Telangana Agricultural University
-
సంప్రదాయసాగుపై అ‘సెస్’మెంట్
సాక్షి, హైదరాబాద్: ‘మెట్ట రైతులు అనాదిగా అనుసరిస్తున్న సమీకృత సంప్రదాయ వ్యవసాయకజ్ఞానం ప్రతికూల వాతావరణంలో సైతం పౌష్టికాహార, ఆదాయ భద్రతను అందిస్తుంది. రైతుల భావోద్వేగాలు, ఆచారాలు, సంస్కృతితో ఈ వ్యవసాయం ముడిపడి ఉంది. వర్షం ఉన్నప్పుడు ఏ పంటలు వేయాలి, కరువొచ్చినప్పుడు ఏ యే భూముల్లో ఏ యే పంటలు కలిపి వేసుకోవాలన్న సంప్రదాయ విజ్ఞానం జీవవైవిధ్య సంప్రదాయ సేంద్రియ వ్యవసాయంలో అంతర్భాగం’అని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్(సెస్) తదితర సంస్థలు సంయుక్తంగా చేపట్టిన అధ్యయనం చెబుతోంది. సెస్, డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ(డి.డి.ఎస్.), న్యూఫీల్డ్ ఫౌండేషన్(యు.ఎస్.) ఆధ్వర్యంలో గత ఏడాది ఖరీఫ్, రబీల్లో జహీరాబాద్ ప్రాంత రైతుల సాగు, జీవన స్థితిగతులపై తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అసోసియేట్ పరిశోధనా సంచాలకులు ఆర్.ఉమారెడ్డి, సెస్ అసోసియేట్ ప్రొఫెసర్ బి.సురేశ్‌రెడ్డి, డీడీఎస్ కమ్యూనిటీ మీడియా ట్రస్టు అధిపతి చిన్న నరసమ్మ, డీడీఎస్ కమ్యూనికేషన్స్ కోఆర్డినేటర్ దంతలూరి తేజస్వి, డీడీఎస్ డైరెక్టర్ పి.వి.సతీష్ అధ్యయనం చేశారు. వివరాలను వారు మంగళవారం ఇక్కడ మీడియాకు వెల్లడించారు. ఎన్నో విషయాలు తెలుసుకున్నాం... జహీరాబాద్ ప్రాంతంలోని 11 గ్రామాల్లో 20–30 మంది రైతులను 2017 జూన్ నుంచి 2018 మే వరకు అనేక దఫాలుగా కలుసుకొని, వారి సాగువిధానాన్ని సునిశితంగా పరిశీలించామని సెస్ అసోసియేట్ ప్రొఫెసర్, వ్యవసాయ శాస్త్రవేత్త సురేశ్‌రెడ్డి తెలిపారు. తాము వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నేర్చుకోని విషయాలెన్నో ఆ రైతుల వద్ద నుంచి తెలుసుకున్నామన్నారు. ‘విత్తనాన్ని బుట్టల్లో బూడిద, వేపాకు, ఎర్రమట్టి కలిపి దాచుకుంటారు. దిగుబడి ఎన్ని బస్తాలు? అనేది ఒక్కటే కాదు, పశువులకు మేత, భూమికి బలిమినిచ్చేవి ఏ పంటలు అని వాళ్లు చూసుకుంటారు. వాళ్ల పొలాల్లో సాగు చేయకుండా పెరిగే మొక్కలు పోషక, ఔషధ విలువలున్న అద్భుతమైన ఆకుకూరలు, వాళ్ల భూములు కూడా జవజీవాలతో ఉన్నాయి. వీళ్ల వ్యవసాయం జూదప్రాయం కాదు. అప్పులు, ఆత్మహత్యలుండవు. వ్యవసాయ సంక్షోభం నివారణకు ఇది అనుసరణీయం’ అని సురేశ్‌రెడ్డి అన్నారు. -
వ్యవసాయ కోర్సుల్లో సామాజిక శాస్త్రం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్‌లో సైన్సు, డిగ్రీ, పీజీల్లో వ్యవసాయ విద్య, తర్వాత వ్యవసాయాధికారిగా ఉద్యోగం... అనంతరం క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో ఉండటం. ఇలా వ్యవసాయ ఉద్యోగంలో ప్రవేశించిన వారి జీవితం ప్రారంభం అవుతుంది. అయితే అనేకమంది ఉద్యోగాన్ని సామాజిక బాధ్యతగా భావించడం లేదని, రైతులకు అందుబాటులో ఉండటం లేదని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) గుర్తించింది. కొందరైతే తమకోసమే ఉద్యోగమన్న భావనలో నిర్లక్ష్యంగా ఉన్నారని ఆవేదన చెందుతోంది. దీన్ని సరిదిద్దేందుకు ఐకార్ నడుం బిగించింది. వ్యవసాయ, దాని అనుబంధ కోర్సుల్లోనూ సామాజిక శాస్త్రాన్ని ప్రధాన సబ్జెక్టుగా ప్రవేశపెట్టి వారిలో సామాజిక స్పృహ పెంపొందించాలని యోచిస్తోంది. దీనిపై మార్గదర్శకాలను తయారు చేసే పనిలో ఐకార్ ఉన్నట్లు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీ అధికారులు చెబుతున్నారు. దీన్ని వచ్చే ఏడాది నుంచి అమలు చేసే అవకాశముందన్నారు. వందలాది మంది అధికారులున్నా అంతే! పాఠశాల స్థాయిలో పదో తరగతి వరకు మాత్రమే విద్యార్థులు సాంఘిక శాస్త్రం చదువుతున్నారు. ఇక ఇంటర్ నుంచి సైన్సు, ఆర్ట్స్ కోర్సులను ఎంచుకుంటున్నారు. సైన్సు కోర్సులో చేరిన విద్యార్థులు పూర్తిగా సామాజిక శాస్త్రాలకు దూరం అవుతున్నారు. ఫలితంగా సామాజిక స్పృహ, బాధ్యత లేక వ్యవసాయాధికారులు ఉద్యోగాన్ని సక్రమంగా నిర్వర్తించడంలేదని ఐకార్ భావిస్తోంది. ఒకవైపు రైతు ఆత్మహత్యలు, మరోవైపు కరువుఛాయలు రైతును కుదేలు చేస్తున్నాయి. రైతు కోసం వేలాది మంది వ్యవసాయాధికారులున్నా రైతుకు పెద్దగా ప్రయోజనం కలగడంలేదని భావిస్తోంది. రాష్ట్రంలో వందలాది మంది వ్యవసాయ కోర్సులు చేస్తున్నారు. వారిలో చాలామంది ప్రభుత్వ వ్యవసాయ ఉద్యోగంలో చేరుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,200 ఏఈవో పోస్టులు, 450 ఏవో, 122 ఏడీఏ, 25 డీడీఏ, 15 జేడీఏ, రెండు అడిషనల్ డెరైక్టర్ పోస్టులున్నాయి. జిల్లాల్లోని ప్రయోగశాలల్లో దాదాపు 60 మంది ఉన్నారు. మరోవైపు ఉద్యానశాఖలో సుమారు 200 మంది పనిచేస్తున్నారు. వ్యవసాయ వర్సిటీలో 500 మందికిపైగా అధ్యాపకులు, ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు ఉన్నారు. వీరుగాక ఇతర వ్యవసాయ అనుబంధ విభాగాల్లో వందలాది మంది ఉన్నారు. కేంద్ర వ్యవసాయ పరిశోధన సంస్థల్లో అనేకమంది పరిశోధనలు చేస్తున్నారు. ఇలా వేలాది మంది ఉన్నా రైతుకు కలిగే ప్రయోజనం ఎంతనేది ఐకార్‌ను వేధిస్తున్న ప్రశ్న. ఇంత యంత్రాంగం ఉన్నా రైతులు నూతన సాగు విధానాలను పాటించకుండా సంప్రదాయ వ్యవసాయంపైనే ఎందుకు ఆధారపడుతున్నారని అంటోంది. ఈ నేపథ్యంలో రైతుల పట్ల సున్నితంగా స్పందించాల్సిన అవసరాన్ని గుర్తించేందుకు వ్యవసాయ డిగ్రీ, పీజీ కోర్సుల్లో తప్పనిసరిగా సామాజికశాస్త్రాన్ని పరిచయం చేయాలని నిర్ణయించింది.