
అరుదైన చేపలతో పాటు రెండు రకాల కొత్త పీతల జాతులు
జపాన్, ఫ్రెంచ్ పాలినేషియా, ఆ్రస్టేలియాకే పరిమితమైన ఇవి ఇప్పుడు ఏపీలోనూ..
తొలిసారి విశాఖ తీరం, సంతపల్లి రాక్స్ వద్ద వేల్ షార్క్ ఉన్నట్టు గుర్తింపు
జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తాజా పరిశోధనలో వెల్లడి
ఏపీలో తొలి సముద్ర గర్భ అధ్యయనం ఇదే
విశేష మత్స్యసంపదకు పేరు గాంచిన ఏపీలోని తూర్పుతీరానికి ఇప్పుడు కొత్త చేపలొచ్చాయ్. సుమారు 11 రకాల కొత్త చేపల జాతులు తాజా సర్వేలో బయటపడినట్టు సమాచారం. దేశంలోనే అతి పెద్ద సర్వేగా జెడ్‌ఎస్‌ఐ (జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) దీన్ని నిర్వహించింది. సుమారు నాలుగేళ్లపాటు చేసిన పరిశోధనల్లో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చినట్లు జెడ్‌ఎస్‌ఐ తన అధ్యయనంలో వెల్లడించింది. – సాక్షి ప్రతినిధి, అనంతపురం
కొత్త చేపల జాతులు
ఏపీలో కొన్ని చేపల రకాలకు భారీ డిమాండ్ ఉంది. పులస, వంజరం, కచ్చిడి వంటివి ప్రసిద్ధి. ఇక చిన్న చిన్న గుర్తింపులేని చేపల జాతులు చాలానే ఉన్నాయి. తాజాగా... జెడ్‌ఎస్‌ఐ సర్వేలో 11 రకాల ప్రముఖ చేపల జాతులు తూర్పుతీర సముద్రగర్భంలో ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు.
ఇందులో ఎంటోమాక్రోడస్ థాలసినన్ అనే రీఫ్ ఫిష్‌ను తొలిసారి కనుగొన్నారు. గతంలో ఈ చేప జపాన్, ఫ్రెంచ్ పాలినేషియా, ఆ్రస్టేలియా, శ్రీలంక, పాపువా న్యూగినియా, ఫిలిప్పీన్స్, న్యూ కాలెడోనియా, మడగాస్కర్‌లకే పరిమితమై ఉండేది. కానీ ఇప్పుడు దీని ఉనికిని ఆంధ్రప్రదేశ్‌లోనూ కనుగొనడం విశేషం.
విశాఖ తీరంలో ‘వేల్’
ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం కలిగిన వేల్ షార్క్ విశాఖలోని సంతపల్లి రాక్స్ దగ్గర కనిపించినట్టు జెడ్‌ఎస్‌ఐ వెల్లడించింది. ప్రసిద్ధి చెందిన ఈ జాతులు అరుదుగా కనిపిస్తాయని పేర్కొంది. ఈ మొత్తం అధ్యయనంలో విస్తృతమైన జీవవైవిధ్యాన్ని పరిశీలించినప్పుడు 91 జాతులు, 33 కుటుంబాలకు చెందిన జీవరాశులను గుర్తించినట్టు పరిశోధనలో తెలిసింది. అంతేకాదు బ్రాచ్యురాన్ పీతలు కూడా ఉన్నట్టు బయటపడింది.
ఈ పీతల జాతులు అరుదుగా ఉన్నాయని, ఇవి కనుమరుగయ్యే పరిస్థితి ఉందని, ఈ అధ్యయనం వల్ల ఇలా అంతరించి పోతున్న జాతులను కాపాడుకునే వీలుంటుందని సర్వే తేల్చింది. తాజాగా గుర్తించిన చేపల జాతులు క్యాన్సర్ వ్యతిరేక ట్యూమర్ (కణితులు)లు నియంత్రించడం, యాంటీ వైరల్ లక్షణాలతో కూడిన సమ్మేళనాలను ఉత్పత్తి చేస్తాయని పేర్కొంది.
లోతుగా సర్వే
సముద్ర ఉపరితలం నుంచి 8 మీటర్ల నుంచి 24 మీటర్ల లోతులో ఈ అధ్యయనం చేసినట్టు జెడ్‌ఎస్‌ఐ ప్రతినిధులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తీరప్రాంతానికి మానవ కార్యకలాపాలు, వాతావరణ మార్పుల నుంచి ప్రమాదం పొంచి ఉందని, దీనినుంచి సముద్రజాతులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తేల్చారు.
చాలా జాతులు సముద్ర ఉష్ణోగ్రతలు, ఆమ్లీకరణ, రసాయన కాలుష్యం, ప్లాస్టిక్ కాలుష్యం కోరల్లో చిక్కుకున్నట్టు తేల్చారు. ఏపీ తీరం వెంబడి ప్రధానంగా తిమింగలం, సొరచేపల కోసం వెదుకులాట ఎక్కువగా ఉన్నట్టు కూడా కనుగొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment