ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలోని మిర్చి తోటలో రైతులతో మాట్లాడుతున్న కేంద్ర సమగ్ర సస్యరక్షణ కేంద్రం శాస్త్రవేత్తలు
ఖమ్మం వ్యవసాయం: మిర్చిని ఆశించిన తెగుళ్ల ఉధృతిపై కేంద్ర సమగ్ర సస్యరక్షణ కేంద్రం బృందం సర్వే చేపట్టింది. తామర పురుగు ఉధృతి, పంట నష్టంపై ఆరా తీసింది. మిర్చిని ఆశించిన తెగుళ్లతో రైతులు నష్టపోతున్న తీరుపై ‘తెగులు తినేసింది.. దిగులే మిగిలింది’శీర్షికతో శుక్రవారం ‘సాక్షి’ప్రధాన సంచికలో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన రాష్ట్ర ఉద్యాన శాఖ.. తెగుళ్ల వల్ల జరిగిన పంట నష్టంపై సర్వే నిర్వహించాలని కేంద్ర సమగ్ర సస్యరక్షణ కేంద్రం నిపుణులను అభ్యర్థించింది.
దీంతో సస్యరక్షణ కేంద్రం సంయుక్త సంచాలకులు, కీటక శాస్త్రం నిపుణుడు డాక్టర్ అలంగీర్ సిద్ధిఖీ, కీటక శాస్త్రం నిపుణురాలు ఎస్.శ్వేత, రోగ నిపుణురాలు పి.సుధ బృందం శుక్రవారం ఖమ్మం జిల్లాలో పర్యటించింది. కూసుమంచి, కొణిజర్ల, ఏన్కూరు మండలాల్లోని పలు గ్రామాల్లో సాగు చేసిన మిర్చి క్షేత్రాలను పరిశీలించింది. ఈ బృందం వెంట ఖమ్మం జిల్లా ఉద్యాన శాఖ అధికారి జి.అనసూయ కూడా ఉన్నారు.
బృందం శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించాక రాష్ట్ర ఉద్యాన శాఖకు నివేదిక అందజేస్తుంది. బెంగళూరుకు చెందిన కేంద్ర ఉద్యాన పరిశోధనా శాస్త్రవేత్తలు నవంబర్ చివరి వారంలో తెలుగు రాష్ట్రాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తామర పురుగు ఆశించిన పూత, కాత, ఆకులు, మట్టి నమూనాలు సేకరించి పరీక్షలు జరిపారు.
అయితే నెల గడిచినా పూర్తి స్థాయిలో పురుగు నివారణకు సస్యరక్షణ చర్యలు గుర్తించకపోవడంతో పురుగు ఉధృతి పెరిగి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మిర్చి తోటలను తొలగించడం మొదలుపెట్టారు. దీనిపై ‘సాక్షి’లో కథనం రావడంతో శాస్త్రవేత్తల బృందం పురుగు ఉధృతి, పంటకు జరుగుతున్న నష్టాన్ని అంచనా వేసేందుకు పర్యటించింది.
Comments
Please login to add a commentAdd a comment