ఐదు తండాల్లో ఆకుకూరల హబ్ | Five hordes Leaf vegetable Hub | Sakshi
Sakshi News home page

ఐదు తండాల్లో ఆకుకూరల హబ్

Published Mon, Jan 25 2016 3:15 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

ఐదు తండాల్లో ఆకుకూరల హబ్ - Sakshi

ఐదు తండాల్లో ఆకుకూరల హబ్

♦ గిరిజన రైతులతో గ్రీన్‌హౌస్ ద్వారా సేంద్రియ పద్ధతిలో సాగు
♦ నల్లగొండ జిల్లాలో ఐదు గ్రామాల దత్తత
♦ 500 మంది రైతులు...500 ఎకరాల్లో ఆకుకూరల సాగు
♦ 10 మంది రైతులకో క్లస్టర్... ఉద్యానశాఖ నిర్ణయం
 
 సాక్షి, హైదరాబాద్: గిరిజన రైతులతో సేంద్రియ ఆకుకూరల హబ్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యానశాఖ నిర్ణయించింది. ఇందుకోసం నల్లగొండ జిల్లా బొమ్మలరామారం మండలంలోని జలాల్‌పూర్, అవ్వాపూర్ , హాజీపూర్ , బోయినపల్లి, తిమ్మాపూర్ తండాలను ఎంపిక చేసింది. వాటిని ఉద్యానశాఖ దత్తత తీసుకుంది. ఆ ఐదు గ్రామాలను సేంద్రియ ఆకు కూరల హబ్‌గా ప్రకటించింది. ఆయా గ్రామాలకు చెందిన 500 మంది ఎస్టీ రైతులను గుర్తించి 500 ఎకరాల్లో సేంద్రియ పద్దతిలో ఆకుకూరల సాగు చేపట్టనున్నారు.

ఈ నెల 28వ తేదీన బొమ్మలరామారంలో 500 మంది గిరిజన రైతులతో ప్రత్యేకంగా ఒక సదస్సు నిర్వహిస్తారు. పది మంది రైతుల వంతున ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తారు. వారికి విత్తనాలు, సాగుపై ప్రత్యేక శిక్షణ ఇస్తామని ఉద్యానశాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. ఎస్టీ రైతులకు గాను ఎకరాకు రూ. 20 లక్షలు మాత్రమే ఖర్చయ్యేలా గ్రీన్‌హౌస్ నిర్మాణానికి రూపకల్పన చేస్తామని... 75 శాతం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నందున ఒక్కో గిరిజన రైతు ఎకరానికి రూ. 5 లక్షలు చెల్లిస్తే గ్రీన్‌హౌస్ ఏర్పాటు చేసుకోవచ్చని ఆయన తెలిపారు.

బ్యాంకులతో అనుసంధానం...
 సేంద్రియ పద్ద్ధతిలో పండించే ఆకు కూరలను హైదరాబాద్‌లోని ఒక మార్కెట్‌కు అనుసంధానం చేసి మార్కెట్ సౌకర్యం కల్పిస్తారు. ఏడాదిపాటు నిత్యం ఆకుకూరలు ఈ హబ్‌లో సాగు చేస్తారు. పాలకూర, చుక్కకూర, తోటకూర, గోంగూర, మెంతి, కొత్తిమీర, పుదీన సాగు చేయిస్తారు. ఇలా సాగుచేసిన ఆకు కూరలను హైదరాబాద్‌కు తీసుకువచ్చేందుకు వ్యాన్లను ఏర్పాటు చేస్తారు.వాటి కొనుగోలుకు బ్యాంకులతో అనుసంధానం చేస్తారు. ఆకు కూరల హబ్‌కు సంబంధించి ఆదివారం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రచించినట్లు వెంకట్రామిరెడ్డి చెప్పారు. అక్కడి భూములు, నీటి వసతి, రైతులపై ప్రత్యేకంగా సర్వే చేసి హబ్‌గా ప్రకటించామన్నారు. ఇప్పటికే ప్రకటించిన 399 ఉద్యాన పంటల క్రాప్ కాలనీల్లో భాగంగా నిర్ధారించిన వాటిల్లో ఈ గ్రామాలు ఉన్నాయని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement