chili farmers
-
రైతు కంట్లో ‘కారం’..!
సాక్షి, వరంగల్: ఓవైపు ప్రకృతి ప్రకోపం.. మరోవైపు తామర తెగులుతో కుదేలైన మిర్చి రైతులు చేతికి అందివచ్చిన కాసింత పంటనైనా అమ్ముకుందామనుకుంటే నామమాత్రపు ధర కూడా రావడం లేదు. జెండా పాట పేరిట అత్యధిక ధరను కేవలం ముగ్గురు నుంచి నలుగురికే వర్తింపజేసి.. ఖరీదుదారులు మిగిలిన రైతులకు క్వింటాకు రూ.7 నుంచి రూ.12 వేలలోపే ధర నిర్ణయించడంతో సోమవారం వరంగల్‌లోని ఎనుమామూల వ్యవసాయ మార్కెట్లో రైతులు మెరుపు ధర్నా చేపట్టారు. యార్డులో కుర్చీలను ధ్వంసం చేశారు. పెద్ద ఎత్తున బస్తాలు రావడంతో.. శని, ఆదివారాలు సెలవు కావడంతో సోమవారం వరంగల్ మార్కెట్‌కు 25 వేలకుపైగా మిర్చి బస్తాలు వచ్చాయి. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన ఖరీదుదారులు, అడ్తిదారులు సిండికేట్‌గా ఏర్పడి తక్కువ ధరలు నిర్ణయించారు. జెండా పాటకింద అత్యధికంగా క్వింటాలుకు రూ.17,200 నిర్ణయించినా కేవలం ముగ్గురు నలుగురికే ఆ ధర ఇచ్చి.. ఆ తర్వాత మిగిలిన అన్ని రకాల మిర్చికి నాణ్యత ఉన్నా కూడా రూ.7 నుంచి రూ.13 వేల మధ్య ధర నిర్ణయించారు. దీంతో ఆగ్రహించిన రైతులు.. మోసమంటూ ఆందోళనకు దిగారు. క్వింటాలుకు రూ.నాలుగు నుంచి రూ.ఆరువేల వరకు వ్యత్యాసం ఏమిటని అధికారులను నిలదీశారు. దాదాపు మూడు గంటలపాటు అధికారులు, వ్యాపారులు చర్చలు జరిపినా ఎటువారు అటు వెళ్లిపోయారు. ఇక చాంబర్ ఆఫ్ కామర్స్ అధికారులు రైతులను మిర్చి బస్తాలను కోల్డ్‌స్టోరేజీల్లో పెట్టి మంగళవారం మార్కెట్‌కు తీసురావాలని సలహా ఇచ్చి అక్కడినుంచి జారుకున్నారు. రైతులు మాత్రం తమకు గిట్టుబాటు ఇచ్చేవరకు వెళ్లేది లేదని స్పష్టంచేశారు. వరంగల్ ఆర్డీఓ మహేందర్‌జీ మార్కెట్‌ను సందర్శించి వ్యాపారులతో చర్చలు జరిపారు. ధర్నా కారణంగా మిర్చి కొనుగోళ్లు నిలిచిపోవడంతో ఆ సరుకు మొత్తాన్ని మంగళవారం కొనుగోలు చేయాలని ఆదేశించారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు. -
మిరప రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలి: చాడ
సాక్షి, హైదరాబాద్: తామర పురుగుతో తీవ్రంగా నష్టపోయిన మిరప రైతులకు ఎకరాకు రూ.లక్ష నష్ట పరిహారం ఇవ్వాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి బుధవారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ఖమ్మం, మహబూబ్‌నగర్, సూర్యాపేట, వరంగల్, నల్లగొండ, కరీంనగర్, సిద్దిపేట తదితర జిల్లాల్లో వేసిన మిరప తోటలను వారం రోజుల్లోనే తామర పురుగు సర్వ నాశనం చేశాయని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా తామర పురుగుతో ఎన్ని ఎకరాల్లో నష్టం వాటిల్లిందో అధికారులతో సర్వే చేయించి, రైతులను ఆదుకోవాలని చాడ కోరారు. -
తెగుళ్ల తీవ్రతెంత.. పంట నష్టమెంత?
ఖమ్మం వ్యవసాయం: మిర్చిని ఆశించిన తెగుళ్ల ఉధృతిపై కేంద్ర సమగ్ర సస్యరక్షణ కేంద్రం బృందం సర్వే చేపట్టింది. తామర పురుగు ఉధృతి, పంట నష్టంపై ఆరా తీసింది. మిర్చిని ఆశించిన తెగుళ్లతో రైతులు నష్టపోతున్న తీరుపై ‘తెగులు తినేసింది.. దిగులే మిగిలింది’శీర్షికతో శుక్రవారం ‘సాక్షి’ప్రధాన సంచికలో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన రాష్ట్ర ఉద్యాన శాఖ.. తెగుళ్ల వల్ల జరిగిన పంట నష్టంపై సర్వే నిర్వహించాలని కేంద్ర సమగ్ర సస్యరక్షణ కేంద్రం నిపుణులను అభ్యర్థించింది. దీంతో సస్యరక్షణ కేంద్రం సంయుక్త సంచాలకులు, కీటక శాస్త్రం నిపుణుడు డాక్టర్ అలంగీర్ సిద్ధిఖీ, కీటక శాస్త్రం నిపుణురాలు ఎస్.శ్వేత, రోగ నిపుణురాలు పి.సుధ బృందం శుక్రవారం ఖమ్మం జిల్లాలో పర్యటించింది. కూసుమంచి, కొణిజర్ల, ఏన్కూరు మండలాల్లోని పలు గ్రామాల్లో సాగు చేసిన మిర్చి క్షేత్రాలను పరిశీలించింది. ఈ బృందం వెంట ఖమ్మం జిల్లా ఉద్యాన శాఖ అధికారి జి.అనసూయ కూడా ఉన్నారు. బృందం శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించాక రాష్ట్ర ఉద్యాన శాఖకు నివేదిక అందజేస్తుంది. బెంగళూరుకు చెందిన కేంద్ర ఉద్యాన పరిశోధనా శాస్త్రవేత్తలు నవంబర్ చివరి వారంలో తెలుగు రాష్ట్రాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తామర పురుగు ఆశించిన పూత, కాత, ఆకులు, మట్టి నమూనాలు సేకరించి పరీక్షలు జరిపారు. అయితే నెల గడిచినా పూర్తి స్థాయిలో పురుగు నివారణకు సస్యరక్షణ చర్యలు గుర్తించకపోవడంతో పురుగు ఉధృతి పెరిగి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మిర్చి తోటలను తొలగించడం మొదలుపెట్టారు. దీనిపై ‘సాక్షి’లో కథనం రావడంతో శాస్త్రవేత్తల బృందం పురుగు ఉధృతి, పంటకు జరుగుతున్న నష్టాన్ని అంచనా వేసేందుకు పర్యటించింది. -
నకిలీ విత్తనాలపై మిరప రైతుల ఆందోళన
డోర్నకల్ : డోర్నకల్‌తో పాటు మన్నెగూడెం, వెన్నారం, ఉయ్యాలవాడ తదితర గ్రామాల్లో మిరప పంట సాగు చేస్తున్న రైతులు ఆందోళనకు చెందుతున్నారు. మిరప పంటలను సాగు చేస్తున్న పలువురు రైతులు చెట్లకు పూత, కాత తేడా ఉండడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవా, సీఎస్ 333 రకం విత్తనాలతో సాగు చేసిన రైతులు చెట్లకు ఆశించినంత కాపు లేదని, కాయలు చిన్నగా లావుగా ఉండి కాపు తక్కువ ఉందంటూ ఫర్టిలైజర్ దుకాణ యజమానులతో వాగ్వాదానికి దిగుతున్నారు. పలువురి రైతుల ఫిర్యాదు మేరకు మంగళవారం ఏఓ పద్మజ ఫర్టిలైజర్ దుకాణాల్లో విచారణ చేశారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఏఓ తెలిపారు. నర్సింహులపేటలో నర్సింహులపేట : నకిలీ మిరప విత్తనాలు విక్రయించారంటూ దంతాలపల్లిలోని పర్టిలైజర్ దుకాణాల ఎదుట రైతులు మంగళవారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. నకిలీమిరప విత్తనాలు ఇవ్వడంతో మొక్క ఎదుగుదల, కాత, పూత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దుకాణా యజమానులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. లేని పక్ష్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మండలంలోని దాట్ల, బీరిశెట్టిగూడెం, అగపేట, తూర్పుతండా, పడమటిగూడెంలకు చెందిన రైతులు రాము, వీరన్న, లచ్చిరాం, చైతన్యరెడ్డి, వెంకట్‌రెడ్డి, రవీందర్, లచ్చిరాం, సుధాకర్, నర్సింహరావు, ప్రసాద్, సోమ్లా, ధర్మాతో పాటు పలువురు పాల్గొన్నారు. -
కోల్డ్ స్టోరేజ్‌లో భారీ అగ్ని ప్రమాదం
గుంటూరు జిల్లా ఎడ్లపాడులోని సీఆర్ కోల్డ్ స్టోరేజ్‌లో బుధవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పై భాగంలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. శీతల గోదాములో కోట్ల రూపాయల విలువైన మిర్చి నిల్వ ఉన్నట్టు సమాచారం. పూర్తి వివరాలు అందాల్సి ఉంది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉంటుందని రైతులు భావిస్తున్నారు. -
మార్కెట్‌యార్డు వద్ద మిర్చి రైతుల ఆందోళన
హిందూపురం మార్కెట్‌యార్డు వద్ద రోడ్డుపై మిర్చి రైతులు ఆందోళనకు దిగారు. మిర్చి ధర అమాంతం తగ్గిపోవడంతో రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. పోయిన వారం మిర్చి పది కేజీల ధర రూ.1800 ఉండగా..మంగళవారానికి రూ. 1300కు పడిపోయిందని రైతులు వాపోయారు. అధికారులు తమ న్యాయం చేయాలని నినాదించారు. రైతుల రాస్తారోకోతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.