
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ కులగణన సర్వే (telangana census survey)నిర్వహించింది. అయితే తొలిసారి నిర్వహించిన సర్వేలో పలు కారణాల వల్ల 3.1 శాతం మంది పాల్గొనలేదు. ఇప్పుడు వారి కోసం మరోసారి కులగణన సర్వే చేపట్టనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) ప్రకటించారు. మరోసారి కులగణన చేపడితే తాము పాల్గొంటామంటూ పలువురు ప్రభుత్వానికి విజ్ఞప్తులు పంపారు. ఆ విజ్ఞప్తులపై భట్టి విక్రమార్క మీడియా సమావేశంలో మాట్లాడారు.
‘తెలంగాణ మరోసారి సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే ఉంటుంది. తొలిసారి చేపట్టిన కులగణన సర్వేలో ఎవరైతే పాల్గొనలేదో వారికి మరోసారి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి ఈ నెల 16 నుంచి 18 మధ్య మరోసారి కులగణన సర్వే నిర్వహిస్తున్నాం.
సర్వేలో పాల్గొనే వాళ్ళు టోల్ ఫ్రీ, మండల కేంద్రాలు, ఆన్లైన్ ద్వారా సర్వేలో పాల్గొనవచ్చు..కేసీఆర్ (kcr), కేటీఆర్ లాంటి వాళ్లకు మరో అవకాశం ఇస్తున్నాం. రాష్ట్ర జనాభాలో వీళ్ళు చేరాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మార్చి మొదటి వారంలో కేబినెట్ ఆమోదం తెలుపుతాం. ఎన్నికల వాగ్దానం మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తాం. రాబోయే అసెంబ్లీలో బిల్లు పెట్టి.. చట్టం చేస్తాం.
అసెంబ్లీలో బిల్లు ఆమోదం తెలిపి..కేంద్రానికి పంపుతాం. త్వరలోనే తెలంగాణ నుంచి బృందంగా వెళ్లి ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులు, పార్లమెంట్ పెద్దలను కలుస్తాం. కేంద్రం వద్దకు వెళ్లినప్పుడు కలిసివచ్చే రాజకీయ పార్టీలను తీసుకెళ్తాం. దశాబ్దాల బీసీ కల త్వరలోనే నెరవేర్చబోతున్నాం. ఓబీసీల లక్ష్యాలను సాధించడానికి సహకరించిన వారికి ధన్యవాదాలు. బీసీ రిజర్వేషన్లు ప్రకటన తర్వాతే పంచాయతీ ఎన్నికలు ఉంటాయి. బీసీ రిజర్వేషన్లు కల్పించడానికి కేంద్రం చట్టబద్ధత కల్పిస్తుందని ఆశిస్తున్నాం. మా పార్టీ ఎంపీలే కాదు...అన్ని పార్టీల ఎంపీలను కలుపుకోని వెళ్తాం.’ అని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.
👉చదవండి : రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణపై ఫౌరసరఫరాల శాఖ కీలక ప్రకటన!