వ్యవసాయ కోర్సుల్లో సామాజిక శాస్త్రం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్‌లో సైన్సు, డిగ్రీ, పీజీల్లో వ్యవసాయ విద్య, తర్వాత వ్యవసాయాధికారిగా ఉద్యోగం... అనంతరం క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో ఉండటం. ఇలా వ్యవసాయ ఉద్యోగంలో ప్రవేశించిన వారి జీవితం ప్రారంభం అవుతుంది. అయితే అనేకమంది ఉద్యోగాన్ని సామాజిక బాధ్యతగా భావించడం లేదని, రైతులకు అందుబాటులో ఉండటం లేదని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) గుర్తించింది. కొందరైతే తమకోసమే ఉద్యోగమన్న భావనలో నిర్లక్ష్యంగా ఉన్నారని ఆవేదన చెందుతోంది. దీన్ని సరిదిద్దేందుకు ఐకార్ నడుం బిగించింది. వ్యవసాయ, దాని అనుబంధ కోర్సుల్లోనూ సామాజిక శాస్త్రాన్ని ప్రధాన సబ్జెక్టుగా ప్రవేశపెట్టి వారిలో సామాజిక స్పృహ పెంపొందించాలని యోచిస్తోంది. దీనిపై మార్గదర్శకాలను తయారు చేసే పనిలో ఐకార్ ఉన్నట్లు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీ అధికారులు చెబుతున్నారు. దీన్ని వచ్చే ఏడాది నుంచి అమలు చేసే అవకాశముందన్నారు.
వందలాది మంది అధికారులున్నా అంతే!
పాఠశాల స్థాయిలో పదో తరగతి వరకు మాత్రమే విద్యార్థులు సాంఘిక శాస్త్రం చదువుతున్నారు. ఇక ఇంటర్ నుంచి సైన్సు, ఆర్ట్స్ కోర్సులను ఎంచుకుంటున్నారు. సైన్సు కోర్సులో చేరిన విద్యార్థులు పూర్తిగా సామాజిక శాస్త్రాలకు దూరం అవుతున్నారు. ఫలితంగా సామాజిక స్పృహ, బాధ్యత లేక వ్యవసాయాధికారులు ఉద్యోగాన్ని సక్రమంగా నిర్వర్తించడంలేదని ఐకార్ భావిస్తోంది. ఒకవైపు రైతు ఆత్మహత్యలు, మరోవైపు కరువుఛాయలు రైతును కుదేలు చేస్తున్నాయి. రైతు కోసం వేలాది మంది వ్యవసాయాధికారులున్నా రైతుకు పెద్దగా ప్రయోజనం కలగడంలేదని భావిస్తోంది. రాష్ట్రంలో వందలాది మంది వ్యవసాయ కోర్సులు చేస్తున్నారు. వారిలో చాలామంది ప్రభుత్వ వ్యవసాయ ఉద్యోగంలో చేరుతున్నారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,200 ఏఈవో పోస్టులు, 450 ఏవో, 122 ఏడీఏ, 25 డీడీఏ, 15 జేడీఏ, రెండు అడిషనల్ డెరైక్టర్ పోస్టులున్నాయి. జిల్లాల్లోని ప్రయోగశాలల్లో దాదాపు 60 మంది ఉన్నారు. మరోవైపు ఉద్యానశాఖలో సుమారు 200 మంది పనిచేస్తున్నారు. వ్యవసాయ వర్సిటీలో 500 మందికిపైగా అధ్యాపకులు, ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు ఉన్నారు. వీరుగాక ఇతర వ్యవసాయ అనుబంధ విభాగాల్లో వందలాది మంది ఉన్నారు. కేంద్ర వ్యవసాయ పరిశోధన సంస్థల్లో అనేకమంది పరిశోధనలు చేస్తున్నారు. ఇలా వేలాది మంది ఉన్నా రైతుకు కలిగే ప్రయోజనం ఎంతనేది ఐకార్‌ను వేధిస్తున్న ప్రశ్న. ఇంత యంత్రాంగం ఉన్నా రైతులు నూతన సాగు విధానాలను పాటించకుండా సంప్రదాయ వ్యవసాయంపైనే ఎందుకు ఆధారపడుతున్నారని అంటోంది. ఈ నేపథ్యంలో రైతుల పట్ల సున్నితంగా స్పందించాల్సిన అవసరాన్ని గుర్తించేందుకు వ్యవసాయ డిగ్రీ, పీజీ కోర్సుల్లో తప్పనిసరిగా సామాజికశాస్త్రాన్ని పరిచయం చేయాలని నిర్ణయించింది.