ఇంటితోట కూరల రుచి ఎంతో ఇష్టం!
ప్రకృతితో మమేకమవ్వాలనే ఆకాంక్ష చాలా మందికి ఉంటుంది. కానీ, ఆ ఆకాంక్షకు కార్యరూపం ఇవ్వగలిగేది కొందరే. అటువంటి కోవలోని వారే డాక్టర్ కొండా శ్రీదేవి. హైదరాబాద్ కృష్ణనగర్‌లో సొంత ఆసుపత్రిలో గైనకాలజిస్టుగా బిజీగా ఉండే ఆమె తన ఆసుపత్రి మేడ మీద ప్రత్యేక శ్రద్ధతో గార్డెన్ ఏర్పాటు చేసుకున్నారు. ఇనుప మెట్లను ఏర్పాటు చేసి వాటిపై ప్లాస్టిక్ కుండీలను అమర్చారు. పూలమొక్కలతోపాటు సేంద్రియ పద్ధతుల్లో అనేక రకాల ఆకుకూరలు, కూరగాయలను పదేళ్లుగా పండిస్తున్నానని డా. శ్రీదేవి తెలిపారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం కొంత సేపు మొక్కల పనిలో గడుపుతానన్నారు.
పెద్ద కుండీలో దానిమ్మ చెట్టు ఫలాలనిస్తోంది. ఎక్కువ కుండీల్లో వంగ, మిరప, టమాటా పండిస్తున్నారు. ఎత్తు తక్కువగా ఉండే వెడల్పాటి మట్టి కుండీలో కొత్తిమీర, పాలకూర సాగు చేస్తున్నారు. ఈ సీజన్ ప్రారంభంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ సబ్సిడీపై రూ. 3 వేలకు అందిస్తున్న ఇంటిపంటల కిట్‌ను కొనుగోలు చేశారు. వారు ఇచ్చిన సిల్పాలిన్ బెడ్స్‌లో టమాటాతోపాటు చిక్కుడు, గోరుచిక్కుడు, బెండ విత్తారు. మట్టిలో పశువుల ఎరువు కొంచెం కలిపిన మట్టి మిశ్రమం వాడుతున్నానని, నెలకోసారి ప్రతి కుండీకీ కొద్ది మొత్తంలో వర్మీ కంపోస్టు వాడుతున్నానని ఆమె తెలిపారు.
మొక్కలతో సంభాషిస్తూ వాటి బాగోగులు చూసే పనిలో నిమగ్నమైతే రోజంతా పనిచేసిన అలసట ఇట్టే మాయమవుతుందన్నారు. మొక్కలు మరింత ఏపుగా పెరగడం కోసం, చీడపీడల నివారణకు కంపోస్టు టీని, ట్రైకెడోర్మా విరిడి ద్రావణాన్ని కూడా వాడాలనుకుంటున్నానని డా. శ్రీదేవి తెలిపారు. తాను పండించుకున్న వంకాయలు, టమాటాల రుచి తనకెంతో ఇష్టమని ఆమె సంతృప్తిగా చెప్పారు. నగరవాసుల ఆరోగ్యదాయకమైన జీవనానికి సేంద్రియ ఇంటిపంటల సాగు చాలా అవసరమని అంటున్న డా. శ్రీదేవి ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ (రిటైర్డ్) సంగెం చంద్రమౌళి కుమార్తె. వివరాలకు 98495 66009 నంబరులో ఆయనను సంప్రదించవచ్చు.
- ఇంటిపంట డెస్క్ (intipanta@sakshi.com) ఫొటోలు: రాంపురి లావణ్యకుమార్