మార్కెట్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నిస్తున్న మిర్చి రైతులు
సాక్షి, వరంగల్: ఓవైపు ప్రకృతి ప్రకోపం.. మరోవైపు తామర తెగులుతో కుదేలైన మిర్చి రైతులు చేతికి అందివచ్చిన కాసింత పంటనైనా అమ్ముకుందామనుకుంటే నామమాత్రపు ధర కూడా రావడం లేదు. జెండా పాట పేరిట అత్యధిక ధరను కేవలం ముగ్గురు నుంచి నలుగురికే వర్తింపజేసి.. ఖరీదుదారులు మిగిలిన రైతులకు క్వింటాకు రూ.7 నుంచి రూ.12 వేలలోపే ధర నిర్ణయించడంతో సోమవారం వరంగల్‌లోని ఎనుమామూల వ్యవసాయ మార్కెట్‌లో రైతులు మెరుపు ధర్నా చేపట్టారు. యార్డులో కుర్చీలను ధ్వంసం చేశారు.
పెద్ద ఎత్తున బస్తాలు రావడంతో..
శని, ఆదివారాలు సెలవు కావడంతో సోమవారం వరంగల్ మార్కెట్‌కు 25 వేలకుపైగా మిర్చి బస్తాలు వచ్చాయి. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన ఖరీదుదారులు, అడ్తిదారులు సిండికేట్‌గా ఏర్పడి తక్కువ ధరలు నిర్ణయించారు. జెండా పాటకింద అత్యధికంగా క్వింటాలుకు రూ.17,200 నిర్ణయించినా కేవలం ముగ్గురు నలుగురికే ఆ ధర ఇచ్చి.. ఆ తర్వాత మిగిలిన అన్ని రకాల మిర్చికి నాణ్యత ఉన్నా కూడా రూ.7 నుంచి రూ.13 వేల మధ్య ధర నిర్ణయించారు.
దీంతో ఆగ్రహించిన రైతులు.. మోసమంటూ ఆందోళనకు దిగారు. క్వింటాలుకు రూ.నాలుగు నుంచి రూ.ఆరువేల వరకు వ్యత్యాసం ఏమిటని అధికారులను నిలదీశారు. దాదాపు మూడు గంటలపాటు అధికారులు, వ్యాపారులు చర్చలు జరిపినా ఎటువారు అటు వెళ్లిపోయారు. ఇక చాంబర్ ఆఫ్ కామర్స్ అధికారులు రైతులను మిర్చి బస్తాలను కోల్డ్‌స్టోరేజీల్లో పెట్టి మంగళవారం మార్కెట్‌కు తీసురావాలని సలహా ఇచ్చి అక్కడినుంచి జారుకున్నారు.
రైతులు మాత్రం తమకు గిట్టుబాటు ఇచ్చేవరకు వెళ్లేది లేదని స్పష్టంచేశారు. వరంగల్ ఆర్డీఓ మహేందర్‌జీ మార్కెట్‌ను సందర్శించి వ్యాపారులతో చర్చలు జరిపారు. ధర్నా కారణంగా మిర్చి కొనుగోళ్లు నిలిచిపోవడంతో ఆ సరుకు మొత్తాన్ని మంగళవారం కొనుగోలు చేయాలని ఆదేశించారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment