సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కూరగాయల ఉత్పత్తిని గణనీయంగా పెంచేందుకు ఉద్యానశాఖ ప్రణాళిక రచించింది. 2020–21 వానాకాలం, యాసంగి సీజన్లలో 36 లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయలను ఉత్పత్తి చేయాలని నిర్దేశించింది. ఈ మేరకు మంగళవారం ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేశారు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా సరిపడా కూరగాయలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలు, వంటనూనెలు వంటివి మన రాష్ట్రంలోనే పండించుకోవాలనేది ఉద్యానశాఖ లక్ష్యం. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గించుకోవాలని నిర్ణయించింది.
కూరగాయల దిగుమతికి చెక్ పెట్టేలా..
రాష్ట్రంలో ప్రస్తుతం 3.52 లక్షల ఎకరాల్లో కూరగాయల సాగు జరుగుతోంది. ఏటా 30.71 లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయలు దిగుబడి అవుతున్నాయి. దాదాపు 20 రకాలకు పైగా కూరగాయలను పండిస్తున్నాం. రాష్ట్ర ప్రజలు ఏడాదికి 36 లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయలను వినియోగిస్తున్నారు. ఒక్కో వ్యక్తి ఏడాదికి సరాసరి 90 కిలోల కూరగాయలు వినియోగిస్తున్నాడు. ఆ ప్రకారం ఏటా రూ.11,130 కోట్లు కూరగాయలకు ఖర్చు చేస్తున్నారు. అయితే మనం పండించే వాటిల్లో కొన్నింటిని అవసరానికి మించి, కొన్నింటిని అవసరానికన్నా తక్కువగా పండిస్తున్నాం. టమాట, వంకాయ, బెండ మొదలైన వాటిని అధికంగా ఉత్పత్తి చేస్తున్నాం. పండించిన వాటిలో 7.72 లక్షల మెట్రిక్ టన్నులను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నాం. అదే సమయంలో మన అవసరాలకు కావాల్సిన ఉల్లి, మిరప, బీర, సోర, కాకర, చిక్కుడు, దోస, ఆలు, క్యారెట్, ఆకుకూరలు వంటి 17 రకాలను 13 లక్షల మెట్రిక్ టన్నులు దిగుమతి చేసుకుంటున్నాం. ఈ 13 లక్షల మెట్రిక్ టన్నుల దిగుమతులను తగ్గించి, మన రాష్ట్ర అవసరాలకు పూర్తిగా సరిపడా కూరగాయలను పండించేందుకు ఉద్యానశాఖ ఈ ఏడాది 5.24 లక్షల ఎకరాలలో సాగు చేయాలని నిర్ణయించింది. ఈ వానాకాలంలో 2.47 లక్షల ఎకరాల్లో 17.64 లక్షల మెట్రిక్ టన్నులు, యాసంగిలో 2.77 లక్షల ఎకరాల్లో 18.36 లక్షల మెట్రిక్ టన్నులు పండిస్తారు.
రాష్ట్రంలో 12 రకాల పండ్ల సాగు..
మన రాష్ట్రంలో పండ్లు 4.35 లక్షల ఎకరాలలో సాగవుతున్నాయి. ఏడాదికి 22.97 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి అవుతున్నాయి. రాష్ట్రంలో ముఖ్యంగా 14 రకాల పండ్ల వినియోగం జరుగుతుండగా, 12 రకాలు మన రాష్ట్రంలోనే పండుతున్నాయి. సగటున రాష్ట్ర జనాభా ఏడాదికి 12.44 లక్షల టన్నుల పండ్లను వినియోగిస్తున్నారు. అందుకోసం ప్రజలు ఏడాదికి రూ. 7,942 కోట్లు ఖర్చు చేస్తున్నారు. రాష్ట్రంలో మామిడి, బత్తాయి, నిమ్మ, బొప్పాయి, పుచ్చ మన అవసరాలకు మించి ఉత్పత్తి అవుతున్నాయి. 18.44 లక్షల మెట్రిక్ టన్నుల ఈ పండ్లను ఉత్తర భారత్‌కి ఎగుమతి చేస్తున్నాం. మన రాష్ట్రంలో కొరత ఉన్న అరటి, సపోట, నేరేడు, కర్బూజ, యాపిల్, పైన్ యాపిల్ పండ్లను ఏడాదికి 7.91 లక్షల మెట్రిక్ టన్నులు దిగుమతి చేసుకుంటున్నాం. యాపిల్, పైనాపిల్ రాష్ట్రంలో పండించేందుకు వీలుకాదు. మిగిలినవాటిని దాదాపు 65,866 ఎకరాలలో కొత్తగా దశల వారీగా పెంచేందుకు ప్రయత్నించాలని ఉద్యానశాఖ నిర్ణయించింది.
సుగంధ ద్రవ్యాలు..
రాష్ట్రంలో సుగంధ ద్రవ్య పంటలు 3.85 లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయి. ఏడాదికి 7.85 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి చేసుకుంటున్నాం. రాష్ట్రంలో 8 రకాల సుగంధ ద్రవ్యాలు వినియోగంలో ఉన్నాయి. పసుపు, ఎండు మిర్చి సాగులో రాష్ట్రం దేశంలోనే ప్రముఖ పాత్ర పోషిస్తోంది. వీటిని మన అవసరాలకు మించి సాగు చేస్తున్నాం. మన రాష్ట్రంలో తక్కువ విస్తీర్ణంలో ఉన్న ధనియాలు, వెల్లుల్లి, అల్లం, జీలకర్ర, చింతపండు మొదలైన పంటల స్వయం సమృద్ధి కోసం 95,646 ఎకరాల్లో పండించేలా రైతులను ప్రోత్సహించాలని ఉద్యానశాఖ యోచిస్తోంది.
దేశంలో 15 మిలియన్ టన్నుల నూనె దిగుమతి..
మన దేశ జనాభాకి 22 మిలియన్ టన్నుల వంట నూనెల అవసరం కాగా, కేవలం 7 మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాం. మిగిలిన 15 మిలియన్ టన్నుల నూనెను దిగుమతి చేసుకుంటున్నాం. ఈ మొత్తం దిగుమతుల్లో పామాయిల్ ఒకటే 60 శాతం. అంటే 9 నుంచి 10 మిలియన్ టన్నుల పామాయిల్ నూనెను సుమారు రూ.60 వేల కోట్లు వెచ్చించి మన దేశం దిగుమతి చేసుకుంటోంది. అందుకే ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాల్సిన అవసరముందని నివేదికలో వెల్లడించారు.
36 లక్షల టన్నుల కూరగాయల ఉత్పత్తే లక్ష్యం
Published Wed, Jul 8 2020 4:59 AM | Last Updated on Wed, Jul 8 2020 4:59 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment