలిద్దరికి డిగ్రీలు చేతికి వచ్చేసరికి అజయ్‌కి (సుభద్ర తండ్రి) అప్పు తీర్చాల్సిన నోటీసులు చేతికొచ్చాయి. వాస్తవాన్ని గ్రహించింది సుభద్ర. అన్నయ్యని ఉద్యోగం వెతుక్కోమని చెప్పి తను ఊళ్లో పనుల్లో పడిపోయింది. అప్పు తీర్చడం, నాన్నకు సహాయంగా ఇంటిని నడిపించడం ఇప్పుడు ఆమె బాధ్యతలు. గత ఏడాదే సుభద్ర తమ గ్రామానికి దగ్గర్లోని ఛటియాలోని ఎం.హెచ్.డి. మహావిద్యాలయ కాలేజ్ నుంచి ఆర్ట్స్‌లో పట్టభద్రురాలైంది. పేరుకు రెండు ఎకరాలున్నా, పంట దిగుబడులు లేవు. వడ్ల పొట్టు తీసే మిషన్ సొంతదే అయినా కరెంట్ బిల్లు కట్టలేకపోవడంతో కనెక్షన్ తీసేశారు. వేరే రాబడులూ తగ్గిపోయాయి. ఆ స్థితిలో తండ్రికి సహాయంగా కాక, ఇంటికి సహాయంగా దొరికిన పనులన్నీ మీద వేసుకుంది సుభద్ర. ఊళ్లో వాళ్లు కూడా.. ‘ఆడపిల్ల ఇంత అలసిపోవడం ఏంటమ్మా..’ అని వారించారు. ఆమె వినలేదు. వినే పరిస్థితీ లేదు. తను ఇంటర్ చదివేటప్పటి నుంచే పిల్లలు పాఠాలు చెబుతుండేది. ఆ అనుభవంతో ట్యూషన్లు మొదలుపెట్టింది. ట్యూషన్లకు, తక్కిన పనులకు ఆమె చేసుకున్న సమయ విభజన చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ‘అద్భుతమైన అమ్మాయి’ అనే మాట తప్ప ఆమెకు ఇంకే ప్రశంసా సరిపోదని అనిపిస్తుంది. సుభద్ర రోజూ ఉదయం 5 గంటలకే నిద్ర లేస్తుంది. పొలానికి వెళుతుంది. తొమ్మిది వరకు పొలం పనులు. ఇంటికొచ్చాక దైనందిన చర్యలు ముగించుకుని రైతుల్నించి పాలు సేకరించడానికి వెళుతుంది. వాడుకకు కుదుర్చుకున్న వాహనాలలో ఆ పాలను డైరీలకు చేరుస్తుంది. తర్వాత వడ్ల పొట్టు తీసే పని, పిండి మర నడిపే పని. ఇవన్నీ ఉదయం 11 సాయంత్రం 6 ఆరు గంటల మధ్య జరిగిపోతాయి. మధ్యలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటుంది. ఆ సమయంలోనే తమ పొలంలోని పుట్టగొడుగుల పంట బాగోగులు పరిశీలిస్తుంది. ఆరు తర్వాత ట్యూషన్‌కు వచ్చే 40 మంది పిల్లలతో మళ్లీ బిజీ. ఆమె ఎప్పుడూ లెక్కలు వేసుకోలేదు కానీ, నెలంతా ఇలా కష్టపడితే వచ్చేది దాదాపు 30 వేల రూపాయలు. డబ్బు కన్నా కూడా ఆమెకు ఒకటి అనుభవం అయింది. ‘‘కష్టకాలాన్ని అనుకూలంగా మార్చుకోవడమే జీవితం. జీవితమే ఉపాధి చూపిస్తుంది. ఈ వాస్తవాన్ని ప్రతి ఆడపిల్లా తెలుసుకోవాలి. మగ పని అని చతికిల పడకుండా.. మనిషి పని అనుకుని గడప దాటాలి’’ అంటుంది సుభద్ర. తనొక పెద్ద పారిశ్రామిక వేత్త అయి, ఊరికి దగ్గరల్లో మంచి వృద్ధాశ్రమం నెలకొల్పాలని ఆమె ధ్యేయం. -
సూపర్ మష్రూమ్స్.. అద్భుతః!
పుట్టగొడుగులు పోషకాల గనులని మనకు తెలిసిందే. పుట్టగొడుగుల్లో వందలాది రకాలు ఉన్నా కొన్ని మాత్రమే తినదగినవి. ఆయిస్టర్, బటన్, మిల్కీ మష్రూమ్స్ రకాలు ప్రస్తుతం సాగులో ఉన్నాయి. అయితే, కొన్ని అరుదైన రకాల పుట్టగొడుగుల్లో విశిష్ట పోషక విలువలతో పాటు అత్యద్భుతమైన ఔషధ విలువలు కూడా ఉంటాయి. అటువంటివే ‘కార్డిసెప్స్ మిలిటారిస్’ రకానికి చెందిన పుట్టగొడుగులు. ఇవి పసుపు, కాషాయ రంగులో సన్నటి పోగుల మాదిరిగా ఉంటాయి. సాధారణ పుట్టగొడుగుల మాదిరిగా షెడ్లలో కాకుండా.. నియంత్రిత వాతావరణంలో అతిశీతల ప్రయోగశాలల్లోనే వీటిని సాగు చేయాల్సి ఉంటుంది. విశిష్టమైన పోషక, ఔషధ గుణాలు కలిగి ఉండటం వల్ల వీటిని ‘సూపర్ మష్రూమ్స్’ అని పిలుస్తున్నారు. కార్డిసెప్స్తో కనక వర్షం దేశ, విదేశీ మార్కెట్లలో వీటి ధర కూడా ఎక్కువే. కార్డిసెప్స్ రకానికి చెందిన ఎండబెట్టిన పుట్టగొడుగుల కిలో (టోకు) ధర రూ. లక్షకు మాటే. రైతులు వీటì సాగుపై సాంకేతిక శిక్షణ తీసుకొని సాగు చేయడంతోపాటు ఉత్పత్తులుగా మార్చి అమ్ముకుంటే లక్షలు కళ్ల జూడవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. కార్డిసెప్స్ రకం పుట్టగొడుగులతో పొడులు, క్యాప్సుల్స్ వంటి ఉత్పత్తులను తయారు చేసి రిటైల్‌గా మార్కెట్ చేసుకోగలిగితే కిలోకు రూ. 3–5 లక్షల వరకు ఆదాయం పొందడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని డాక్టర్ సందీప్ దాస్ ‘సాక్షి’తో చెప్పారు. అసోంలోని బోడో విశ్వవిద్యాలయంలో ఆయన గత 8 ఏళ్లుగా వివిధ రకాల పుట్టగొడుగులపైనే పరిశోధనలు చేస్తున్నారు. ఔషధ గుణాలున్న అద్భుత ఆహారంగా అనేక దేశాలు గుర్తించినప్పటికీ పుట్టగొడుగులపై మన దేశంలో పరిశోధనాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని డా. సందీప్ దాస్ అన్నారు. చైనా, వియత్నాం, తైవాన్, కొరియా తదితర దేశాలు పూర్వకాలం నుంచే పుట్టగొడుగులపై ప్రత్యేక దృష్టి ఉంది. వ్యాధుల నివారణ, చికిత్సలలో కార్డిసెప్స్ రకం పుట్టగొడుగుల వాడకంపై కూడా గత 40 ఏళ్లుగా ఆయా దేశాలు శ్రద్ధ చూపుతున్నాయన్నారు. పరిశోధనలకు ప్రభుత్వ ప్రోత్సాహం డా. సందీప్ దాస్ బోడో విశ్వవిద్యాలయంలో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం డీన్‌గా ఉన్నారు. ఆయనతోపాటు మరో ముగ్గురు యువ పరిశోధకులు అనేక రకాల పుట్టగొడుగులపై లోతైన పరిశోధనలు చేస్తూ గణనీయమైన పురోగతిని సాధిస్తున్నారు. ఆయిస్టర్ పుట్టగొడుగుల పెంపకంతోపాటు వాటిని కూరగా వండుకోవటం మాత్రమే కాకుండా.. బిస్కెట్లు, రసగుల్లాలు వంటి అనేక ఉత్పత్తులను తయారు చేసి విక్రయించుకోవటం.. పుట్టగొడుగుల విత్తనం ఉత్పత్తిలో కూడా స్థానిక రైతులు, మహిళా స్వయం సహాయక బృందాలకు శిక్షణ ఇచ్చారు. కార్డిసెప్స్‌లో విశిష్ట ఔషధ గుణాలు కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక గ్రాంటు రూ. 6 కోట్లను అందుకున్న డా. సందీప్ బృందం కార్డిసెప్స్ మిలిటారిస్ రకం పుట్టగొడుగుల సాగుపై పరిశోధన చేసి విశేష ప్రగతిని సాధించింది. చనిపోయిన గొంగళిపురుగులు, ఇతరత్రా పురుగుల కళేబరాలపై ఈ పుట్టగొడుగులు పోగుల మాదిరిగా పెరుగుతూ ఉండటాన్ని డా. సందీప్ బృందం అడవుల్లో సంచరించే సమయంలో గుర్తించింది. వీటికి మార్కెట్లో గిరాకీ ఉండటం మూలాన ఇవి అంతరించిపోతున్న జాతుల జాబితాలోకి చేరిపోయాయి. వీటిని ప్రయోగశాలలో నియంత్రిత వాతావరణంలో సాగు చేయడంపై డా. సందీప్ దృష్టి కేంద్రీకరించి విజయం సాధించారు. ముడి వరి బియ్యంపై ప్రయోగశాలల్లో చిన్న, చిన్న బాక్సుల్లో సాగు చేయవచ్చని గుర్తించారు. అంతేకాదు, ప్రత్యేక యంత్రం ద్వారా అతి శీతల వాతావరణం (–86 డిగ్రీల ఉష్ణోగ్రత)లో వీటిని ఎండబెట్టడం ద్వారా వాటిలోని పోషక, విశిష్ట ఔషధ గుణాలకు నష్టం వాటిల్లకుండా ఉండే పద్ధతిని పాటిస్తున్నారు. ఇలా పెంచిన కార్డిసెప్స్ పుట్టగొడుగుల పొడితో క్యాప్సుల్స్‌ను తయారు చేసి ప్రజలకు విక్రయిస్తున్నారు. 150–200 ఎం.జి కాప్సుల్‌ను నేరుగా గాని, నీటిలో కలిపి గానీ ఉదయం అల్పాహారం తర్వాత తీసుకోవాలన్నారు. వీటి వల్ల రోగనిరోధక శక్తి ఇనుమడించడమే కాకుండా ఎన్నో జబ్బుల నివారణ సాధ్యమవుతోందని అధ్యయనం ద్వారా గుర్తించినట్లు డా. దాస్ తెలిపారు. వైరస్, బాక్టీరియా జబ్బులను తట్టుకునే శక్తి ఉంది. కేన్సర్, మధుమేహం, బీపీ, వాపు(ఇన్ఫ్లమేషన్), కణుతులు రాకుండా అడ్డుకునే గుణం ఉంది. కుంగుబాటును నిరోధించడంతోపాటు వత్తిడిని పారదోలే గుణం ఉంది. విటమిన్ సి పుష్కలంగా ఉందని.. ఇంకా ఎన్నో ఔషధ గుణాలు కార్డిసెప్స్ మిలిటారిస్ పుట్టగొడుగుల్లో నిక్షిప్తమై ఉన్నట్లు అధ్యయనాల్లో నిరూపితమైందని డా. సందీప్ దాస్ తెలిపారు. 60–70 రోజుల పంట కార్డిసెప్స్ మిలిటారిస్ పుట్టగొడుగులను పెంచాలనుకునే వారికి తాము అస్సాం కోక్రఝర్లోని తమ విశ్వవిద్యాలయంలో శిక్షణ ఇస్తామని డా. సందీప్ తెలిపారు. 60–70 రోజుల్లో పుట్టగొడుగుల పంట చేతికి వస్తుంది. ఫుడ్‌గ్రేడ్ ప్లాస్టిక్ బాక్సుల్లో ముడి వరి బియ్యంపై ఈ పుట్టగొడుగుల విత్తనంతో కూడిన పోషక ద్రవాన్ని చిలకరించి ప్రయోగశాలలో శీతల వాతావరణంలో ఉంచుతారు. ఒక పూట కృత్రిమ వెలుగు, ఒక పూట చీకటిలో ఉంచుతారు. కొద్ది రోజులకు పుట్టగొడుగులు మొలకెత్తి వేలెడంత పొడవున పోగుల మాదిరిగా ఎదుగుతాయి. వాటిని కత్తిరించి ప్రత్యేక పద్ధతుల్లో ఎండబెట్టి రకరకాల ఉత్పత్తులను తయారు చేస్తారు. రైతులకు శిక్షణ ఇవ్వడానికి సిద్ధం కార్డిసెప్స్ పుట్టగొడుగుల పెంపకంలో, వివిధ ఉత్పత్తుల తయారీలో రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల ప్రతినిధులకు శిక్షణ ఇవ్వడానికి తాము సిద్ధమని డా. సందీప్ దాస్ తెలిపారు. నేర్చుకునే వారి సామర్ధ్యాన్ని బట్టి కనిష్టంగా 2 రెండు రోజులు, గరిష్టంగా 2 నెలల వరకు శిక్షణ అవసరం ఉంటుందన్నారు. వీటి పెంపకానికి చిన్నపాటి ప్రయోగశాల ఏర్పాటుకు 600 చదరపు గజాల గదితోపాటు 300–400 చ.అ.ల విస్తీర్ణం గల మరో 3 గదులు అవసరం అవుతాయన్నారు. రూ. 20 లక్షల వరకు మౌలిక సదుపాయాలపై వెచ్చించాల్సి ఉంటుంది. రూ.5 – 10 లక్షల రివాల్వింగ్ ఫండ్ అవసరం ఉంటుంది. ఈ యూనిట్లో ఏడాదికి 140 ఎండబెట్టిన కార్డిసెప్స్ పుట్టగొడుగులను ఉత్పత్తి చేయవచ్చన్నారు. ఈ పుట్టగొడుగులలో కార్డిసెప్ మూలకం సాంద్రత అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని, దీన్ని బట్టి ధర లభిస్తుందన్నారు. గ్రాము పుట్టగొడుగుల్లో 10 ఎం.జి. కన్నా ఎక్కువ కార్డిసెప్ ఉంటే మంచి ధర వస్తుందన్నారు. ఎండు పుట్టగొడుగులు కిలోకు టోకున రూ. లక్ష వరకు రావచ్చు. క్యాప్సుల్స్, కార్డి వాటర్, కార్డి టీ తదితర ఉత్పత్తులుగా మార్చి అమ్మితే రూ. 3–5 లక్షల వరకు ఆదాయం రావడానికి ఆస్కారం ఉందని డా. సందీప్ దాస్ తెలిపారు. శిక్షణ పొందాలనుకునే వారు బోడో యూనివర్సిటీలోని పుట్టగొడుగుల విభాగం హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు. మొబైల్ : 91019 52358 ఈమెయిల్ : bu.bthub@dbt.nic.in రెండున్నరేళ్లుగా సాగు చేస్తున్నా..! సికింద్రాబాద్ ఆల్వాల్‌కు చెందిన అటిక్ పటేల్ అనే యువ ఇంజినీర్ రెండున్నరేళ్ల క్రితం నుంచి కార్డిసెప్స్ మిలిటారిస్ రకం సూపర్ మష్రూమ్స్‌ను సాగు చేస్తున్నారు. 27 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. కోట్ల పెట్టుబడి పెట్టి ‘క్లోన్ డీల్స్’ ప్రయోగశాలను నెలకొల్పారు. వియత్నాం, కొరియా, చైనా తదితర దేశాల్లో 30 ఏళ్ల నుంచే కార్డిసెప్స్ పుట్టగొడుగుల సాగు చేపట్టారని, తాను ఈ దేశాల్లో స్వయంగా పర్యటించి అధ్యయనం చేసి అవగాహన పెంచుకున్నానని అన్నారు. ఈ ఉత్పత్తులను అమ్మేందుకు అక్కడ ప్రత్యేక దుకాణాలు ఉండటం విశేషమని అటిక్ పటేల్ ‘సాక్షి’తో చెప్పారు. మనుషుల్లో రోగనిరోధక శక్తిని పెంపొందించే ఉత్పత్తులను తాము తయారు చేశామని, అన్ని అనుమతుల తర్వాత త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయబోతున్నామన్నారు. సూపర్ మష్రూమ్స్ సాగు చేస్తున్న దేశంలోనే అతిపెద్ద లాబ్‌ను నెలకొల్పటం, సొంత పరిశోధనల అనంతరం విలక్షణ ఉత్పత్తులను తయారు చేయటం తనకు ఎంతో సంతృప్తిని ఇస్తున్నదని అటిక్ పటేల్ (86907 07076) సంతోషంగా చెప్పారు. ‘చిన్న’ ఆవిష్కరణల వ్యాప్తిపై గ్రామీణ మహిళలకు శిక్షణ చిన్న, సన్నకారు రైతుల అవసరాలకు అనుగుణమైన, తక్కువ ఖర్చుతో కూడిన ఏడు రకాల యంత్ర పరికరాలు, ఆవిష్కరణలను వెలువరిస్తున్న సంస్థ ‘రుకార్ట్’. యువ ఐఐటీ ఇంజినీర్లు నెలకొల్పిన స్టార్టప్ సంస్థ ఇది. ఈ సంస్థ తయారు చేసిన యంత్రాలు, ఇతర పరికరాలను చిన్న, సన్నకారు రైతులకు అందించే క్రమంలో గ్రామీణ మహిళలకే శిక్షణ ఇవ్వదలచింది. విద్యుత్తు అవసరం లేని కూరగాయల (సబ్జీ) కూలర్ (వివరాలు 2020 ఆగస్టు 4న ‘సాక్షి సాగుబడి’ లో ప్రచురితం), విద్యుత్తు లేకుండా బావిలోని నీటిని తోడే ట్రెడల్ పంపు, అటవీ జంతువుల నుంచి పంటలను కాపాడే యంత్రాలు, వినూత్నమైన డ్రిప్‌తో కూడిన మల్చింగ్ షీట్, నీటికుంటల్లో వాడటానికి ఉపయోగపడే జల్కుండ్ షీట్, 5 నుంచి 20 కిలోల వరకు సామర్థ్యం కలిగిన సోలార్ డ్రయ్యర్లు.. ఇవీ రుకార్ట్ చిన్న రైతుల కోసం తయారు చేసి అందుబాటులోకి తెస్తున్న ఉత్పత్తులు. వీటిని తమ గ్రామంలో రైతులకు చేర్చే క్రమంలో అందుకు తోడ్పడే మహిళలకు వాటి ఖరీదులో కొంత శాతం మొత్తాన్ని అందిస్తామని వికిస్ ఝా చెప్పారు. ఆసక్తి గల గ్రామీణ మహిళలకు ప్రత్యేక సాంకేతిక శిక్షణ ఇస్తామన్నారు. చిన్న సన్నకారు రైతులకు ఈ యంత్ర పరికరాలను విక్రయించడం లేదా అద్దెకు ఇచ్చుకోవటం ద్వారా మహిళలకు నిరంతరం ఆదాయం వచ్చేలా చేస్తామని ‘రుకార్ట్’ వ్యవస్థాపకులు వికాస్ ఝా (88790 49787) తెలిపారు. వివరాలకు.. namaste@rukart.org -
అక్రమాల వెలుగు!
సాక్షి, సీతంపేట (శ్రీకాకుళం): మహిళా సంఘాలను బలోపేతం చేసి వారికి ఆర్థికంగా చేదోడువాదోడుగా ఉండాల్సిన వెలుగు శాఖలో కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గిరిజన ప్రాంతాల్లో గత ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు జరిగినట్లు సమాచారం. పూర్తిస్థాయిలో విచారణ జరిపి అక్రమాలు వెలికితీస్తే రూ.కోట్లలో కుంభకోణాలు బయటపడే అవకాశాలు ఉన్నాయని పలువురు అంటున్నారు. గతంలో న్యూట్రీషియన్, బాలబడుల కేంద్రాల్లో రూ.కోటి పైనే అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమార్కులపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఇతర జిల్లాలకు బదిలీతో సరిపెట్టేశారు. అప్పట్లో విచారణ పేరుతో కాలం గడిపేశారు తప్ప ఫలితం లేదు. తాజాగా ఒక మండల మహిళా సమాఖ్యకు చెందిన సీసీయే రూ.31లక్షలకు పైగా అక్రమాలకు పాల్పడ్డారంటే పర్యవేక్షణ ఏ మేరకు ఉందో అర్థమవుతోంది. రెండు, మూడేళ్లుగా ఈ అక్రమాలు గుట్టుగా చేస్తుంటే ఎందుకు పట్టించుకోకుండా సంబంధిత అధికారులు వదిలేశారనేది ప్రశ్నగా మారింది. దీనిలో పనిచేస్తున్న వారెవ్వరూ పర్మినెంట్ ఉద్యోగులు కాదు. రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)పరిధిలో పనిచేస్తున్న 80 శాతం మంది వరకు కాంట్రాక్ట్ ఉద్యోగులే. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది, ఏ పథకాలు అమలు చేస్తున్నారు, అసలు నేరుగా లబ్ధిదారులకు పథకాలు అందుతున్నాయా? లేదా అనేది వెలుగు ఉన్నతాధికారులు పర్యవేక్షించాల్సి ఉంది. కేవలం ఐటీడీఏ స్థాయిలో ఉన్నతాధికారులు పెట్టిన సమావేశాలకు హాజరు కావడం, వారికి కాకి లెక్కలు చూపించేసి మమ అనిపించేయడం పరిపాటిగా మారిపోయింది. కొద్ది రోజులకే పరిమితమైన పుట్టగొడుగుల పెంపకం.. ఐటీడీఏ పరిధిలోని సీతంపేట, భామిని, పాతపట్నం, హిరమండలం, కొత్తూరు, మెళియాపుట్టి, మందస మండలాల్లో 2015–16లో పుట్టగొడుగుల పెంపకం అని చెప్పి హడావుడి చేసిన అధికారులు కొద్దిరోజులకే మంగళం పాడేశారు. 171 పంచాయతీల్లో 107 మహిళా సంఘాలతో 107 గ్రామాల్లో 228 మంది మహిళా సభ్యులతో పుట్టగొడుగులు పెంపకం అనిచెప్పి మధ్యలోనే వదిలేశారు. ఇప్పుడు ఎక్కడా పూర్తిస్థాయిలో అమలు జరిగిన దాఖలాలు లేవు. బంతి మొక్కలు పెంపకం చేపట్టడం ద్వారా ఆర్థికంగా చేయూత ఇస్తామని తగిన ప్రోత్సాహం లేకపోవడంతో ఆ పథకం కూడా మూతపడింది. ఇందుకు సుమారు రూ.20 లక్షల వరకు వెచ్చించినట్టు చూపి నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. వీటిపై విచారణే లేదు. తాజాగా స్త్రీనిధి రుణాలు, పసుపుకుంకుమ, గ్రామైఖ్య సంఘం నిధులు రూ.31 లక్షలు వివిధ ఖాతాలకు మళ్లించి అక్రమాలకు పాల్పడ్డారు. గత అక్రమాలు పరిశీలిస్తే... గతంలో సీతంపేట, భామిని, కొత్తూరు మండలాల్లో 2014వ సంవత్సరంలో 110 బాలబడులను ఏర్పాటు చేశారు. మూడేళ్ల నుంచి ఐదేళ్ల మధ్య ఉన్న చిన్నారులను బాలబడుల్లో చేర్పించి వారికి ఆటపాటల ద్వారా విద్యనందించాలనేది లక్ష్యం. ఎంపిక చేసిన పీవీటీజీ (ప్రిలిమినరీ వలనర్బుల్ ట్రైబుల్ గ్రూప్) గ్రామాల్లో ఏర్పాటు చేసినప్పటికీ పర్యవేక్షణ లేకపోవడంతో చాలా గ్రామాల్లో సరిగా పనిచేయ లేదు. దీంతో పాఠశాలలను పూర్తిగా ఎత్తివేశారు. ఈ బాలబడులకు ఆటవస్తువులు, ఇతర పరికరాల కొనుగోలుకు రూ.50 లక్షల వరకు వెచ్చించినట్టు రికార్డుల్లో చూపించి, ఎటువంటి వస్తువులు కొనుగోలు చేయకుండా రూ.50 లక్షల వరకు కైంకర్యం చేశారు. ఆరోగ్యం, పోషణ కేంద్రాల ఏర్పాటులో.. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పౌష్టికాహార లోపాలను అధిగమించడానికి పీవీటీజీ గ్రామాల్లో ఆరోగ్యం, పోషణ కేంద్రాలు గతంలో ఏర్పాటు చేశారు. కొత్తూరు, సీతంపేట మండలాల్లో 109 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా మధ్యాహ్నం భోజనం, ఉదయం పాలు, కోడి గుడ్లు అందించాలి. చాలా గ్రామాల్లో ఈ పథకం అంటే ఎవరికీ తెలియని పరిస్థితి. వీటికి సంబంధించిన వంట పాత్రలు, ఇతర సామగ్రితో పాటు రూ.30 లక్షల వరకు అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం నిధులు దుర్వినియోగం అయ్యాయని ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. గతంలో కుంభకోణాలు నాకు తెలి యదు. లబ్ధిదారుడు తనకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేస్తే తప్ప..నేనేమి చేయలేను. ప్రస్తుతం తాము రుణాల రికవరీకి గ్రామాలకు వెళితే ఈ తరహా కుంభకోణం బయటపడింది. అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసు పెట్టడంతో పాటు నిధుల రికవరీకి చర్యలు తీసుకుంటున్నాం. – డైజీ, వెలుగు ఏపీడీ, సీతంపేట అక్రమార్కులపై చర్యలు తప్పవు అక్రమాలకు పాల్పడేవారిపై చర్యలు తప్పవు. వెలుగు అవినీతి అక్రమాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయించడానికి చర్యలు తీసుకుంటాం. ఇక్కడ జరుగుతున్న కుంభకోణాలపై ముఖ్యమంత్రి కృష్టికి తీసుకువెళ్లి ప్రక్షాళన చేస్తాం. గత ప్రభుత్వంలో అక్రమార్కులకు కొంతమంది అధికారులు కొమ్ముకాసారు. ఎవరికి దొరికింది వారు దోచుకున్నారు. వీటన్నింటిపై విచారణ చేయిస్తాం. – విశ్వాసరాయి కళావతి, పాలకొండ ఎమ్మెల్యే -
పుట్టగొడుగులతో పూల బాట!
గ్రామీణ యువత వ్యవసాయానికి దూరం కాకుండా ఉండాలంటే అనుదినం ఆదాయాన్నందించే పుట్టగొడుగుల సాగుపై శిక్షణ ఇవ్వటం ఉత్తమమని తలచాడు తమిళనాడుకు చెందిన ఓ ప్రధానోపాధ్యాయుడు. తాను ప్రభుత్వోద్యోగం చేసుకుంటూ ఈ విషయాన్ని ప్రచారం చేయటం సరికాదని గ్రహించి.. ఉద్యోగానికి స్వస్తి చెప్పాడు! పుట్టగొడుగుల సాగే తన జీవనాధారం చేసుకుని ఇరవయ్యేళ్లుగా ఉచితంగానే శిక్షణ ఇస్తూ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. వ్యవసాయానికి దూరమవుతున్న గ్రామీణ యువతకు నిరంతరం ఆదాయాన్ని అందించే జీవనోపాధి చూపాలన్న తపన సుందరమూర్తిని ఉద్యోగంలో నిలవనివ్వలేదు. తమిళనాడు తిరువళ్లూరు సమీపంలోని గూడపాక్కం గ్రామానికి చెందిన ఆయన ఎమ్యే పీహెచ్డీ పూర్తిచేసి.. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా, సర్వశిక్ష అభియాన్ సమన్వయకర్తగా పనిచేశారు. 22 ఏళ్ల క్రితం ఒక రోజు క్లాసులో ఉన్న విద్యార్థులతో మాట్లాడుతున్నప్పుడు కొత్త తరానికి వ్యవసాయంపై ఆసక్తి లేదని గ్రహించారు. తక్కువ ఖర్చుతో నిరంతర ఆదాయాన్ని పొందేలా వ్యవసాయం చేసే మార్గాలను గ్రామీణ యువతకు తెలియజెప్పాలని తలపెట్టాడు. తాను చీకూ చింతా లేని ఉద్యోగం చేసుకుంటూ ఎదుటి వారికి వ్యవసాయం గురించి చెప్పటం ఇబ్బందికరంగా మారింది. ఆ క్రమంలో ఉద్యోగాన్ని కూడా వదిలెయ్యాలన్న ఆలోచన వచ్చింది. భార్య మీనాక్షికి చెప్పటంలో ‘పిల్లలు లేరు. ఆర్థిక భద్రత ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి వ్యవసాయం చేస్తానంటే ఎలా’ అని ఆమె ప్రశ్నించారు. చివరికి ఆమెను ఒప్పించి.. ఉద్యోగానికి రాజీనామా చేయకుండానే సాయంత్రం సమయంలో పుట్టగొడుగుల సాగుపై అవగాహన పెంచుకోవడంపై దృష్టి సారించారు. పట్టణవాసులు పుట్టగొడుగుల వాడకంపై ఆసక్తి కనపరుస్తున్నందున ఈ రంగాన్ని ఎంచుకోవచ్చని నిర్ధారణకు వచ్చి1997లో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశానని సుందరమూర్తి వివరించారు. ప్రభుత్వ సబ్సిడీ పొంది రూ. 70 వేలతో రెండు ప్రత్యేక షెడ్లను ఏర్పాటు చేసుకుని.. అనుభవజ్ఞుల సాయంతో పుట్టగొడుగుల సాగులో మెళకువలను నేర్చుకున్నారు. ఎక్కువ డిమాండ్ వుండే పాలపుట్టగొడుగు, చిప్పి పుట్టగొడుగుల సాగు చేయడంతో పాటు విత్తనాలను ఉత్పత్తి చేసి విక్రయించారు. మరోవైపు యువతకు ఉచితంగానే శిక్షణ ఇచ్చారు. చిప్పి రకం పుట్టగొడుగులు రుచి ఎక్కువగా వుంటుంది. మసాల పెద్దమొత్తంలో వేసినా వాటిని పీల్చుకునే శక్తి ఎక్కువ. మృదువుగానూ ఉంటుంది. ఈ రకమైన పుట్టగొడుగుల సాగు కోసం ప్రత్యేకంగా మరో షెడ్‌ను ఏర్పాటు చేశారు. రసాయన ఎరువులను ఉపయోగించకుండా సేంద్రియ పద్ధతుల్లోనే చేస్తుండడంతో, తమ పుట్టగొడుగులను కొనడానికి ప్రజలు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారని వివరించారు. తిరువళ్లూరు, చెన్నై తదితర ప్రాంతాల నుండి పెద్ద మొత్తంలో వచ్చే ఆర్డర్లను తీసుకుని డోర్‌డెలివరీ కూడా ఇస్తుండటంతో అమ్మకాలు క్రమంగా పెరిగాయి. భార్య మీనాక్షి తోడ్పాటుతో ప్రస్తుతం సుందరమూర్తి నెలకు 600 కేజీల నుండి 4 వేల కేజీల వరకు పుట్టగొడుగులను విక్రయిస్తున్నారు. నెలకు రూ. లక్ష వరకు నికరాదాయం పొందుతుండటం విశేషం. యువతకు శిక్షణ ఇవ్వడంలోనే సంతృప్తి! ముళ్ళ బాటను దాటితేనే పూల బాట వస్తుంది. సవాళ్ళను ఎదుర్కోకుండానే సక్సెస్ ఎలా అవుతాం అని ప్రశ్నించుకున్నా. కష్టమో నష్టమో వ్యవసాయం చేయాలనుకుని ఉద్యోగం వదిలేశాక.. మళ్ళీ వెనుకడుగు వేయలేదు. మొదట్లో కొంత భయపడ్డా తరువాత కుదురుకున్నా. ప్రతి నెలా వందలాది మంది రైతులకు, యువకులకు ఇరవయ్యేళ్లుగా ఉచితంగా శిక్షణ ఇస్తున్నా. పుట్టగొడుగుల సాగు చేయడం కన్నా వేలాది మంది యువతకు శిక్షణ ఇవ్వడం ఎంతో సంతృప్తినిస్తున్నది. – సుందరమూర్తి, గూడపాక్కం, తిరువళ్లూరు, తమిళనాడు sundar1967@gmail.com (వివరాలకు – రాజపాల్యం ప్రభు, 9655880425) – కోనేటి వెంకటేశ్వర్లు, సాక్షి, తిరువళ్లూరు, తమిళనాడు సంచితో వుంచిన పుట్టగొడుగులవిత్తనాలు, పుట్టగొడుగు -
ప్రోత్సాహమేదీ?
♦ పుట్టగొడుగుల పెంపకాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం ♦ సబ్సిడీలు, ప్రోత్సాహం లేక ముందుకురాని యువత, రైతులు ♦ శిక్షణకు హాజరయ్యేందుకు అనాసక్తి ♦ ఇతర పథకాల్లాగే రాయితీలు వర్తింపజేయాలని డిమాండ్ పుట్టగొడుగుల పేరు చెబితే భోజన ప్రియులు లొట్టలేస్తారు. శాఖాహారులు.. మాంసాహారులనే బేధం లేకుండా ఉభయులూ ఇష్టపడతారు. హృద్రోగులకు, మధుమేహ వ్యాధిగ్రస్తులకూ ఆరోగ్యకరమైన ఆహారం. మష్రూమ్స్ కర్రీకి హోటళ్లలోనూ మంచి డిమాండ్ ఉంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న పుట్టగొడుగుల పెంపకంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయూన్నిచ్చే వీటి పెంపకంపై నిరుద్యోగ యువత, రైతులు ఆసక్తి కనబర్చు తున్నప్పటికీ ప్రోత్సాహం లేక ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ఒంగోలు టూటౌన్ : జిల్లాలో ఉద్యానశాఖ ద్వారా పుట్టగొడుగుల పెంపకం పథకం 20 ఏళ్లుగా అమలవుతోంది. ఒంగోలులోని ఉద్యాన శాఖ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన పుట్టగొడుగుల కేంద్రంలో ప్రతి మంగళవారం శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ఈ శిక్షణకు ప్రకాశం జిల్లా నుంచే కాకుండా గుంటూరు, నెల్లూరు జిల్లాల నుంచి కూడా రైతులు వస్తుంటారు. శిక్షణకు ప్రతి రైతు రూ.100 చెల్లించాల్సి ఉండటంతో చాల మంది అనాసక్తి చూపిస్తున్నారు. ఒక్కో జిల్లా నుంచి ఇద్దరు ముగ్గురు మాత్రమే హాజరవుతున్నారు. కొత్తపట్నంలో విత్తన ఉత్పత్తి కేంద్రం.. జిల్లాలోని తీరప్రాంతమైన కొత్తపట్నంలోని ఉద్యాన నర్సరీలో పుట్టగొడుగుల విత్తనోత్పత్తి కేంద్రం ఏర్పాటు చేశారు. ఏటా 1000 కిలోలు మాత్రమే ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. అంతే స్థాయిలో ఏటా లక్ష్యంగా నిర్ణయించారు. ఉత్పత్తి చేసిన విత్తనాలను శిక్షణకు వచ్చిన రైతులకు మాత్రమే అమ్ముతారు. కిలో విత్తనాలు రూ.90 విక్రయిస్తారు. ఒక్కొక్క రైతుకు 20 కేజీలు మాత్రమే ఇస్తారు. విత్తనాల కొనుగోలు కూడా ఎలాటి రాయితీ లేకపోవడంతో శిక్షణకు వచ్చి రైతులు సైతం నిరుత్సాహనికి గురవుతున్నారు. పుట్టగొడుగుల పెంపకంతో ఏదైనా తేడా వస్తే.. రైతు ఆర్థికంగా మొత్తం నష్టపోవాల్సి వస్తోందని శిక్షణకు వచ్చిన పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెంపకానికి ఎక్కడ అనుకూలం.. తీరప్రాంతంతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాలు పుట్టగొడుగుల పెంపకానికి అనుకూలమే. చల్లగా ఉండే కొండప్రాంతాలు, మన రాష్ట్రంలో మైదాన ప్రాంతాల్లో శీతాకాలంలో పెంచుతుంటారు. వైట్ బటన్, అయిస్టర్ లేక థింగీ (ముత్యపు చుక్క), చైనీస్ (ఓల్వోరిల్లా స్పీషిస్), సబ్ స్ట్రాట్, ఇంక్యుబేషిన్ క్రాపింగ్ ఇలా దాదాపు రెండు వేల రకాల పుట్టగొడుగులు ఉన్నాయి. వీటి పెంపకంలో సాంకేతిక నైపుణ్యం అవసరం. ఉష్ణోగ్రతలలో ఏదైన తేడా వస్తే పుట్టగొడుగుల బెడ్స్ మొత్తానికి వైరస్ సోకి పాడైపోయే ప్రమాదం ఉంది. దీంతో రైతు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. బ్యాంకు రుణాలూ అందని ద్రాక్షే.. ఉద్యానశాఖ ద్వారా అమలు చేస్తున్న పలు పథకాలకు లక్షాలాది రూపాయలను సబ్సిడీలుగా అందిస్తున్న ప్రభుత్వం పుట్టగొడుగుల పెంపకాన్ని మాత్రం విస్మరించడం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు రుణాలు కూడా అందని ద్రాక్షే అవుతోంది. కొత్తగా పండ్లతోటలు సాగు చేసే రైతులకు 40 శాతం, బత్తాయి, నిమ్మతోటలకు రూ.23,160, మామిడికి రూ.19,460, దానిమ్మకు 29,500, టిష్యుకల్చర్ అరటి సాగుకు రూ.54,100, బొప్పాయి తోటలకు రూ.48,030 ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తోంది. రెండవ, మూడవ సంవత్సరంలో పండ్ల తోటల నిర్వహణకు 75 శాతం రాయితీ కల్పించడం జరుగుతుంది. 50 శాతం రాయితీపై పాత తోటల పునరుద్ధరణ పథకం కింద బత్తాయి, నిమ్మ, జామ, జీడి మామిడి తోటలకు హెక్టారుకు రూ.20,000 సాయం అందిస్తోంది. మామిడి, బత్తాయి మరియు నిమ్మతోటలలో కొమ్మ కత్తిరింపుల పథకం కింద 50 శాతం రాయితీలు మంజూ చేస్తోంది. ఇలా పలు పథకాలకు రాయితీలు అందిస్తూ పుట్టగొడుగుల పెంపకానికి మాత్రం మొండిచేయి చూపడంపై రైతు సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం స్పందించి పండ్ల తోటలకు మాదిరిగానే పుట్టగొడుగుల పెంపకానికి కూడా సబ్సిడీలు మంజూరు చేసి ప్రోత్సాహించాలని రైతులు కోరుతున్నారు.