సాక్షి, సంగారెడ్డి: అకాల వర్షం మళ్లీ బీభత్సం సృష్టించింది. అన్నదాతల ఆశలపై నీళ్లు కుమ్మరించింది. శుక్రవారం జిల్లాలో కురిసిన భారీ వర్షానికి పలు చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. కొండాపూర్ మండలం గొల్లపల్లి, తెర్పాల్, మునిదేవులపల్లి, ఎదురుగూడెం, హరిదాస్‌పూర్ గ్రామాల్లో గోదుమ, పసుపు, ఉల్లి పంటలు దెబ్బతిన్నాయి. ఇక మనూరు మండలంలోని పలు గ్రామాల్లో కంది, శనగ, ఉల్లి పంటకు నష్టం వాటిల్లింది. కానీ, జిల్లా వ్యవసాయ శాఖ శనివారం ప్రభుత్వానికి పంపించిన ప్రాథమిక అంచనా నివేదికలో మాత్రం కేవలం కల్హేర్, చేగుంట మండలాల్లో మాత్రమే పంటలు దెబ్బతిన్నట్లు పేర్కొంది. కొండాపూర్, మనూరు తదితర మండలాల్లో సంభవించిన పంటనష్టంపై ఈ నివేదికలో ప్రస్థావనే లేదు. వ్యవసాయ శాఖ సిబ్బంది క్షేత్ర స్థాయిలో సర్వే చేయకుండానే నష్టం లేదని సమాచారాన్ని ఇచ్చినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లా వర్షపాతం 14.2 మి.మీటర్లు
శుక్రవారం సాయంత్రం జిల్లా వ్యాప్తంగా ఈ దురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసిం ది. జిల్లా సగటు వర్షపాతం 14.2 మి.మీటర్లు
నమోదైంది. చేగుంట మండలంలో 35.4 మి.మీటర్లు, కల్హేర్ మండలంలో 22.2 మి.మీటర్ల వర్షం కురిసింది.
పంట నష్టం 350 హెక్టార్లే !
జిల్లాలో 350.8 హెక్టార్ల రబీ పంటలు వర్షార్పణమైనట్లు జిల్లా వ్యవసాయ శాఖ శనివారం ప్రభుత్వానికి ప్రాథమిక అంచనా నివేదిక పంపించింది. ఒక్క కల్హేర్ మండలంలోనే 326.8 హెక్టార్లు, చేగుంట మండలంలో 28 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు ఈ నివేదికలో పేర్కొంది.
కల్హేర్ మండలంలోని మూడు గ్రామాల పరిధిలో 320 హెక్టార్లలో మొక్కజొన్న, 4 హెక్టార్లలో గోదుమలు, 2.8 హెక్టార్లలో పొద్దుతిరుగుడు పంటలు దెబ్బతిన్నాయి.
చేగుంట మండలంలోని ఐదు గ్రామాల పరిధిలో 20 హెక్టార్ల మొక్కజొన్న, 4 హెక్టార్ల వేరుశనగ, మరో 4 హెక్టార్లలో పొద్దు తిరుగు డు పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ నివేదిక పంపింది. కానీ వాస్తవంగా పంటనష్టం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు కొన్ని మండలాల్లో మామిడి తదితర పండ్ల తోటలు, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లినట్లు సమాచారం అందుతున్నా, ఉద్యానశాఖ జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి ఎలాంటి నివేదిక పంపించలేదు.
అంచన... అంతా వంచన
Published Sun, Mar 2 2014 12:05 AM | Last Updated on Sat, Sep 2 2017 4:14 AM
Advertisement
Advertisement