సాక్షి, హైదరాబాద్: ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో నగరంలో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ ప్రకటించింది. వర్షాల కారణంగా ఆరెంజ్ అలర్ట్‌ను జారీచేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో జీహెచ్‌ఎంసీ, జలమండలి, రెవెన్యూ, పోలీసు విభాగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షం కురిసే సమయంలో అత్యవసరమైతేనే బయటకు రావాలని హెచ్చరికలు జారీచేసింది.
ఆవర్తనం ప్రభావంతో బుధవారం నగరంలో మళ్లీ కురిసిన జడివాన బీభత్సం సృష్టించింది. సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. వందలాది బస్తీలు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ముంపు సమస్యలపై బల్దియా కాల్ సెంటర్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పలుచోట్ల ఇళ్లలోకి చేరిన వరద నీటిని తొలగించేందుకు జనం నానా అవస్థలు పడ్డారు. ప్రధాన రహదారులపై మోకాళ్ల లోతున వరద నీరు పోటెత్తింది. రాత్రి 10 గంటల వరకు అత్యధికంగా మచ్చబొల్లారంలో 9.3, ఎల్‌బీనగర్‌లో 8.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా జియాగూడ, రాజేంద్రనగర్‌లలో 4.8 సెం.మీ చొప్పున నమోదైంది.
వాహనదారులు, ప్రయాణికుల కష్టాలు..
సాయంత్రం ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థల నుంచి బయలుదేరిన వాహనదారులు, ప్రయాణికులు ట్రాఫిక్‌లో చిక్కుకొని ఆలస్యంగా ఇళ్లకు చేరుకున్నారు. భారీ వర్షానికి మూసీ నదికి వరద పోటెత్తింది. మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద మూసీ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను వేరే మార్గాల్లో మళ్లించారు. చాదర్‌ఘాట్ బ్రిడ్జి నుంచి నల్లగొండ క్రాస్ రోడ్డు వరకు భారీగా ట్రాఫిక్‌జాం ఏర్పడింది. వర్షం
సమయంలో అవసరమైతేనే బయటకు రావాలని నగరవాసులకు పోలీసులు హెచ్చరించారు.
ఈ ప్రాంతాల్లో దంచికొట్టింది..
మచ్చబొల్లారం, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, మలక్‌పేట, మెహిదీపట్నం, గోషామహల్, మంగళ్‌హాట్, ఆసిఫ్‌నగర్, జియాగూడ, పురానాపూల్, బహదూర్ పురా, ఫలక్‌నూమా, చాంద్రాయణగుట్ట, అఫ్జల్‌గంజ్, లక్డీకాపూల్, నాంపల్లి, పంజాగుట్ట, అమీర్‌పేట, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, సికింద్రాబాద్, కూకట్‌పల్లి, బాలానగర్, బోయిన్‌పల్లి, శేరిలింగంపల్లి, చిలకలగూడ, తిరుమలగిరి, మారేడుపల్లి, ప్యాట్నీ సెంటర్, బేగంపేట్, సోమాజిగూడ, రాంనగర్, తార్నాక, ఓయూ, అంబర్‌పేటలతో పాటు పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది.
చదవండి: ఎంజీఎం ఘటనపై ప్రభుత్వం సీరియస్
గంటల తరబడి ట్రాఫిక్‌జాం
జడివాన కారణంగా నగరంలో ట్రాఫిక్‌జాం సిటీజన్లకు చుక్కలు చూపించింది. వరద నీరు పోటెత్తడంతో సాయంత్రం 6 నుంచి రాత్రి పొద్దుపోయే వరకు పలు ప్రధాన రహదారులపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. గంటల తరబడి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. రహదారులపై నిలిచిన వరద నీటిని తొలగించేందుకు, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ట్రాఫిక్ పోలీసులు, బల్దియా అత్యవసర బృందాలు నానా కష్టాలు పడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment