నంద్యాల జిల్లా నాయినపల్లె సమీపంలో వర్షపు నీటితో నిండిన కదిరి కుంట
సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్: తీవ్రమైన ఎండలు మండే మే నెలలో ఎన్నడూలేని విధంగా రాష్ట్రమంతా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం రాత్రి నుంచి అనేక జిల్లాల్లో వర్షాలు దంచికొట్టాయి. ఎన్టీఆర్, కృష్ణా, పశ్చిమ గోదావరి, నంద్యాల, అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీవర్షాల కారణంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలంలో సోమవారం సాయంత్రం పిడుగుపాటుకు ఓ గొర్రెల కాపరి ముచ్చువోలు శ్రీనివాసులు (57)అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు.
ఓ ఎద్దు కూడా ఇదే కారణంగా మరణించింది. వేసవిలో రెండు, మూడ్రోజులు అకాల వర్షాలు పడడం సాధారణమే అయినా ఇప్పుడు ఏకంగా రోజుల తరబడి అది కూడా భారీ వర్షాలు కురుస్తుండడం వాతావరణంలో మార్పుల ప్రభావమేనని నిపుణులు చెబుతున్నారు.
అత్యధిక వర్షపాతం నమోదైన జిల్లాలివే..
గత 24 గంటల వ్యవధిలో అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా సగటున 44.98 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కృష్ణాజిల్లా వ్యాప్తంగా సగటున 43.61 మిమీ, పశ్చిమ గోదావరి జిల్లాలో 42.76, నంద్యాల జిల్లాలో 42.50, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 42.22, ఏలూరు జిల్లాలో 41.88.. వైఎస్సార్ జిల్లాలో 36.91, తూర్పు గోదావరి జిల్లాలో 35.47, ప్రకాశం జిల్లాలో 34.44, మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది.
► నెల్లూరు నగరంతోపాటు జిల్లాలోని ముత్తుకూరు, ఇందుకూరుపేట, కావలి, ఆత్మకూరు, అనంతసాగరం, కలువాయి తదితర మండలాల్లో చిరుజల్లుల నుంచి మోస్తరు వర్షం కురిసింది.
► ఉమ్మడి విశాఖ జిల్లా అంతటా కూడా సోమవారం వర్షాలు కురిశాయి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో కుండపోత కురిసింది. పాడేరు, అరకులోయ ప్రాంతాలలో మ.12 గంటల వరకు వర్షం కురుస్తునే ఉంది. అల్లూరి జిల్లా వ్యాప్తంగా 182.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. విశాఖ నగరం, అనకాపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా మధ్యాహ్నం వరకు వర్షాలు కురిశాయి.
ఎక్కువ వర్షం కురిసిన మండలాలు..
ఆదివారం దర్శి, త్రిపురాంతకం, కర్నూల్ అర్బన్, ప్రొద్దుటూరు, మాచర్ల, విస్సన్నపేట, వీరులపాడు, చెన్నూరు, గాలివీడు, చాగలమర్రి, నంబులిపులికుంట, పొదిలి, శ్రీశైలం, గుడివాడ, కర్నూలు రూరల్, బుట్టాయగూడెం, జుపాడు బంగ్లా, అమలాపురం, నందికొట్కూరు, పెదపారుపూడి, కొయ్యలగూడెం, ఎ.కొండూరు, కొనకనమిట్ల, కృష్ణగిరి, హనుమంతుపాడు మండలాల్లో ఎక్కువ వర్షపాతం నమోదైంది.
ప్రకాశం జిల్లా దర్శి మండలంలో 24 గంటల్లో 172.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కర్నూలు జిల్లాలో ఒక్క పెద్దకడుబూరు మినహా అన్ని మండలాల్లో వర్షాలు కురిశాయి. వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లోని పంట పొలాల్లో నీళ్లు నిలిచాయి. దిగుబడులు కాపాడుకునేందుకు పట్టాలు కప్పి రైతులు జాగ్రత్తపడుతున్నారు.
వాగులో చిక్కుకున్న ముగ్గురు వ్యక్తులు
ఇక అనంతపురం జిల్లాలో పెద్దవడుగూరులోని పందుల వాగులో ముగ్గురు వ్యక్తులు చిక్కుకున్నారు. తెల్లవారుజాము రెండు గంటల ప్రాంతంలో వీరు ఆటోలో ప్రయాణిస్తుండగా భారీ వర్షాలకు పొంగిపొర్లుతున్న ఈవాగులో ఆటో మొరాయించింది. దీంతో ఆటో కొట్టుకుపోతుండగా ఆ ముగ్గురూ నీటిలోకి దూకారు. వారూ కొట్టుకుపోతుండగా మధ్యలో ఓ కంపచెట్టు అందడంతో దానిని పట్టుకుని నిల్చుండిపోయి స్నేహితులకు సమాచారమిచ్చారు. జేసీబీ సాయంతో పోలీసులు గంటన్నరపాటు శ్రమించి వారిని రక్షించారు.
భారీ వర్షాలు మరో మూడ్రోజులు..
తూర్పు విదర్భ నుండి ఉత్తర తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంవల్లే ఈ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మరో మూడ్రోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇక మంగళవారం పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశమున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేద్కర్ తెలిపారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంగళవారం పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment